మెంటల్ మదిలో

Fri Nov 24 2017 GMT+0530 (IST)

మెంటల్ మదిలో

‘మెంటల్ మదిలో’ రివ్యూ
నటీనటులు: శ్రీ విష్ణు-నివేథా పెతురాజ్-అమృత-శివాజీ రాజా-కిరీటి-అనితా చౌదరి తదితరులు
సంగీతం: ప్రశాంత్ విహారి
ఛాయాగ్రహణం: వేదరామన్
నిర్మాత: రాజ్ కందుకూరి
రచన-దర్శకత్వం: వివేక్ ఆత్రేయ

చిన్న చిన్న పాత్రలతో ప్రస్థానం మొదలుపెట్టి.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాతో హీరోగా మంచి పేరే తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. ఇటీవలే ‘ఉన్నది ఒకటే జిందగీ’లో వాసుగా ఆకట్టుకున్న అతను.. ఇప్పుడు సోలో హీరోగా ‘మెంటల్ మదిలో’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘పెళ్లిచూపులు’ నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందించాడు. చక్కటి ప్రోమోలతో ఆకర్షించిన ఈ చిత్రంలోని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: అరవింద్ కృష్ణ (శ్రీవిష్ణు) పెద్ద కన్ఫ్యూజన్ మాస్టర్. అతడికి ఏ విషయంలో అయినా సరే.. ఆప్షన్లు ఇస్తే కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఈ సమస్యతో ఇబ్బంది పడుతుున్న అతడికి పెళ్లిచూపుల్లో స్వేచ్ఛ అనే అమ్మాయితో పరిచయమవుతుంది. ఇద్దరికీ ఒకరికొకరు నచ్చుతారు. ఇక పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలో జాబ్ అసైన్మెంట్లో భాగంగా ముంబయి వెళ్తాడు అరవింద్. అక్కడ అతడికి రేణు (అమృత) అనే అమ్మాయి పరిచయమవుతుంది. ఆమెకు అరవింద్ ఆకర్షితుడవుతాడు. ఇక అతడి సమస్య మళ్లీ మొదటికొస్తుంది. ఇద్దరిలో ఏ అమ్మాయిని ఎంచుకోవాలో తెలియక అయోమయానికి గురవుతాడు. మరి ఈ ఇద్దరిలో అరవింద్ ఎవరిని ఎంచుకున్నాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: కొత్త కథలు ఎక్కడి నుంచే ఊడి పడవు. చుట్టూ ఉన్న మనుషుల జీవితాల్ని పరిశీలిస్తే.. మనుషుల్ని అంచనా వేయడం.. అర్థం చేసుకోవడం మొదలుపెడితే.. ప్రతి విషయమూ ఓ కథా వస్తువే అనడానికి ‘మెంటల్ మదిలో’ ఒక రుజువుగా నిలుస్తుంది. మనలో.. మన చుట్టూ ఉండే చాలామంది మనుషుల్లో ఉండే.. ఎవరూ గుర్తించని ఒక సామాన్యమైన లక్షణాన్ని కథా వస్తువుగా ఎంచుకుని దాని మీద రెండు గంటల సినిమాను తీసి మెప్పించినందుకు కొత్త దర్శకుడు వివేక్ ఆత్రేయకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. జీవితంలో కన్ఫ్యూజన్ లేని వ్యక్తి అంటూ ఎవరుంటారు..? ఏది ఎంచుకోవాలో తెలియక సతమతమయ్యే పరిస్థితి ప్రతి వ్యక్తి జీవితంలో నిత్యం ఎదురవుతూనే ఉంటుంది. అలాంటి కన్ఫ్యూజన్ చాలా ఎక్కువగా ఉన్న ఒక వ్యక్తి కథను ఎంతో అందంగా.. ఆహ్లాదకరంగా.. ఆలోచన రేకెత్తించేలా తెరమీద చూపించిన సినిమా ‘మెంటల్ మదిలో’.

మనిషి మతిమరుపు నేపథ్యంలో మారుతి తీసిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా చూశాం. ఐతే అందులో ‘మతిమరుపు’ అనే కాన్సెప్ట్ వినోదం పండించడానికే ఉపయోగించుకున్నాడు మారుతి. ఆ కాన్సెప్ట్ ను అతను చక్కగా కమర్షియలైజ్ చేశాడు. కాన్సెప్ట్ పరంగా చూస్తే ‘మెంటల్ మదిలో’ కూడా ఆ తరహా సినిమానే. ఐతే ఇక్కడ భిన్నంగా అనిపించే విషయ ఏంటంటే.. ‘కన్ఫ్యూజన్’ కాన్సెప్టుని కేవలం వినోదం కోసం వాడుకుని వదిలేయకపోవడం. దాని మీదే పూర్తి కథను నడిపించాడు. ఆరంభం నుంచి చివరి దాకా సినిమా హీరో తాలూకు ఈ ‘లక్షణం’ మీదే నడుస్తుంది. మొదట్లో దాన్నుంచి వినోదం పండించి.. ఆ తర్వాత దాంతోనే కథనూ మలుపు తిప్పాడు. దాన్నుంచో ఎమోషన్ కూడా రాబట్టాడు. వివేక్ ఎంత నిజాయితీగా సినిమా తీసే ప్రయత్నం చేశాడో చెప్పడానికి ఇది రుజువు.

‘మెంటల్ మదిలో’లో ప్రత్యేకంగా అనిపించే మరో విషయం.. ఇందులోని సహజత్వం. సినిమాలో ఎక్కడా కూడా డ్రామాకు చోటే లేదు. ప్రతి పాత్రా.. ప్రతి సంభాషణా.. ప్రతి సందర్భం.. చాలా సహజంగా అనిపిస్తాయి. మనకు తెలిసిన మనుషుల్నే తెరమీద చూస్తున్న భావన కలుగుతుంది. యునీక్ గా అనిపించే ప్రధాన పాత్రలు సినిమాకు మరో పెద్ద బలం. ప్రతిదానికీ కన్ఫ్యూజ్ అయ్యే ఓ అబ్బాయి.. తనకేం కావాలో బాగా తెలిసి చాలా కాన్ఫిడెంట్ గా జీవితాన్ని లీడ్ చేసే ఓ అమ్మాయి.. లోపల ఎంతో బాధను దాచుకుని పైకి చాలా సరదాగా.. అంతుచిక్కని విధంగా కనిపించే మరో అమ్మాయి.. ఇలా ఏ పాత్రకు ఏ పాత్రకు ఒక వ్యక్తిత్వం కనిపిస్తాయి. ఆ పాత్రల తాలూకు లక్షణాల్ని ఎస్టాబ్లిష్ చేసిన తీరు కూడా మెప్పిస్తుంది. ప్రతి పాత్రనూ ప్రేక్షకుడు ఓన్ చేసుకునేలా వాటిని తీర్చిదిద్దాడు దర్శకుడు.

ముఖ్యంగా శ్రీవిష్ణు పాత్ర సినిమాకు అతి పెద్ద ఆకర్షణ. మనిషన్నాక కన్ఫ్యూజన్ అన్నది కామన్ కాబట్టి ఈ పాత్రతో చాలా ఈజీగా కనెక్టయిపోతాం. పైగా ఈ పాత్రను మొదలుపెట్టిన తీరు.. ఆ పాత్ర లక్షణాన్ని ఎస్టాబ్లిష్ చేసిన తీరు చాలా బాగుంటుంది. చిన్నపుడు స్కూల్లో పరీక్ష పేపర్లో అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాసేసి.. మల్టిపుల్ ఛాయిస్ దగ్గర మాత్రం ఆగిపోతాడు. హీరో ఎంతటి కన్ఫ్యూజన్ మాస్టరో చూపించడానికి ఇంత కంటే మంచి సన్నివేశం ఇంకేముంటుంది. ఆ తర్వాత హీరో పెళ్లిచూపుల సీన్లు కూడా హిలేరియస్ అనిపిస్తాయి. ఇలా హీరో పాత్రను చక్కగా ఆరంభించాక హీరోయిన్ పాత్రను ప్రవేశ పెడతాడు దర్శకుడు. మంచి పాత్ర.. దానికి పర్ఫెక్టుగా కుదిరిన నివేథా రాకతో సినిమా మరింత ఆహ్లాదకరంగా తయారవుతుంది. ఆహ్లాదకరంగా సాగిపోయే సరదా సన్నివేశాలతో ప్రథమార్ధం శరవేగంగా సాగిపోతుంది.

ఇంటర్వెల్ మలుపు చిన్నపాటి షాక్ ఇస్తుంది. అప్పటికే నివేథా చేసిన స్వేచ్ఛ పాత్రతో బాగా కనెక్టయిపోయిన ప్రేక్షకుడికి.. హీరో ఇచ్చే షాక్ తో ఒక రకమైన అసహనం కలుగుతుంది. కానీ అతను ఏ పరిస్థితుల్లో మరో అమ్మాయితో ముడిపడ్డాడో చూశాక.. నెమ్మదిగా కన్విన్స్ అవుతాం. స్వేచ్ఛ పాత్రతో ముందే కనెక్టవడం వల్ల.. నిజానికి రేణు పాత్రపై ముందు ప్రేక్షకుల్లో ఒక వ్యతిరేకత ఉంటుంది. కానీ ఆమె పాత్రను మలిచిన తీరుతో నెమ్మదిగా దాంతోనూ కనెక్టవుతాం. ఈ ఎపిసోడ్ దగ్గర కథ కొంచెం నెమ్మదించిన భావన కలుగుతుంది. అరవింద్-రేణుల మధ్య బంధాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు దర్శకుడు కొంచెం ఎక్కువ సమయమే తీసుకున్నాడు. కానీ అలా టైం తీసుకోకుంటే రేణు పాత్రను ఎస్టాబ్లిష్ చేయడం కష్టమే. ఏదేమైనా ప్రథమార్ధంలో ఉన్న ఆహ్లాదం.. వినోదం.. వేగం ద్వితీయార్దం మిస్సయింది. ఐతే క్లైమాక్స్ దగ్గర మళ్లీ సినిమా మళ్లీ పట్టాలెక్కుతుంది. ముగింపు ఆకట్టుకుంటుంది. ప్లెజెంట్ మైండ్ తో ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటికి వచ్చేలా ముగింపునిచ్చాడు వివేక్.

ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకునే పాయింట్ మీద కథ నడపడం.. ఈజీగా కనెక్టయ్యే పాత్రలుండటం ‘మెంటల్ మదిలో’కు ఉన్న పెద్ద ప్లస్. చూస్తున్నంతసేపూ ఆహ్లాదకరంగా అనిపించి.. బయటికి వచ్చాక కూడా వెంటాడే సినిమాల్లో ఇది ఒకటి. ఇందులో సహజత్వం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐతే వివేక్ ఆత్రేయ క్లాస్ నరేషన్ స్టయిల్.. అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చుతుందా అన్నది సందేహమే. కమర్షియల్ సినిమాల్ని ఇష్టపడేవారికి ఇదిఅ అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. కథకు అవసరం రీత్యానే అయినప్పటికీ ద్వితీయార్ధం నెమ్మదించి అక్కడక్కడా బోర్ కొట్టిస్తుంది. కొత్తదనం కోరుకునే వాళ్లకు.. సహజత్వంతో.. మంచి ఫీల్ తో సాగే సినిమాలు చూడాలనుకునేవారికి ‘మెంటల్ మదిలో’ మంచి ఛాయిస్.

నటీనటులు: శ్రీవిష్ణుకు కచ్చితంగా ఇది కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అనే చెప్పాలి. తెరమీద శ్రీవిష్ణు కాకుండా అరవింద్ కృష్ణ అనే వ్యక్తిని చూస్తున్నట్లుగా చాలా సహజంగా నటించాడు. ఆ పాత్రకు తగ్గట్లుగా అతను బిహేవ్ చేశాడు. పాత్ర తాలూకు లక్షణాల్ని అతను ప్రతి సన్నివేశంలోనూ చూపించాడు. బాడీ లాంగ్వేజ్.. హావభావాలు.. డైలాగ్ డెలివరీ.. ఇలా ప్రతి విషయంలోనూ ఆకట్టుకున్నాడు శ్రీవిష్ణు. హీరోయిన్ నివేదా పెతురాజ్ కూడా చాలా బాగా చేసింది. ఆమె అందం.. అభినయం రెండూ ఆకట్టుకుంటాయి. నివేథా పాత్ర తెరమీదికి వచ్చిన కొన్ని నిమిషాలకే ఆమెతో ఈజీగా కనెక్టయిపోతాం. ఆమె హావభావాలు కట్టిపడేస్తాయి. తనకు డబ్బింగ్ కూడా బాగా కుదిరింది. ఇంకో హీరోయిన్ అమృత కూడా బాగా చేసింది. ఆమె పాత్ర కూడా గుర్తుండిపోతుంది. శివాజీ రాజా చాన్నాళ్ల తర్వాత మంచి పాత్ర చేశాడు. ఆయన పాత్ర మొదట్లో బాగా నవ్విస్తుంది. రాజ్ మాదిరాజు.. కిరీటి.. అనితా చౌదరి.. మిగతా నటీనటులు కూడా బాగా చేశారు.

సాంకేతికవర్గం: ‘మెంటల్ మదిలో’కు సాంకేతిక నిపుణులు కూడా చక్కటి సహకారం అందించారు. ప్రశాంత్ విహారి సోల్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు.. నేపథ్య సంగీతం కొత్తగా ఉంటూనే.. చాలా ప్లెజెంట్ గా అనిపిస్తాయి. మ్యూజిక్ కూడా సినిమాను డ్రైవ్ చేస్తుంది. వేదరామన్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. అది సినిమాకు అందమైన లుక్ తీసుకొచ్చింది. ఓ కొత్త దర్శకుడితో ఇలాంటి కథతో సినిమా చేసేందుకు అంగీకరించినందుకు నిర్మాత రాజ్ కందుకూరిని అభినందించాలి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక వివేక్ ఆత్రేయ దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మంచి మార్కులు కొట్టేశాడు. చాలా చిన్న పాయింట్ తీసుకుని దాని మీద కథాకథనాల్ని నడిపించిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. పాత్రలు.. వాటి చిత్రణ.. సంభాషణలు.. అన్నింట్లోనూ దర్శకుడి ప్రత్యేకత.. అభిరుచి కనిపిస్తాయి. న్యూ వేవ్ సినిమాకు తానూ ఒక ప్రతినిధినని వివేక్ చాటుకున్నాడు. మున్ముందు చూడదగ్గ దర్శకుల్లో వివేక్ ఒకడనడంలో సందేహం లేదు.

చివరగా: మెంటల్ మదిలో.. నిలిచిపోతుంది మదిలో!

రేటింగ్- 3/5

LATEST NEWS