‘పరిచయం’

Sat Jul 21 2018 GMT+0530 (IST)

‘పరిచయం’

చిత్రం : ‘పరిచయం’

నటీనటులు: విరాట్ కొండూరు - సిమ్రత్ కౌర్ - రాజీవ్ కనకాల - పృథ్వీ - రాహుల్ రామకృష్ణ - సిజ్జు - పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం: నరేష్ రాణా
నిర్మాత: రియాజ్
రచన - దర్శకత్వం: లక్ష్మీకాంత్ చిన్నా

ఈ మధ్య ఆసక్తికర ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిన్న సినిమాల్లో ‘పరిచయం’ ఒకటి. హైదరాబాద్ నవాబ్స్.. నిన్న నేడు రేపు లాంటి సినిమాలు తీసిన లక్ష్మీకాంత్ చెన్నా రూపొందించిన చిత్రమిది. కొత్త హీరో హీరోయిన్లు విరాట్ కొండూరు.. సిమ్రత్ కౌర్ జంటగా నటించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ఆనంద్ (విరాట్).. లక్ష్మి (సిమ్రత్) ఎదురెదురు ఇళ్లలో ఉంటూ చిన్నతనం నుంచి కలిసి పెరుగుతారు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కొన్ని రోజుల దాగుడుమూతల తర్వాత ఇద్దరూ ఒకరికొకరు తమ ప్రేమను చెప్పుకుంటారు. అంతా సంతోషంగా సాగిపోతున్న సమయంలో వీరి ప్రేమ గురించి తెలిసిన లక్ష్మి తండ్రి ఉగ్ర రూపుడవుతాడు. దీంతో లక్ష్మి పురుగుల మందు తాగుతుంది. ప్రాణాపాయం తప్పించుకున్నప్పటికీ ఆమెకు మతిస్థిమితం తప్పుతుంది. ఈ స్థితిలో తన ప్రేయసిని మామూలు మనిషిని చేయడానికి ఆనంద్ ఏం చేశాడన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

ఈ రోజుల్లో ఒక సినిమా వైపు జనాలు ఆకర్షితులు కావడానికి అతి ముఖ్యమైన అంశం ఆసక్తికర ప్రోమోలు రూపొందించడం. ఈ విషయంలో ‘పరిచయం’ విజయవంతమైంది. కొత్త హీరో హీరోయిన్లు నటించిన సినిమా అయినప్పటికీ కలర్ ఫుల్ విజువల్స్.. ఆహ్లాదకరమైన సంగీతంతో ఆకర్షణీయంగా కనిపించిన టీజర్.. ట్రైలర్ జనాల దృష్టిని ఆకర్షించాయి. ఒక స్వచ్ఛమైన ప్రేమకథను చూడబోతున్న భావన కలిగించాయి. ఐతే ఆ ప్రేమలో స్వచ్ఛత సంగతేమో కానీ.. విపరీతమైన మెలోడ్రామాతో.. భరించలేని సాగతీతతో సాగే ఈ ప్రేమకథ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. హీరో హీరోయిన్లిద్దరూ బాగా చేసినా.. సంగీతం.. ఛాయాగ్రహణం లాంటి సాంకేతిక ఆకర్షణలు బాగానే కుదిరినా.. అవి పైపై మెరుగులే తప్ప అసలు విషయం మాత్రం అంతంతమాత్రం. ఏమాత్రం కొత్తదనం లేకుండా చాలా సాధారణంగా.. నెమ్మదిగా సాగే ఈ ప్రేమకథ ఆద్యంత ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.

హీరోకు దూరమవుతున్నాననే బాధలో హీరోయిన్ పురుగుల మందు తాగి పడిపోయిన చోట ‘పరిచయం’ ఇంటర్వెల్ పడుతుంది. అక్కడి నుంచి ద్వితీయార్ధం మొదలైతే.. అరగంట పాటు లొకేషన్ మారదు. అక్కడే ఇటు అటు సన్నివేశాలు తిరుగుతూనే ఉంటాయి. పేజీలకు పేజీలు డైలాగులు అయిపోతుంటాయి. ఇదంతా చూస్తుంటే మనం చూస్తున్నది సినిమానా.. లేదంటే సీరియలా అన్న సందేహం వస్తుంటుంది. సరైన విషయం ఉంటే ఒకే లొకేషన్లో గంట అయినా కథను నడిపించవచ్చు. కానీ ఏ కొత్తదనం లేకుండా.. కేవలం డైలాగుల మీదే నడుస్తూ డ్రామా తరహాలో సన్నివేశాలు సాగిపోతుంటే ప్రేక్షకుడి పరిస్థితేంటి? ‘పరిచయం’ ఎలా సా...గుతుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. సినిమా అంతటా బూతద్దం పెట్టి వెతికినా ఒక్క కొత్త సీన్ కనిపించదు. కలిసి పెరిగిన అబ్బాయి.. అమ్మాయి ప్రేమలో పడటం.. వాళ్ల పెళ్లికి హీరోయిన్ తండ్రి అడ్డం పడటం.. ఈ స్థితిలో హీరోయిన్ పురుగుల మందు తాగి ఆసుపత్రి పాలైతే.. ఆమెను హీరో కంటికి రెప్పలా చూసుకోవడం.. ఏముంది ఇందులో కొత్తదనం?

కథ ఎలా ఉన్నా కథనమైనా కొత్తగా ఉంటే ఓకే అనుకోవచ్చు. కానీ అదీ లేకపోయె. అరకు నేపథ్యంలో కథ నడవడం.. దీనికి తోడు కెమెరా పనితనం తోడవడం వల్ల ప్రతి దృశ్యం కంటికింపుగా కనిపిస్తుంది. నేపథ్య సంగీతం కూడా బాగానే కుదిరింది. దీనికి తోడు హీరో హీరోయిన్లు కూడా అమాయకంగా.. స్వచ్ఛంగా కనిపిస్తూ ఆకట్టుకుంటారు. కానీ సన్నివేశం పండటానికి ఇవి మాత్రమే సరిపోతాయా? అన్నింటికీ మించి కథలో.. కథనంలో విషయం ఉండాలి కదా? ప్రధానంగా అక్కడే ‘పరిచయం’ దారి తప్పింది. ప్రేమకథలో ఎక్కడా ఫీల్ కానీ.. ఎమోషనల్ డెప్త్ కానీ లేకపోవడం.. కథలో చెప్పుకోదగ్గ మలుపులేమీ లేకపోవడంతో రెండు గంటల సినిమా కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది. ప్రేమకథే అంతంతమాత్రంగా ఉంటే.. ద్వితీయార్ధంలో సిజ్జుతో ఒక అనవసర ఎపిసోడ్ పెట్టారు. అది చూస్తున్నంతసేపూ మధ్యలో వేరే సినిమా ఏదో చూస్తున్న భావన కలుగుతుంది. సినిమా మొత్తంలో రాజీవ్ కనకాల పాత్ర ఒకటి కొంచెం ఆసక్తికరంగా ఉండి.. ఆ పాత్రకు మంచి డైలాగులు కూడా పడటంతో ప్రేక్షకులు కొంచెం కనెక్టవుతారు. మిగతా పాత్రలేవీ కూడా ఆకట్టుకోవు. ప్రోమోల్లో ఆకర్షణీయంగా అనిపించిన పై మెరుగులే ‘పరిచయం’లో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు.

నటీనటులు:

సిన్సియర్ ప్రేమికుడిగా కొత్త కుర్రాడు విరాట్ కొండూరు బాగానే చేశాడు. అతడి లుక్స్ జస్ట్ ఓకే అనిపిస్తాయి. బాడీ లాంగ్వేజ్ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. అక్కడక్కడా తడబడినా.. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో మంచి నటన కనబరిచాడు. హీరోయిన్ సిమ్రత్ కౌర్ చూడ్డానికి బాగుంది. పాత్రకు తగ్గ అమాయకత్వంతో ఆకట్టుకుంది. నటన పర్వాలేదు. రాజీవ్ కనకాల సినిమాకు పెద్ద బలం. ఆయన తన అనుభవాన్ని చూపించాడు. పృథ్వీ కూడా బాగానే చేశాడు. సిజ్జు పాత్ర వృథా. రాహుల్ రామకృష్ణ ఉన్న కాసేపట్లోనే ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతికవర్గం:

శేఖర్ చంద్ర పాటలు పర్వాలేదు. రెండు పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం చాలా బాగుంది. నరేష్ రాణా ఛాయాగ్రహణం సినిమాకు అతి పెద్ద ఆకర్షణ. అరకు అందాల్ని అద్భుతంగా చూపించాడు. పాటలు కూడా అందంగా చిత్రీకరించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా ఒక నిజ జీవిత కథ స్ఫూర్తిగా ఈ సినిమా తీశాడు. కానీ సినిమాగా అంత ఎగ్జైట్ చేసే కథైతే కాదిది. ఇందులో చెప్పుకోదగ్గ మలుపులేమీ లేవు. ఏమాత్రం కొత్తదనం లేని కథాకథనాలతో లక్ష్మీకాంత ఆద్యంతం విసిగించాడు. పాత్రలతో ప్రేక్షకుల్ని ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో అతను విఫలమయ్యాడు. మంచి వనరులు లభించినా ప్రేమకథను పండించలేకపోవడం అతడి వైఫల్యమే.

చివరగా: పరిచయం.. భారమైన ప్రేమకథ

రేటింగ్-1.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS