'నా నువ్వే'

Thu Jun 14 2018 GMT+0530 (IST)

'నా నువ్వే'

చిత్రం: ‘నా నువ్వే’

నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్ - తమన్నా - తనికెళ్ల భరణి - వెన్నెల కిషోర్ - పోసాని కృష్ణమురళి - సురేఖావాణి  - ప్రవీణ్ - ప్రియదర్శి - ఆర్జే హేమంత్ - బిత్తిరి సత్తి తదితరులు
సంగీతం: శరత్
ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరామ్
నిర్మాతలు: కిరణ్ ముప్పవరపు - విజయ్ కుమార్ వట్టికూటి
రచన - దర్శకత్వం: జయేంద్ర

కెరీర్ ఆరంభం నుంచి చాలా వరకు మాస్ కథల్లోనే నటిస్తున్నాడు నందమూరి కళ్యాణ్. అతను ఈసారి పూర్తిగా అవతారం మార్చేసి ‘నా నువ్వే’ లాంటి క్లాస్ లవ్ స్టోరీలో నటించాడు. ‘180’తో దర్శకుడిగా పరిచయం అయిన జయేంద్ర రూపొందించిన చిత్రమిది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

వరుణ్ (కళ్యాణ్) రామ్ పీహెచ్ డీ పూర్తి చేసి అమెరికాకు వెళ్లి స్థిరపడే ప్రయత్నంలో ఉన్న కుర్రాడు. అతడికి విధి.. అదృష్టం లాంటి విషయాలపై నమ్మకం ఉండదు. ఇగో ఎక్కువ. మరోవైపు మీరా (తమన్నా)కు విధి మీద అపారమైన నమ్మకం. యాదృచ్ఛికంగా జరిగిన కొన్ని పరిణామాలతో ఆమె వరుణ్ ను కలవకుండానే ప్రేమలో పడుతుంది. విధే తమ ఇద్దరినీ కలుపుతుందని ఆమె నమ్ముతుంది. కానీ వరుణ్.. మీరా పరిచయమైన తన ప్రేమ గురించి చెబితే తేలిగ్గా తీసుకుంటాడు. విధి అనేది ట్రాష్ అంటాడు. మరి వీళ్లిద్దరిలో ఎవరి నమ్మకం ఫలించింది. వీళ్లిద్దరూ కలిశారా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

ప్రేమకథలకు అత్యంత కీలకమైన విషయం లీడ్ పెయిర్ కెమిస్ట్రీ. హీరో హీరోయిన్లిద్దరికీ జోడీ కుదరాలి. జంట బాగుందనిపించాలి. ఇద్దరి మధ్య రొమాన్స్ పండాలి. ఈ జంట కలవాలన్న ఫీలింగ్ ప్రేక్షకులకు రావాలి. కానీ ‘నా నువ్వే’కు ఇక్కడే పెద్ద బ్రేక్ పడిపోయింది. నందమూరి కళ్యాణ్ రామ్ లుక్ మార్చి ఉండొచ్చు. బాడీ లాంగ్వేజ్ మార్చుకుని ఉండొచ్చు. కానీ అతడికి.. తమన్నాకు ఎంతమాత్రం జోడీ కుదర్లేదు. ప్రోమోల్లో చూస్తే జనాలకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ఏమో కానీ.. తెరమీద మాత్రం వీళ్ల జంటే చాలా ఆడ్ గా కనిపిస్తుంది. మొహమాటాలు పక్కన పెట్టి ఉన్న మాట చెప్పుకుంటే.. పాలరాతి శిల్పంలా మెరిసిపోయే తమన్నా.. నార్మల్ లుక్స్ ఉన్న కళ్యాణ్ రామ్ వెంట పడుతూ అతడి ప్రేమ కోసం తపించి పోతుంటే.. అతనేమో ఆమెను పట్టించుకోకుండా వెళ్లిపోతుంటే ఎలా స్పందించాలో అర్థం కాదు.

పోనీ ఇక్కడ అందం కాదు.. వ్యక్తిత్వం చూసి ఆమె ప్రేమలో పడిపోయిందనడానికి సరైన కారణం కూడా ఏమీ చూపించలేదు. హీరోను అసలు నేరుగా చూడకుండానే సిల్లీ రీజన్స్ తో అతడి ప్రేమలో పడిపోతుంది హీరోయిన్. హీరోకు సంబంధించిన పుస్తకం ఒకటి హీరోయిన్ కి అనుకోకుండా దొరుకుతుంది. దాన్ని ఒకటికి రెండుసార్లు ఆమె పోగొట్టుకున్నా తిరిగి తన దగ్గరికే వచ్చి చేరుతుంది. ఆ పుస్తకంలో ఉన్న హీరో ఫొటో పక్కన పెట్టుకుంటే కథానాయికకి హౌస్ ఫుల్ అయిన థియేటర్లో టికెట్లు దొరికేస్తాయి. దీంతో అతను తన ‘లక్’ అని.. డెస్టినీ తమ ఇద్దరినీ కలిపేస్తుందని హీరోయిన్ ఫిక్సపోయి అతడి ప్రేమలో మునిగిపోతుంది. ఇక హీరో పాత్ర గురించి ఏం చెప్పాలి? పీహెచ్డీ పూర్తి చేసి అమెరికా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నవాడు.. ఒకసారి తనకు దిష్టితీసిన గుమ్మడికాయ మీద కాలుజారి తన ఫ్రెండు పడిపోయాడని ఆగిపోతాడట. ఇంకోసారి పాస్ పోర్టు మీద పసుపు రాశారని అతడి పాస్ పోర్టుని తిరస్కరిస్తారట. ఇలాంటి ‘బలమైన’ కారణాలతో అతడి అమెరికా ప్రయాణం వాయిదా పడుతుంటే.. పీహెచ్డీ చేసిన హీరో ఖాళీ సమయాల్లో క్యాబ్ నడుపుతుంటాడట. ప్రధాన పాత్రల్ని ఇలా తీర్చిదిద్దాక వీళ్ల కథను ఏ ప్రేక్షకుడైనా ఎలా సీరియస్ గా తీసుకుంటాడు?

డెస్టినీ.. డెస్టినీ అని ఊదరగొట్టేస్తూ ‘నా నువ్వే’లో చూపించిన సిల్లీ కోయిన్సిడెన్సెస్ చూస్తే నవ్వు రాక మానదు. ఒక మ్యాజిక్ లాగా అనిపించే ఒకటో రెండో కోయిన్సిడెన్సెస్ చూపిస్తే ఓకే కానీ.. ఏదో ఫాంటసీ మూవీలో మాదిరి.. హీరో హీరోయిన్లకు రాసిపెట్టినట్లు.. ప్రతి సీన్లోనూ ఒక కోయిన్సిడెన్స్ చూపించడం చాలా కృత్రిమంగా అనిపిస్తుంది. ఆరంభంలో ఒకట్రెండు సీన్లు చూసి ఓకే అనుకుంటాం కానీ.. తర్వాత ఇవే సన్నివేశాలు రిపీటవుతుండటంతో వ్యవహారం సిల్లీగా తయారవుతుంది. అసలేమాత్రం కసరత్తు లేకుండా ఏమనిపిస్తే అది రాసేసి తీసేసిన ఫీలింగ్ వస్తుంది ప్రేక్షకుడికి.  ప్రేమకథలకు అసవరమైన ఫీల్ ఎంతమాత్రం లేకపోగా.. ప్రతి సీన్లోనూ అసహజత్వం నిండిపోయి మొదలైన కాసేపటికే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. హీరోయిన్ కానీ.. హీరో కానీ ఒకరితో ఒకరు ప్రేమలో పడటానికే సరైన రీజన్ కనిపించదు. ఇక వాళ్ల మధ్య ప్రేమను ఆడియన్స్ ఎలా ఫీలవుతారు? కనీసం వీరి మధ్య ఎడబాటుకైనా సరైన రీజన్ చూపించారా అంటే అదీ లేదు. ఇక వాళ్లు మళ్లీ కలవాలని ఎలా తపిస్తారు?

అసలే కథలో విషయం లేకపోగా.. కళ్యాణ్ రామ్-తమన్నా మధ్య అసలేమాత్రం కెమిస్ట్రీ పండకపోవడంతో ‘నా నువ్వే’ రాను రానూ భరించలేని విధంగా తయారవుతుంది. తన కెమెరా పనితనంతో రొమాన్స్ పండించడంలో మాస్టర్ అనిపించుకున్న పి.సి.శ్రీరామ్ సైతం ఏం చేయలేక చేతులెత్తేసే స్థాయిలో మిగతా వ్యవహారం చాలా పేలవంగా తయారైంది. ప్రథమార్ధం వరకైనా ఓ మోస్తరుగా అనిపించే ‘నా నువ్వే’.. ద్వితీయార్ధానికి వచ్చేసరికి తమ డెస్టినీ ఏంటి ఇలా తయారైందని ప్రేక్షకులు చింతించేలా చేస్తుంది. క్లైమాక్స్ లో ప్రేమకథలోని అసహజత్వం పతాక స్థాయికి చేరుకుంటుంది. దర్శకుడు జయేంద్ర తీసిన తొలి సినిమా ‘180’ ఎంత పెద్ద డిజాస్టర్ అయినప్పటికీ.. అందులో ఒక మెచ్యూరిటీ.. ఒక ప్రయత్నం.. ఒక ఫీల్ కనిపిస్తాయి. కానీ ‘నా నువ్వే’లో తమన్నా గ్లామర్.. సాంకేతిక ఆకర్షణలు మినహాయిస్తే చెప్పుకోవడానికి ఇంకే అంశాలూ లేవు.

నటీనటులు:

కళ్యాణ్ రామ్ లుక్ తో పాటు అతడి నటన కూడా కొత్తగా అనిపిస్తాయి. తనకు అలవాటు లేని పాత్రలో మేనేజ్ చేయడానికి బాగానే ప్రయత్నించాడు కానీ.. ఈ సినిమాకు అతను నప్పలేదు. పాత్రలో ఏమైనా బలం ఉంటే వేరే ఫీలింగ్ కలిగేదేమో మరి. రొమాంటిక్ సీన్లలో కళ్యాణ్ రామ్ ఇబ్బంది పడుతున్న విషయం తెరమీద స్పష్టంగా కనిపిస్తుంది. తమన్నా విషయానికొస్తే.. సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణ ఆమే. తమన్నాను మాత్రం దర్శకుడు.. కెమెరామన్ చాలా అందంగా చూపించారు. ఆమెలోని గ్లామర్ కోణాన్ని బాగా ఎలివేట్ చేశారు. తమన్నా నటన కూడా బాగుంది. మిగతా పాత్రలేవీ కూడా అంత ప్రత్యేకమైనవి కావు. తనికెళ్ల భరణి ఓకే. వెన్నెల కిషోర్.. ప్రవీణ్.. బిత్తిరి సత్తి.. పోసానిలను సరిగా ఉపయోగించుకోలేదు.

సాంకేతిక వర్గం:

‘నా నువ్వే’ సాంకేతికంగా ఉన్నతంగా కనిపిస్తుంది. శరత్ సంగీతం బాగుంది. రెండు మూడు పాటలు.. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. సన్నివేశాల్లో బలం లేకపోయినా.. తన సంగీతంతో సపోర్ట్ చేయడానికి శరత్ ప్రయత్నించాడు. పి.సి.శ్రీరామ్ మ్యాజిక్ పాటల్లో మాత్రమే కనిపిస్తుంది. సన్నివేశాల్లో ఆయన పనితనం చూపించడానికి అవసరమైన మ్యాజికల్ మూమెంట్స్ ఏమీ లేకపోయాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు జయేంద్ర అన్ని రకాలుగా విఫలమయ్యాడు. స్క్రిప్టు దశలోనే ‘నా నువ్వే’ పూర్తిగా తేలిపోయింది. తొలి సినిమాలో కాన్సెప్ట్ తేడా కొట్టినా.. దర్శకుడిగా ఆయన అభిరుచి.. మెచ్యూరిటీ కనిపిస్తాయి. కానీ ఈసారి జయేంద్ర పూర్తిగా తేలిపోయాడు. రచయితగా.. దర్శకుడిగా కనీస పనితనం చూపించలేకపోయాడు.

చివరగా: నా నువ్వే.. సోల్ లెస్ లవ్ స్టోరీ

రేటింగ్- 1.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS