‘పటేల్ సర్’

Sat Jul 15 2017 GMT+0530 (IST)

‘పటేల్ సర్’

చిత్రం : ‘పటేల్ సర్’

నటీనటులు: జగపతిబాబు - పద్మప్రియ - తన్య హోప్ - సుబ్బరాజు - కబీర్ సింగ్ దుల్హన్ - పృథ్వీ - శుభలేఖ సుధాకర్ తదితరులు
సంగీతం: డీజే వసంత్
ఛాయాగ్రహణం: శ్యామ్ కే నాయుడు
మాటలు: ప్రకాష్
నిర్మాత: రజిని కొర్రపాటి
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వాసు పరిమి

హీరోగా కెరీర్ చరమాంకానికి వచ్చేసిన దశలో విలన్.. క్యారెక్టర్ రోల్స్ లోకి మారి తిరుగులేని డిమాండ్.. క్రేజ్ సంపాదించుకున్నాడు జగపతిబాబు. కొన్నేళ్ల పాటు హీరో వేషాలకు దూరమైపోయిన ఆయన మళ్లీ ఇప్పుడు ‘పటేల్ సర్’ అనే సినిమా చేశాడు. హీరో అనిపించుకోవాలని ఈ సినిమా చేయలేదని.. కథలో.. పాత్రలో ఎంతో ప్రత్యేకత ఉంది కాబట్టే ఇందులో నటించానని చెప్పాడు జగపతి. మరి జేబీ చెబుతున్నట్లుగా ‘పటేల్ సర్’లో అంత ప్రత్యేకత ఏముందో చూద్దాం పదండి.

కథ:

సుభాష్ పటేల్ (జగపతిబాబు) రిటైర్డ్ ఆర్మీ మేజర్. అతడి దగ్గర ఓ చిన్న పాప ఉంటుంది. ఆ పాపను వెంట బెట్టుకుని వెళ్లి డ్రగ్స్ తయారు చేసే డీఆర్ అనే డాన్ కు చెందిన ముఠా సభ్యుల్ని ఒక్కొక్కరిగా చంపుతుంటాడు. ఈ కేసును ఛేదించడానికి కేథరిన్ (తన్య హోప్) అనే పోలీసాఫీసర్ వస్తుంది. ఆమె పటేల్ చేసే హత్యలకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తుంటుంది. ఐతే పటేల్ తన పని తాను చేసుకుపోతుంటాడు. అతను చివరి టార్గెట్ దగ్గరికి వచ్చేసరికి.. హత్యలు చేస్తున్నది పటేలే అని కనిపెట్టేస్తుంది కేథరిన్. ఇంతకీ ఆర్మీలో పని చేసి వచ్చిన పటేల్.. ఇలా హత్యలెందుకు చేస్తుంటాడు.. ఆ చిన్న పాపతో అతడికి సంబంధమేంటి.. అతను తాను చంపాలనుకున్న వాళ్లందరినీ చంపేశాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

ఓ కొత్త దర్శకుడు సినిమా మొదలుపెట్టడానికంటే ముందు ఆసక్తికరమైన టీజర్ తయారు చేసి ప్రేక్షకుల దృష్టిని కట్టిపడేయడమంటే మామూలు విషయం కాదు. ఆ దర్శకుడికి తాను తీయబోయే సినిమా మీద ఎంతో స్పష్టత.. పట్టు ఉంటే తప్ప ఇది సాధ్యమయ్యే విషయం కాదు. ‘పటేల్ సర్’ విషయంలో వాసు పరిమి మీద జనాలు చాలా అంచనాలు పెట్టుకోవడానికి అదే కారణం. కానీ ఈ దర్శకుడు తన నైపుణ్యమంతా ఆ టీజర్లో.. ప్రోమోల్లో మాత్రమే చూపించాడు. అది కాకుండా జగపతిబాబును నెవర్ బిఫోర్ లుక్ లో చూపించడం.. ఆయన యాటిట్యూడ్ ను ఎలివేట్ చేయడం.. ఆయన వరకు చక్కటి పెర్ఫామెన్స్ రాబట్టుకోవడం.. ఇంతవరకే దర్శకుడి ప్రతిభ పరిమితమైంది. ‘పటేల్ సర్’లో ఇంతకుమించి చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు.

పటేల్ సార్.. తన జీవితాన్నంతా దేశం కోసమే ధారబోస్తాడు. అతడికి దేశం అంటే ఎంత ప్రేమ అంటే.. తన కొడుకు ఆర్మీలో చేరలేదని.. అతణ్ని ఇంటి నుంచి వెళ్లగొట్టేస్తాడు. తర్వాత అతణ్ని కలవనే కలవడు. తర్వాత ఓ సందర్భంలో కొడుకు తనకు దగ్గరయ్యే లోపే అతడి కుటుంబం మొత్తాన్ని ఒక ముఠా నాశనం చేసేస్తుంది. దీంతో అతను ప్రతీకారం తీర్చుకునే పనిలో పడతాడు. తన కుటుంబానికి అంత నష్టం జరిగినపుడు.. ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకుంటున్నపుడు హీరోను మనం చూసే కోణం ఒకలా ఉంటుంది. ఆ కసి.. ఆ ఇంటెన్సిటీ ఒకలా ఉంటుంది.

కానీ ‘పటేల్ సార్’లో దర్శకుడు మాత్రం హీరోను తనదైన యాంగిల్లో చూపించాడు. ఇక్కడ అతడి దృష్టంతా హీరో స్టైల్ మీద.. యాటిట్యూడ్ మీదే నిలిచింది. ఫ్లాష్ బ్యాక్ లో బేసిగ్గా పటేల్ సార్ పాత్రను ఒకలా చూపించి.. అతడి మోటివ్ ఏంటో కూడా మరిచిపోయి స్టైల్.. యాటిట్యూడ్ మీద ఫోకస్ చేశాడు. జగపతిబాబును అంత స్టైలిష్ గా చూపించాలి.. యాటిట్యూడ్ ఎలివేట్ చేయాలి.. యాక్షన్ దృశ్యాలు ఎలివేట్ కావాలి అనుకున్నపుడు అతను మరో కథను ఎంచుకోవాల్సిందేమో. కానీ పగతో రగిలిపోతూ హత్యలు చేసే వ్యక్తిలో స్టైల్.. యాటిట్యూడ్ కోరుకుంటే.. పాత్ర ఔచిత్రం ఏం కావాలి? ఇలా దర్శకుడు ఎంచుకున్న కథకు.. ఇందులో హీరో పాత్రను సన్నివేశాల్ని ఎలివేట్ చేసిన తీరుకు పొంతన కుదరక ‘పటేల్ సర్’ రెంటికీ చెడ్డట్లుగా తయారైంది.

కథగా చెప్పుకుంటే ‘పటేల్ సర్’లో ఏ కొత్తదనం లేదు. 30.. 40 ఏళ్ల నుంచి చూస్తున్న రివెంజ్ స్టోరీనే ఇది. ఐతే దాన్ని కొత్తగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం కూడా ఏమీ జరగలేదు. పైన చెప్పుకున్నట్లు హీరోను స్టైలిష్ గా ప్రొజెక్ట్ చేయడం.. యాక్షన్ సన్నివేశాల్ని తీర్చిదిద్దడం పైనే దర్శకుడి దృష్టంతా నిలిచింది. హీరోను ట్రెండీగా చూపించాడు కానీ.. కథాకథనాలు మాత్రం ఈ ట్రెండుకు ఏమాత్రం సూటయ్యేవి కావు. రెండు మూడు దశాబ్దాల కిందట వచ్చిన డబ్బింగ్ సినిమాలు చూస్తున్న భావన కలిగిస్తుంది ఇందులో కథ నడిచే తీరు. హీరో హత్యలు చేయడం.. దాన్ని ఓ పోలీసాఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తూ వెళ్లడం.. ఇలా అంతా పాత చింతకాయ పచ్చడి వ్యవహారమే. పోలీసాఫీసర్ పాత్రను కొంచెం కొత్తగా చూపించాలని.. సెక్సీగా ఉండే తన్య హోప్ ను తీసుకొచ్చి పెట్టారు. ఆమెతో బికినీ కూడా వేయించారు. హీరో ఇంకో హత్య చేయగానే.. తనకు రావాల్సిన పేమెంట్ పెరుగుతుందని ఆశపడే కరప్టెడ్ పోలీసాఫీసర్ క్యారెక్టర్ ఆమెది. అసలే ఆమె అవతారం పాత్రకు సింక్ కాలేదంటే.. ఇక ఆ పాత్రకు ఇలాంటి లక్షణం కూడా జోడించారు. ఇక ఆ పాత్రను ఎలా సీరియస్ గా తీసుకుంటాం?

కథాకథనాలతో సంబంధం లేకుండా జగపతి బాబు నటన.. ఆయన యాటిట్యూడ్ ను ఎంజాయ్ చేయగిలిగితే ‘పటేల్ సర్’ కొంత వరకు ఎంగేజ్ చేస్తుంది. సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణ అంటే జేబీనే. ద్వితీయార్ధంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్.. తండ్రీ కొడుకులు.. తాతా మనవళ్ల మధ్య అనుబంధాల్ని ఎలివేట్ చేసే సీన్లు.. అందులో ఎమోషన్లు కొంత వరకు ఎంగేజ్ చేస్తాయి. సినిమా సవ్యంగా సాగేది ఇక్కడొక చోటే. ఇక మిగతా వ్యవహారాలన్నీ పరమ రొటీన్ గా ఉంటాయి. రివెంజ్ డ్రామాను చాలా పేలవంగా డీల్ చేశాడు దర్శకుడు. ప్రోమోలు చూసి ‘పటేల్ సర్’ మీద పెట్టుకున్న అంచనాల్ని సినిమా ఎంతమాత్రం నిలబెట్టలేదు. ఈ విషయంలో మేడిపండు చూడ.. అన్న సామెతే గుర్తుకొస్తుంది.

నటీనటులు:

జగపతిబాబు తన వరకు ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాల్ని నిలబెట్టాడు. ఆయన లుక్.. స్క్రీన్ ప్రెజెన్స్.. నటన ఆకట్టుకుంటాయి. ఎమోషనల్ సీన్స్ లో జగపతి నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించిన పద్మప్రియ.. ఆమని ఇద్దరూ కూడా సింపుల్ గా కనిపించారు. తమ నటనతో మెప్పించారు. తన్య హోప్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆమె పాత్రే అదో రకంగా ఉంటే.. దీనికి తోడు ఓవరాక్షన్ తో వాయించేసింది. శుభలేఖ సుధాకర్ పాత్రకు తగ్గట్లు నటించాడు. సుబ్బరాజు పాత్ర మామూలే. విలన్ కబీర్ సింగ్ చేసిందేమీ లేదు.

సాంకేతికవర్గం:

డీజే వసంత్ సంగీతం పర్వాలేదు. ఫ్లాష్ బ్యాక్ లో పటేల్.. పిల్లల మధ్య అనుబంధం పెరిగే క్రమంలో వచ్చే మెలోడీ ఆకట్టుకుంటుంది. మిగతా పాటలేవీ పెద్దగా ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం ఓకే. శ్యామ్ కే నాయుడు ఛాయాగ్రహణం బాగుంది. యాక్షన్ సన్నివేశాల్లో కెమెరా పనితనం ఎలివేట్ అయింది. వారాహి వాళ్ల ప్రమాణాలకు తగ్గట్లే నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు వాసు పరిమి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మంచి హీరో.. అభిరుచి ఉన్న నిర్మాత.. అన్నీ బాగా కుదిరినా.. ఉపయోగించుకోలేకపోయాడు. అతను పైపై మెరుగుల మీదే దృష్టిపెట్టాడు. కథాకథనాల విషయంలో ఏ ప్రత్యేకతా చూపించలేకపోయాడు.

చివరగా: పటేల్ సర్.. మేడిపండు చందం!

రేటింగ్: 2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS