'రంగస్థలం'

Fri Mar 30 2018 GMT+0530 (IST)

'రంగస్థలం'

చిత్రం : ‘రంగస్థలం’

నటీనటులు: రామ్ చరణ్ - సమంత - ఆది పినిశెట్టి - జగపతిబాబు  - ప్రకాష్ రాజ్ - అనసూయ - శత్రు - గెటప్ శీను - నవీన్ నేని - అజయ్ ఘోష్ - నరేష్ - రోహిణి - బ్రహ్మాజీ - తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: రత్నవేలు
నిర్మాతలు: నవీన్ యెర్నేని - రవిశంకర్ - మోహన్ చెరుకూరి
కథ - కథనం - దర్శకత్వం: సుకుమార్

ఈ ఏడాది తెలుగులో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ‘రంగస్థలం’ ఒకటి. సుకుమార్-రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రమిది. మూడు దశాబ్దాల కిందటి నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు ముందు నుంచి భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఆ అంచనాల్ని ఏమేరకు అందుకుందో చూద్దాం పదండి.

కథ:

గోదావరి ప్రాంతంలో రంగస్థలం అనే ఒక పల్లెటూరు.. అందులో చిట్టిబాబు (రామ్ చరణ్) అనే కుర్రాడు. ఆ ఊర్లో ఏ పొలంలో నీళ్లు తడపాలన్నా చిట్టిబాబునే అడగాలి. అతడి దగ్గర నీళ్లు తోడే మోటారుంటుంది. అతడికి సరిగా వినిపించదు. చిట్టిబాబుకు ఆ ఊర్లోనే ఉండే రామలక్ష్మి (సమంత) అంటే ఇష్టం. ఐతే తన అన్న కుమార్ బాబు (ఆది పినిశెట్టి) అంటే ప్రాణం. ఐతే ఆ ఊరికి 30 ఏళ్లుగా ఒకడే ప్రెసిడెంటు (జగపతిబాబు). అతడి అరాచకాల వల్ల జనం చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఐతే ఈ అన్యాయాన్ని సహించలేక కుమార్ బాబు.. ప్రెసిడెంటు మీద ఎన్నికల్లో పోటీకి సిద్ధపడతాడు. దాని వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘రంగస్థలం’ సినిమా మీద ఏవో అంచనాలు పెట్టుకుని రావొద్దని సుకుమార్ ప్రేక్షకుల్ని కోరాడు. నిజమే.. గత సుకుమార్ సినిమాలు చూసి.. విభిన్నమైన కథ.. ప్రేక్షకుల బుర్రలకు పరీక్ష పెట్టే కథనం.. సుకుమార్ మార్కు లాజిక్ తో నడిచే సన్నివేశాలు ఆశించి సినిమాకు వెళ్తే అవేవీ ఇందులో కనిపించవు. సగటు ప్రేక్షకుడి ఆలోచన స్థాయిని దాటిపోయి.. కొన్నేళ్ల ముందుకెళ్లి సినిమాలు తీస్తూ వచ్చిన సుకుమార్.. ఈసారి మూడు దశాబ్దాల వెనక్కి వెళ్లి అందరికీ అర్థమయ్యే సినిమానే తీశాడు. తెలుగు సినిమా మరిచిపోయిన పల్లెటూరి నేపథ్యంలోకి వెళ్లి.. స్వచ్ఛమైన భావోదేవాద్వేగాలతో ఒక కథను చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక్కడ సుకుమార్ ముద్ర కోసం వెదికితే కష్టం.

తనదైన శైలిలో.. విభిన్నంగా కథాకథనాలతో ప్రేక్షకుల్ని అడుగడుగునా ఆశ్చర్యపరచడం సుకుమార్ శైలి. ఐతే సుకుమార్ ‘రంగస్థలం’ లాంటి సినిమా తీయడం ఆశ్చర్యపరుస్తుందే తప్ప ఇందులో కథాకథనాలు అంతగా ఆశ్చర్యపరచవు. ఇలాంటి మెలో డ్రామా.. సెంటిమెంట్ సీన్లు సుకుమార్ సినిమాలో అసలు ఊహించలేం. ఇదొక పల్లెటూరి నేపథ్యంలో సాగే సగటు రివెంజ్ డ్రామా. ‘రంగస్థలం’లో కథాకథనాల కంటే కూడా 80ల నాటి పల్లెటూరి వాతావరణాన్ని తెరపై ప్రతిబింబించిన తీరు.. ఆ యాంబియన్స్ ఎక్కువ మెప్పిస్తాయి. దీన్ని ఆస్వాదించగలిగిన వాళ్లకు ‘రంగస్థలం’ ప్రత్యేకంగా అనిపిస్తుంది. జీవం ఉట్టిపడే.. స్వచ్ఛంగా.. సహజంగా అనిపించే పాత్రలు.. వాటికి తగ్గట్లు నటీనటుల అద్భుత అభినయం.. దీనికి తోడు సినిమా మూడ్ కు తగ్గ సంగీతం.. ఛాయాగ్రహణ ప్రతిభ.. అబ్బురపరిచే ఆర్ట్ వర్క్.. ఇతర సాంకేతిక నైపుణ్యాలు కలిసి ‘రంగస్థలం’ను  ప్రత్యేకంగా నిలబెట్టే ప్రయత్నం చేశాయి. కాకపోతే అన్ని నైపుణ్యాలు కలిసినా.. కొత్తగా అనిపించని కథాకథనాలు.. సాగతీతగా అనిపించే కొన్ని సన్నివేశాలు.. అక్కడక్కడా హద్దులు దాటిన మెలోడ్రామా సినిమా గ్రాఫ్ ను తగ్గిస్తాయి.

ఎప్పుడూ ఓ వర్గం ప్రేక్షకులకే నచ్చే... అర్థమయ్యే ఇంటిలిజెంట్ స్క్రీన్ ప్లేతో కన్ఫ్యూజ్ చేస్తాడని పేరున్న సుకుమార్.. ఈసారి తన శైలిని విడిచిపెట్టాడు. ఒక మామూలు కథను.. ఫ్లాట్ స్క్రీన్ ప్లేతోనే చెప్పే ప్రయత్నం చేశాడు. ఐతే కథాకథనాల సంగతలా వదిలేస్తే.. రామ్ చరణ్ సహా కొన్ని పాత్రల్ని తీర్చిదిద్దిన విధానంలో సుకుమార్ ముద్ర కనిపిస్తుంది. హీరోను చెవిటి వాడిగా చూపించిన సాహసమే సినిమాకు బలమైంది. సుకుమార్ ఆ వైకల్యాన్నే పాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగించుకోవడం విశేషం. ‘సౌండ్ ఇంజినీర్’గా చరణ్ చేష్టలే ప్రథమార్ధానికి పెద్ద బలం. సినిమా అంతటా ఒక సిగ్నేచర్ స్టయిల్ క్రియేట్ చేసి.. దాని ద్వారా వినోదాన్ని పండించిన తీరు మెప్పిస్తుంది. అలాగే సెంటిమెంట్ సీన్లకూ దీన్ని బాగానే వాడుకున్నారు. చరణ్ ఆశ్చర్యపరిచే నటనతో చిట్టిబాబు పాత్రను పండించడంతో ప్రథమార్ధాన్ని దాదాపుగా ఆ క్యారెక్టరే నడిపించేసింది. సమంత కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలన్నీ చాలా బాగా వచ్చాయి. వినోదాన్ని పంచాయి. జగపతి బాబు చేసిన ప్రెసిడెంట్ పాత్ర కూడా ఆరంభంలో ఆసక్తి రేకెత్తిస్తుంది.

ప్రథమార్ధంలో చాలా వరకు పాత్రల పరిచయం.. వాటి ఎస్టాబ్లిష్మెంట్ మీదే నడుస్తుంది. కథ మలుపు తిరిగేది విరామం దగ్గరే. ద్వితీయార్ధంపై ఆసక్తి రేకెత్తించే ఇంటర్వెల్ బ్యాంగ్ తో సుకుమార్ ప్రేక్షకుల్ని అరెస్ట్ చేయగలిగాడు. ప్రథమార్ధం వేగంగా.. ఆసక్తికరంగా సాగిపోయి ద్వితీయార్ధంపై అంచనాలు పెంచుకునేలా చేస్తుంది. కానీ రెండో అర్ధం ఆ అంచనాలు అందుకోలేకపోతుంది. ఇంటర్వెల్ ముంగిట సన్నివేశం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తే.. ఆ తర్వాత ఆ టెంపోను కొనసాగించే సన్నివేశాలు ద్వితీయార్ధంలో లేకపోయాయి. ఒక సీన్లో పైకి లేవడం.. ఇంకో సీన్లో దబ్బున కింద పడటం.. ఇలా గ్రాఫ్ హెచ్చు తగ్గులతో సాగుతుంది. ప్రెసిడెంటు మీద పోటీకి సై అన్న హీరో.. అతడి సోదరుడు.. ఎలా ఊళ్లో జనాల మనసుల్ని గెలిచారనే విషయాన్ని ఆసక్తికరంగా చూపించలేకపోయాడు సుకుమార్. ఈ దిశగా బలంగా అనిపించే సన్నివేశాలే పడలేదు.

ప్రథమార్ధంలో చాలా ఆసక్తికరంగా అనిపించిన జగపతిబాబు పాత్రను ద్వితీయార్దంలో తేల్చి పడేశారు. ఆ పాత్రను సరిగ్గా ఉపయోగించుకోలేదు. మంచి పాటలు.. సన్నివేశాలు.. అన్నీ కూడా ప్రథమార్ధానికే పరిమితం చేసేసినట్లు అనిపిస్తుంది. జిగేల్ రాణి రూపంలో మాంచి మసాలా పాట పడ్డప్పటికీ.. అంతకుమించి పాటల పరంగా ప్రత్యేకత ఏమీ కనిపించదు ద్వితీయార్ధంలో. అలాగే ఎంటర్టైన్మెంట్ లేని లోటు కూడా కనిపిస్తుంది. మెలో డ్రామా.. సెంటిమెంట్ డోస్ ఎక్కువైపోయి కథనం సాగతీతగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రి క్లైమాక్స్ దగ్గర సినిమా కొంచెం భారంగా మారుతుంది. ఐతే క్లైమాక్స్ లో ఒక సర్ప్రైజ్ తో థ్రిల్లర్ సినిమాలా సినిమాను ముగించే ప్రయత్నం జరిగింది. ఆ ట్విస్ట్ ఊహించలేనిదేమీ కాదు కానీ.. పతాక సన్నివేశం మెప్పిస్తుంది. చరణ్ చక్కటి అభినయంతో దాన్ని నిలబెట్టాడు.

సుకుమార్ సినిమాలంటే మామూలుగా సుకుమార్ గురించే మాట్లాడి మిగతా విషయాల గురించి చర్చించాలి. ఐతే ‘రంగస్థలం’ విషయానికి వస్తే ముందు చరణ్ నటన గురించి మాట్లాడి తర్వాత సుకుమార్ ప్రస్తావన తేవాల్సి ఉంటుంది. ఈ చిత్రంలో అత్యంత ప్రత్యేకంగా అనిపించేది చరణ్ పాత్ర.. అతడి నటన అంటే అతిశయోక్తి లేదు. సినిమా విషయంలో సుకుమార్ అన్నట్లుగా ఏవో అంచనాలు పెట్టుకోకూడదు. కానీ చరణ్ పాత్ర విషయంలో మాత్రం ఎంతగా అంచనాలు పెట్టుకున్నా ఓకే.. అతను సంతృప్తి పరుస్తాడు. ఆశ్చర్యపరుస్తాడు. చరణ్ పాత్రలాగే సినిమా కూడా ఉండుంటే ‘రంగస్థలం’ స్థాయే వేరుగా ఉండేదే. ఈ సినిమాలో ఏ సన్నివేశం బాగా లేదని లేదు. ఏ సీన్ కూడా తీసిపడేసేలా లేదు. అయినప్పటికీ ఇంకా ఏదో ప్రత్యేకంగా ఉండాల్సిందన్న అసంతృప్తి ప్రేక్షకుడికి కలగొచ్చు.

నటీనటులు:

నిస్సందేహంగా రామ్ చరణ్ కెరీర్లో ‘రంగస్థలం’ ఒక మైలురాయే. చరణ్ నట సామర్థ్యంపై ఉన్న సందేహాలన్నింటినీ చిట్టిబాబు పాత్ర తొలగించేస్తుంది. అతడిని ఒక గొప్ప నటుడిగా ఈ చిత్రం పరిచయం చేస్తుంది. సినిమాలో ఎక్కడా రామ్ చరణ్ కనిపించడంటే అతిశయోక్తి కాదు. నటన పరంగా గత సినిమాల ఛాయలేవీ కనిపించకుండా.. చాలా కొత్తగా కనిపించాడు చరణ్. ఫలానా సీన్ అని కాకుండా సినిమా అంతటా అతను తన నటనతో కట్టిపడేశాడు. లుక్.. బాడీ లాంగ్వేజ్.. డైలాగ్ డెలివరీ.. హావభావాలు.. ఇలా ప్రతి విషయంలోనూ మెప్పించాడు. సమంత కూడా చాలా బాగా నటించి మెప్పించింది. కాసేపటికే సమంతను కూడా మరిచిపోయి రామలక్ష్మిగానే ఆమెను చూస్తాం. ఆది పినిశెట్టి చాలా సులువుగా తన పాత్రలో ఒదిగిపోయాడు. సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. జగపతిబాబు కూడా బాగా చేశాడు కానీ.. కొన్ని చోట్ల ఆ పాత్ర కొంచెం కృత్రిమంగా అనిపిస్తుంది. ద్వితీయార్దంలో ఆ పాత్ర తేలిపోయింది. అనసూయ తనకున్న గ్లామర్ ఇమేజ్ ను దాటి చక్కటి నటనతో ఆకట్టుకుంది. ఇంకా నరేష్.. రోహిణి.. అజయ్ ఘోష్.. బ్రహ్మాజీ.. రామ్ చరణ్ అసిస్టెంటుగా చేసిన జబర్దస్త్ నటుడు.. ఇలా ప్రతి ఒక్కరూ చక్కటి నటనతో ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం:

టెక్నీషియన్లందరూ ‘రంగస్థలం’కు పెద్ద బలంగా నిలిచారు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఆకట్టుకుంటాయి. టైటిల్ సాంగ్ తో పాటు రంగమ్మా మంగమ్మా.. ఎంత సక్కగున్నావే ఆకట్టుకుంటాయి. వీటి చిత్రీకరణ కూడా బాగుంది. జిగేల్ రాణి పాట కూడా బాగా తీశారు. దేవి నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు.. ఈ కథ నేపథ్యానికి తగ్గట్లుగా తన కెమెరాతో ఒక మూడ్ క్రియేట్ చేయడంలో.. సహజమైన పల్లెటూరి వాతావరణాన్ని చూపించడంలో విజయవంతమయ్యాడు. సినిమాలో అడుగడుగునా కెమెరా పనితనం కనిపిస్తుంది. ఇక ఆర్ట్ వర్క్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు సినిమాలో సెట్టింగ్స్ వేసిన విషయమే తలపులోకి రాదు. అంత సహజంగా పల్లెటూరి వాతావరణాన్ని చూపించారు. నిర్మాణ విలువల విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా నిర్మాతలు తమ అభిరుచిని చాటుకున్నారు. ఇక సుకమార్.. తనకు అలవాటైన శైలిని విడిచిపెట్టి.. ఒక పల్లెటూరి కథతో తన మూలాల్ని వెతుక్కునే ప్రయత్నం చేశాడు. అతను ఎంచుకున్న కథలో కొత్తదనం లేదు. ఐతే పాత్రల చిత్రణలో.. సన్నివేశాల్లో కొంత వైవిధ్యం చూపిస్తూ.. ఆసక్తికరంగా కథనాన్ని నడిపించే ప్రయత్నం చేశాడు. ఐతే ద్వితీయార్ధంలో సుకుమార్ తన ప్రత్యేకతను చూపించి ఉంటే.. క్రిస్ప్ గా కథనాన్ని నడిపించే ప్రయత్నం చేసి ఉంటే.. ‘రంగస్థలం’ మరో స్థాయిలో ఉండేది.

చివరగా: రంగస్థలం.. రామ్ చరణ్ సినిమా

రేటింగ్ -3/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS