నేనే రాజు నేనే మంత్రి

Fri Aug 11 2017 GMT+0530 (IST)

నేనే రాజు నేనే మంత్రి

చిత్రం: ‘నేనే రాజు నేనే మంత్రి’

నటీనటులు: రానా దగ్గుబాటి - కాజల్ అగర్వాల్ - కేథరిన్ థ్రెసా - నవదీప్ - అశుతోష్ రాణా - తనికెళ్ల భరణి - సత్యప్రకాష్ - అజయ్ - ప్రదీప్ రావత్ - శివాజీ రాజా తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: వెంకట్ సి.దిలీప్
మాటలు: లక్ష్మీభూపాల్
సమర్పణ: సురేష్ బాబు
నిర్మాతలు: కిరణ్ రెడ్డి - భరత్ చౌదరి
కథ - కథనం - దర్శకత్వం: తేజ

హీరోగా కెరీర్ ఆరంభంలో ఎదురు దెబ్బలు తగిలినా ‘బాహుబలి’తో నటుడిగా తిరుగులేని గుర్తింపు సంపాదించిన రానా దగ్గుబాటి.. ఇప్పుడు మళ్లీ హీరో వేషాల్లో మెరుస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ‘ఘాజీ’తో ఆకట్టుకున్నాడు రానా. ఇప్పుడు ‘నేనే రాజు నేనే మంత్రి’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సీనియర్ దర్శకుడు తేజ రూపొందించిన ఈ సినిమా ఆసక్తికర ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఆ అంచనాల్ని ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ:

జోగేంద్ర (రానా దగ్గుబాటి) అనంతపురం జిల్లాలోని ఒక ఊరిలో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ బతికే కుర్రాడు. అతడికి తన భార్య రాధ (కాజల్ అగర్వాల్) అంటే ప్రాణం. తన భార్య తల్లి కాబోతుంటే.. బిడ్డ పుట్టే క్షణాల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటాడు. కానీ ఆ ఊరి సర్పంచ్ భార్య కారణంగా రాధ తన బిడ్డను కోల్పోతుంది. దీంతో ఆ సర్పంచ్ పదవి దక్కించుకోవాలన్న కసి పెరుగుతుంది జోగేంద్రలో. ఇక అక్కడి నుంచి రాజకీయాల్లో మరిన్ని ఎత్తులకు ఎదిగే ప్రయత్నంలో పడతాడతను. చివరికి ముఖ్యమంత్రి పదవి మీదే కన్నేస్తాడతను. మరి తన రాజకీయ ఎదుగుదల కోసం అతనేం చేశాడు.. ఈ క్రమంలో తనకు ఎదురైన అడ్డంకుల్ని ఎలా అధిగమించాడు.. చివరికి అతడి ప్రస్థానం ఎక్కడికి చేరింది.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

తెలుగులో మామూలుగానే పొలిటికల్ డ్రామాలు తక్కువ. ఇక ఆ జానర్లో పకడ్బందీగా తెరకెక్కిన సినిమాలంటే మరీ అరుదు. రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలనగానే జనరలైజ్డ్ అభిప్రాయాలతో పైపైన సినిమాలు తీసేవాళ్లే ఎక్కువమంది. వాస్తవ పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూ.. జనాలకు కనెక్టయ్యేలా పొలిటికల్ డ్రామాల్ని నడిపించడం కత్తి మీద సామే. సీనియర్ డైరెక్టర్ తేజ ‘నేనే రాజు నేనే మంత్రి’ పైన చెప్పుకు ‘పైపై మెరుగుల’ కోవలోకి చేరదు. అలాగని తర్వాత అన్నట్లుగా పూర్తి వాస్తవికంగానూ అనిపించదు. కొన్ని చోట్ల ఇల్లాజికల్ గా.. సినిమాటిగ్గా అనిపిస్తూ.. కొన్ని చోట్ల వాస్తవికంగానూ కనిపిస్తూ.. ఓవరాల్ గా ఓకే అనిపిస్తుంది ‘నేనే రాజు నేనే మంత్రి’.

ఆరంభం నుంచి ప్రేమకథలే తీస్తూ.. ఆ తర్వాత కూడా చాలా వరకు వాటినే పట్టుకుని వేలాడిన తేజ.. తన శైలికి పూర్తి భిన్నంగా.. తెలుగులో అరుదుగా తెరకెక్కే జానర్లోకి వచ్చి ఆశ్చర్యపరిచాడు. తేజ గత సినిమాలతో పోలిస్తే ‘నేనే రాజు నేనే మంత్రి’ పూర్తి భిన్నంగా అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంతసేపూ ఇది తేజ సినిమా అన్న సంగతే మరిచిపోతామంతే. తేజ గత సినిమాలకు ఎన్నో రెట్లు మెరుగ్గా అనిపిస్తుంది ఈ చిత్రం. కానీ ఒక ప్రత్యేకమైన సినిమాగా తయారయ్యే లక్షణాలు అక్కడక్కడా కనిపించినా.. చాలాచోట్ల ఆసక్తి రేకెత్తించినా.. ఎక్కడా కూడా పర్ఫెక్ట్ అన్న భావన మాత్రం కలిగించదు. రియలిస్టిక్ పొలిటికల్ థ్రిల్లర్ లాగా కనిపించిన ఈ సినిమాలో నాటకీయత ఎక్కువైపోవడం సమస్య అయింది.

‘నేనే రాజు నేనే మంత్రి’లో కథకు పునాది పడే ఓ కీలక సన్నివేశం గురించి మాట్లాడుకుందాం. తన ఊరి సర్పంచ్ భార్య కారణంగా తన భార్య కడుపు పోయిందని కోపం వచ్చి తనే సర్పంచ్ అయిపోవాలనుకుంటాడు జోగేంద్ర. తనను తాను తక్కువగా చూపించుకుని.. సర్పంచితోనే తన నామినేషన్ పత్రాలపై సంతకం పెట్టిస్తాడు. కట్ చేస్తే..సర్పంచిగా జోగేంద్రే గెలిచినట్లు ప్రకటిస్తారు. కానీ అసలు జోగేంద్ర ఎలా గెలిచాడన్నదే చూపించరు. ఇక ఆ తర్వాత జోగేంద్ర ఎమ్మెల్యే అవుతాడు.. మంత్రి అవుతాడు.. ముఖ్యమంత్రి కుర్చీకి కూడా చేరువైపోతాడు. కానీ అసలు జోగేంద్ర సర్పంచిగా ఎలా గెలిచాడన్న సందేహం మాత్రం ప్రేక్షకుల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ కథకు పునాది పడ్డ అంకంలోనే ప్రేక్షకుడికి పెద్ద సందేహం వచ్చి పడటంతో.. ఇక ఆ తర్వాత జరిగేదంతా కూడా నాటకీయంగానే అనిపిస్తుంది.

సర్పంచి కాగానే మాజీ సర్పంచిని చంపేయడం.. ఆ తర్వాత ఎమ్మెల్యేను కూడా మట్టుబెట్టేయడం.. అలవోకగా ఎమ్మెల్యే అయిపోవడం.. ఎమ్మెల్యే అయ్యాక హోం మంత్రిని జైలుకు పంపించేయడం.. సీఎంను ఆటాడించడం.. ఇలా జోగేంద్ర ఏం అనుకుంటే అది జరిగిపోతుంది. ఇవన్నీ కూడా సినిమాటిగ్గా.. హీరో కోసం చాలా కన్వీనియెంట్ గా నడిచిపోతుంటే రియలిస్టిక్ పొలిటికల్ థ్రిల్లర్ ఆశించి వచ్చిన ప్రేక్షకులు నిరాశకు గురికావడం ఖాయం. ఒక దశ దాటాక లాజిక్ విషయంలో రాజీ పడితే తప్ప ముందుకు సాగడం కష్టమైపోతుంది. కాకపోతే జోగేంద్ర పాత్రలో రానా అద్భుత అభినయం.. కొన్ని సన్నివేశాల్లో జోగేంద్ర క్యారెక్టర్ ను ఎలివేట్ చేసిన విధానం.. మంచి డైలాగులు ప్రేక్షకుల ఆసక్తి నిలిపి ఉంచుతాయి. ఇంటర్వెల్ ముంగిట వచ్చే మలుపు ప్రేక్షకుల మనసుల్ని మెలిపెట్టి.. ద్వితీయార్ధం మీద చాలా ఆసక్తి రేకెత్తిస్తుంది.

ఐతే వాస్తవ దూరంగా అనిపించినప్పటికీ పొలిటికల్ గేమ్ ను ఒక దశ వరకు పకడ్బందీగానే నడిపించిన తేజ.. తర్వాత పట్టు వదిలేశాడు. రానా తన మీద పెట్టుకున్న అంచనాల్ని మించి పెర్ఫామ్ చేస్తూ.. జోగేంద్ర పాత్రను నిలబెట్టే ప్రయత్నం చేసినా.. పకడ్బందీ సన్నివేశాలు లేకపోవడంతో ఆ పాత్ర బలహీన పడిపోయింది. చేతల్లో కాకుండా కేవలం మాటలతోనే జోగేంద్ర పాత్రను ఎలివేట్ చేసే ప్రయత్నం జరగడంతో ఆ పాత్ర నీరుగారిపోయింది. భార్య కోసమే అన్నీ చేస్తున్నట్లుగా చెప్పే జోగేంద్ర.. తర్వాత ఎటు పోతున్నాడో అర్థం కాదు. అతను దారి తప్పుతాడు. అలాగే కథనం కూడా దారి తప్పుతుంది. అనవసర సన్నివేశాలు.. సాగతీతతో ‘నేనే రాజు నేనే మంత్రి’ గమనమేంటో అర్థం కాని పరిస్థితి తలెత్తుతుంది. చివర్లో సీఎం కుర్చీ ఎక్కేందుకు జోగేంద్ర చేసే ఎత్తుగా ఎంతమాత్రం జీర్ణించుకోలేనిది. మరి అంతలా దిగజారిపోయినట్లు కనిపించే జోగేంద్ర చివరికి వచ్చేసరికి లెక్చర్లిచ్చేసి తన కథకు ముగింపు పలుకుతాడు. చివరి 20 నిమిషాల ఎపిసోడ్ పూర్తిగా తేలిపోవడంతో ప్రథమార్ధం అయ్యేసరికి ఏర్పడ్డ ఇంప్రెషన్ మొత్తం పోతుంది.

ఓవరాల్ గా చూస్తే తేజ గత సినిమాలతో పోలిస్తే ‘నేనే రాజు నేనే మంత్రి’ భిన్నంగా.. మెరుగ్గా అనిపిస్తుంది కానీ.. అంతిమంగా మంచి ఫీలింగ్ అయితే ఇవ్వదు. సినిమా పూర్తి సీరియస్ గా సాగడం ఎంతమందికి రుచిస్తుందన్నదీ సందేహమే. ఈ తరహా సినిమాలు సీరియస్ గానే సాగాలి. కానీ బిగి కూడా ముఖ్యం. ఇందులో అదే మిస్సయింది. హీరోకు సవాళ్లంటూ ఏమీ లేకుండా అన్నీ కన్వీనియెంట్ గా సాగిపోవడం వల్ల సినిమా ఫ్లాట్ గా అనిపిస్తుంది. విలన్ పాత్ర తేలిపోవడంతో హీరో పాత్ర కూడా అనుకున్నంతగా ఎలివేట్ అవ్వదు. కేవలం రానా అభినయం వల్ల జోగేంద్ర పాత్ర ప్రత్యేకత చాటుకుంటుంది కానీ.. రైటింగ్ వల్ల మాత్రం కాదు.

నటీనటులు:

దగ్గుబాటి రానా కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్సెస్ లో ఇదొకటి అనడంలో సందేహం లేదు. ‘బాహుబలి’ రానా ఆత్మవిశ్వాసాన్ని ఎంత పెంచిందన్నది ‘నేనే రాజు నేనే మంత్రి’లో చూడొచ్చు. అతడి కటౌట్.. పెర్ఫామెన్స్.. జోగేంద్ర పాత్రను ప్రత్యకంగా నిలబెట్టాయి. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద నడిపించే ప్రయత్నం చేశాడు జోగేంద్ర. ఈ పాత్రలోని నెగెటివ్ కోణాన్ని రానా తన నటనతో ఎలివేట్ చేసిన తీరు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా రానా ఆకట్టుకున్నాడు. మొత్తంగా ‘నేనే రాజు నేనే మంత్రి’లో రానా వన్ మ్యాన్ షోను చూడొచ్చు. కాజల్ అగర్వాల్ కూడా బాగానే చేసింది. కథకు చాలా కీలకమైన పాత్రలో ఆకట్టుకుంది. కేథరిన్ థ్రెసా కూడా తన పాత్రకు బాగానే సరిపోయింది. విలన్ పాత్రలో అశుతోష్ రాణా మామూలుగా అనిపించాడు. అందుకు ఆ పాత్రలో బలం లేకపోవడం కూడా ఓ కారణమే. పోసాని బాగానే ఎంటర్టైన్ చేశాడు. నవదీప్ ఓకే అనిపించాడు. శివాజీ రాజా ఆకట్టుకున్నాడు. తనికెళ్ల భరణి.. అజయ్.. ప్రభాస్ శీను.. వీళ్లందరూ ఒకే.

సాంకేతికవర్గం:

అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద బలం. తనలోని కొత్త కోణాన్ని చూపించాడు అనూప్. ఈ తరహా సీరియస్ సినిమాలకు కూడా తాను సరిపోయే ఔట్ పుట్ ఇవ్వగలనని రుజువు చేసుకున్నాడు. అనూప్ నేపథ్య సంగీతం సన్నివేశాల్ని బాగానే ఎలివేట్ చేసింది. అతడి పాటలు పర్వాలేదు. వెంకట్ సి.దిలీప్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. తన కెమెరా పనితనంతో సినిమాకు తగ్గ మూడ్ క్రియేట్ చేయడంలో వెంకట్ విజయవంతమయ్యాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. లక్ష్మీ భూపాల్ మాటలు బాగా పేలాయి. దర్శకుడు తేజ.. తన శైలికి భిన్నమైన సినిమా చేసి.. తనకు పట్టిన తుప్పు వదిలించేసుకున్నాడు కానీ.. దీన్ని అనుకున్నంత పకడ్బందీగా మాత్రం తీయలేదు. వర్తమాన రాజకీయాలపై ఆయనకున్న అవగాహన కనిపిస్తుంది కానీ.. వాటిని లోతుగా అధ్యయనం చేసి.. వాస్తవికంగా సినిమాను నడిపించే ప్రయత్నం చేస్తే బాగుండేది. ఇలాంటి సినిమాలు రియలిస్టిగ్గా ఉండాలని ఆశిస్తారు ఎవరైనా. కానీ తేజ మాత్రం తనకు కన్వీనియెంట్ గా కథాకథనాలు రాసుకున్నాడు. అక్కడే దెబ్బ కొట్టేసింది. కనీసం ఆ తరహాలోనే అయినా.. ఒకే టెంపోను మెయింటైన్ చేయడంలోనూ విజయవంతం కాలేదు తేజ. సీరియస్ పొలిటికల్ డ్రామాలు ఎంత పకడ్బందీగా ఉంటే తప్ప ప్రేక్షకులకు కనెక్టవ్వవు. ఆ  బిగిని తేజ చూపించలేకపోయాడు. ఆయన గత సినిమాలతో పోలిస్తే మాత్రం ఇది భిన్నంగా.. మెరుగ్గా అనిపిస్తుందన్నది మాత్రం వాస్తవం.

చివరగా: జోగేంద్ర కథ.. మధ్యలో అడ్డం తిరిగింది!

రేటింగ్- 2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre