‘నీదీ నాదీ ఒకే కథ’

Fri Mar 23 2018 GMT+0530 (IST)

‘నీదీ నాదీ ఒకే కథ’

చిత్రం: ‘నీదీ నాదీ ఒకే కథ’

నటీనటులు: శ్రీవిష్ణు - సట్నా టైటస్ - దేవీ ప్రసాద్ - పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఛాయాగ్రహణం: రాజ్ తోట - పర్వేజ్
నిర్మాతలు: ప్రశాంత్ - కృష్ణవిజయ్
రచన - దర్శకత్వం:  వేణు ఉడుగుల

నటుడిగా చిన్నచిన్న పాత్రలు చేస్తూ వచ్చిన శ్రీవిష్ణు.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’.. ‘మెంటల్ మదిలో’ లాంటి సినిమాలతో కథానాయకుడిగానూ సత్తా చాటుకున్నాడు. ఇప్పుడతను ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ‘నీదీ నాదీ ఒకే కథ’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. వైవిధ్యమైన ప్రోమోలతో ఈ చిత్రం ఆసక్తి రేకెత్తించింది. మరి ఈ సినిమా ఆ ఆసక్తిని నిలబెట్టేలా ఉందో లేదో చూద్దాం పదండి.

కథ:

రుద్రరాజు సాగర్ (విష్ణు) ఒక మధ్య తరగతి కుర్రాడు. అతడికి చదువు సరిగా అబ్బదు. అతను ప్రయోజకుడు కాలేదని తండ్రి నిరంతరం బాధపడుతుంటాడు. ఐతే సాగర్ మాత్రం తనకు నచ్చింది చేస్తూ సంతోషంగా గడపాలనుకుంటాడు. జీవితంలో చిన్న చిన్న ఆనందాల్ని దేని కోసం త్యాగం చేయకూడదనుకుంటాడు. సమాజం కోసం బతకడం అతడికి ఇష్టం ఉండదు. కానీ ఇంట్లో వాళ్లతో పాటు సమాజం కూడా అతడిని తక్కువగా చూస్తుంది. దీంతో మారాలని ప్రయత్నిస్తాడు. కానీ కుదరదు. ఈ నేపథ్యంలో అతను పరిస్థితులపై ఎలా పోరాడాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

మనం ఏం చేస్తున్నామో తెలియకుండానే బాల్యాన్ని గడిపేస్తాం. యవ్వనంలోనూ రోజులు ఎలా గడిచాయో తెలియదు. ఆ దశ కూడా దాటిపోతుంది. ఆ తర్వాత మొదలవుతుంది అసలు ప్రయాణం. మనకు నచ్చినా నచ్చకపోయినా ఒక కెరీర్ ఎంచుకని జీవితంలో సెటిలయ్యాం అనిపించుకున్నాక.. అసలు సంతోషమేంటో అర్థమవుతుంది. మనం ఏం చేస్తున్నామో తెలియకుండా.. ఏదీ ఆలోచించకుండా చేసిన పనుల్లోనే అసలైన ఆనందం ఉందని అర్థమవుతుంది. జీవితం మొత్తం అలాగే సాగాలని.. ఎవరికి నచ్చినట్లు వాళ్లు బతకాలని చెప్పే సినిమా ఇది. బాగా చదవడం.. ఏదో ఒక ఉద్యోగంలో సెటిలవ్వడం.. డబ్బు సంపాదించడమే జీవిత పరమార్థమా..? అందులోనే ఆనందం ఉందా..? మనం నిజంగా ఆనందంగా ఉన్నామా.. సమాజం దృష్టిలో ఆనందంగా జీవిస్తున్నామా..? అసలు మనం మనకోసం బతుకుతున్నామా.. సమాజం కోసం బతుకుతున్నామా..? ఇలాంటి ప్రశ్నలెన్నింటినో సూటిగా సంధిస్తుంది ‘నీదీ నాదీ ఒకే కథ’.

తెలుగులో ‘నీదీ నాదీ ఒకే కథ’ లాంటి ఒక ప్రయత్నం అరుదైనదే.. ఆశ్చర్యపరిచేదే. సినిమాను కాకుండా కొందరి జీవితాల్ని చూపించి.. ఆయా పాత్రలతో మనల్ని రిలేట్ చేసుకుని.. వాళ్ల భావోద్వేగాల్ని అనుభవించి.. ఇందులో చూపించే విషయాల్ని లోతుగా ఆలోచించేలా చేస్తుందీ చిత్రం. సినిమా అనేది వినోద ప్రధానమే కానీ.. మనల్ని మనకు చూపించే సినిమాలు చూస్తున్నపుడు వినోదం గురించి.. మిగతా కమర్షియల్ హంగుల గురించి మరిచిపోతాం. అందులో లీనమవుతాం. ఒక సినిమాటిక్ అనుభవాన్ని ఇదెంతమేరకు కలిగిస్తుంది.. ఎంత వరకు వినోదం పంచుతుంది అన్నది పక్కన పెడితే.. ఇది కాస్త ఆలోచనా జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తుందనడంలో.. ఒక ఆలోచన రేకెత్తిస్తుందనడంలో మాత్రం సందేహం లేదు.

రుద్రరాజు సాగర్ పాత్రను ముందుగా చూసినపుడు కొంత ఇరిటేట్ అవుతాం. మరీ అంత బాధ్యతా రాహిత్యమేంటి అనుకుంటాం. కానీ ఒక దశ దాటాక.. అతడి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకున్నాక.. మన ఆలోచనలోనూ మార్పు వస్తుంది. మొదట్లో హీరో పరిచయమైనపుడు అతడిని వేస్ట్ ఫెలో అని తిట్టే కథానాయిక.. ఆ తర్వాత అతడితో కలిసి ప్రయాణం చేశాక.. తాను చిన్నప్పట్నుంచి ఫేక్ ఇమేజ్ కోసం ఎలా తాపత్రయపడుతూ.. ‘గుడ్ గర్ల్’ అనిపించుకోవడానికి ఎలా తన ఆనందాల్ని త్యాగం చేస్తూ వచ్చానో చెబుతూ.. తాను ఇన్నాళ్లూ నటిస్తూనే ఉన్నానని.. ఇకపై నేను నేనుగా బతకడానికి ప్రయత్నిస్తానని అంటుంది. హీరో పాత్ర విషయంలోనూ ప్రేక్షకుల ఆలోచన ఇలాగే మారుతుంది.

ఐతే ఆదర్శాల గురించి మాట్లాడ్డం వేరు.. బతకడం వేరు అన్నట్లుగా ఈ సినిమాలో చూపించినట్లు ప్రతి వ్యక్తీ ఎలా నచ్చితే అలా బతకడం అన్నది కూడా సాధ్యం కాదు. తమ ఆకాంక్షల్ని పిల్లల మీద రుద్దడం తప్పే కానీ.. వాళ్లు బాగా చదువుకోవాలని.. జీవితంలో స్థిరపడాలని తల్లిదండ్రులు కోరుకోవడంలో తప్పేముంది? చివరికి వచ్చేసరికి హీరో తండ్రిని దాదాపుగా విలన్ని చేసేశారు సినిమాలో. ఐతే ఒక సన్నివేశంలో తాను చదువుకోకుండా ఏం చేయగగలనో చెబుతూ.. ఒక లిస్టు రాసి ఇస్తాడు హీరో. అందులో అడుక్కుని బతకడం అనేది కూడా ఒక ఆప్షన్. మరి దాన్ని ఏ తండ్రి మాత్రం అంగీకరిస్తాడు? కాబట్టి ఇక్కడ సమతూకం అన్నది అవసరం.

వ్యక్తిత్వ వికాసం పేరుతో సమాజాన్ని ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారో.. మనుషుల వాస్తవ వ్యక్తిత్వాల్ని దెబ్బ తీసి ఒక నకిలీ ప్రపంచంలోకి ఎలా నెట్టేస్తున్నారో చాలా బాగా చెప్పాడు కొత్త దర్శకుడు వేణు ఉడుగుల. ఇది సినిమాలో ప్రత్యేకంగా నిలుస్తుంది. యండమూరి వీరేంద్రనాథ్ లాంటి వాళ్లను పరోక్షంగా విమర్శించడానికి కూడా దర్శకుడు వెనుకాడలేదు. తాను చెప్పాలనుకున్న విషయంలో దర్శకుడు ఎంత స్పష్టతతో.. పట్టుదలతో ఉన్నాడో చెప్పడానికి ఇది ఒక సూచిక. ఐతే ‘నీదీ నాదీ ఒకే కథ’లో చాలా మంచి విషయాలే చెప్పారు కానీ.. దీన్ని ‘త్రీ ఇడియట్స్’ తరహాలో సుగర్ కోటింగ్ తో చెప్పగలిగితే మరింత మందికి చేరువయ్యేదేమో. సినిమా అంతా చిన్న లైన్ మీద.. ఫ్లాట్ గా నడవడం.. ప్రీచింగ్ ఎక్కువైపోవడం వల్ల ప్రేక్షకులు కొంత బోర్ ఫీలయ్యేందుకు ఆస్కారముంది. అక్కడక్కడా ప్రేమకథ పేరుతో కొంచెం డీవియేషన్ కూడా ఉంది. ఐతే ఈ ప్రతికూలతల్ని పక్కన పెడితే ఇది ఒక మంచి.. అరుదైన ప్రయత్నం. ఇలాంటి సినిమాలు సమాజానికి అవసరం.

నటీనటులు:

శ్రీవిష్ణు మరోసారి నటుడిగా బలమైన ముద్ర వేశాడు. పాత్రల్ని అర్థం చేసుకుని అందులో ఒదిగిపోవడంలో తన నైపుణ్యాన్ని అతను మళ్లీ చూపించాడు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’లో రైల్వే రాజులా.. ‘మెంటల్ మదిలో’లో అరవింద్ కృష్ణలా ‘నీదీ నాదీ ఒకే కథ’లో రుద్రరాజు సాగర్ పాత్ర కూడా ప్రత్యేకంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. కేవలం పాత్రే కనిపిస్తుంది తప్ప శ్రీవిష్ణు కనిపించనట్లుగా అతను అందులో ఒదిగిపోయాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముంగిట తనలో తాను తీవ్ర మానసిక సంఘర్షణకు గురయ్యే సన్నివేశాల్లో.. క్లైమాక్సులో విష్ణు నటన కట్టిపడేస్తుంది. అతడెంత మంచి నటుడో తెలుస్తుంది. సినిమాలో శ్రీవిష్ణు తర్వాత అంత ముద్ర వేసింది తండ్రి పాత్ర చేసిన దేవీ ప్రసాదే. దర్శకుడిగా మాత్రమే పరిచయమున్న దేవీ ప్రసాద్ లో మంచి నటుడూ ఉన్నాడని ఈ సినిమా రుజువు చేస్తుంది. ఆయన సైతం తండ్రి పాత్రలో జీవించేశాడు. హీరోయిన్ సట్నా టైటస్ కూడా బాగానే చేసింది. హీరో తల్లి.. చెల్లి పాత్రల్లో చేసిన వాళ్లు కూడా మెప్పించారు. పోసాని ఒక సన్నివేశంలో మెరిశాడు.

సాంకేతికవర్గం:

ఇలాంటి వైవిధ్యమైన చిన్న సినిమాలకు టెక్నీషియన్ల సహకారం చాలా అవసరం. ఆ విషయంలో ఢోకా ఏమీ లేదు. సురేష్ బొబ్బిలి సంగీతం మంచి ఫీల్ తో సాగుతుంది. పాటలన్నీ సందర్భానికి తగ్గట్లుగా బాగా కుదిరాయి. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఛాయాగ్రహణంలోనూ ఒక అభిరుచి కనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. ఇక రచయిత.. దర్శకుడు వేణు ఉడుగుల తొలి సినిమాతోనే తనదైన ముద్ర వేశాడు. అతడి ఆలోచనలు చాలా ఉన్నంతగా ఉన్నాయి. తెలుగులో ఇంతవరకు ఎవరూ చేయని ప్రయత్నం అతను చేశాడు. వ్యక్తిత్వ వికాసం పేరుతో సమాజంపై జరిగే దాడిపై అతను ప్రతిదాడి చేశాడు. చాలామంది రిలేట్ చేసుకునేలా కథాకథనాల్ని పాత్రల్ని తీర్చిదిద్దాడు. సినిమాలో కొన్ని లోపాలున్నప్పటికీ ఇలాంటి ప్రయత్నం చేసినందుకు అతడిని అభినందించాల్సిందే.

చివరగా: అవును.. ఈ కథ నీదీ నాది.. అందరిదీ

రేటింగ్- 3/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS