'లవర్స్ డే'

Thu Feb 14 2019 GMT+0530 (IST)

'లవర్స్ డే'

 చిత్రం : 'లవర్స్ డే'

నటీనటులు: మహ్మద్ రోషన్ - ప్రియ ప్రకాష్ వారియర్ - నూరిన్ షెరీఫ్ తదితరులు
సంగీతం: షాన్ రెహ్మాన్
ఛాయాగ్రహణం: సిద్దార్థ్
నిర్మాతలు: గురురాజ్ - వినోద్ రెడ్డి
రచన - దర్శకత్వం: ఒమర్ లులు

గత ఏడాది కన్ను గీటే వీడియోతో కోట్లాది మంది కుర్రాళ్ల గుండెలకు గాయం చేసిన అమ్మాయి ప్రియ ప్రకాష్ వారియర్. ఆ వీడియో ఆమె కథానాయికగా నటించిన ‘ఒరు అడార్ లవ్’ సినిమాలోనిది. ఈ చిత్రం ‘లవర్స్ డే’ పేరుతో ఈ రోజే తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రియ వింక్ మూమెంట్ కు మించి ఈ సినిమాలో ఏముందో చూద్దాం పదండి.

కథ:

రోషన్ (మహ్మద్ రోషన్).. ప్రియ (ప్రియ ప్రకాష్ వారియర్) పదో తరగతి పూర్తి చేసుకుని డాన్ బోస్కో అనే స్కూల్లో ప్లస్ వన్ లో చేరతారు. ప్రియతో తొలి చూపులోనే ప్రేమలో పడిపోయిన రోషన్.. తర్వాత కొన్ని చిలిపి పనులతో ఆమెను ఇంప్రెస్ చేస్తాడు. ఇద్దరి ప్రేమాయణం సాఫీగా సాగిపోతున్న సమయంలో రోషన్ చేసిన ఒక తప్పు వల్ల అతడికి ప్రియ దూరమవుతుంది. ఇంతలో రోషన్.. ప్రియను ఉడికించడానికి తన స్నేహితురాలైన మరో అమ్మాయితో ప్రేమ నటిస్తాడు. దీని వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.. చివరికి రోషన్-ప్రియల ప్రేమకథకు ముగింపేంటి అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

స్కూల్లో చదువుకునే పిల్లల మధ్య ప్రేమ అంటేనే వినడానికి ఏదోలా ఉంటుంది. ఈ నేపథ్యంలో సినిమా తీయడం అంటే సవాలే. తెర మీద పాత్రలు ఆ వయసుకు తగ్గట్లే ప్రవర్తించాలి. అలా ప్రవర్తిస్తుంటే చూసే ప్రేక్షకులకు సిల్లీగా అనిపిస్తుంది. అలా కాకుండా ఆ పాత్రలు కొంచెం పరిణతితో వ్యవహరిస్తే.. సహజత్వం లోపిస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రేమకథల్ని డీల్ చేయడం చాలా కష్టమైన వ్యవహారమే. తెలుగులో చివరగా కొంచెం రీజనబుల్ గా ఇలాంటి కథను డీల్ చేసిన పూర్తి స్థాయి సినిమా అంటే ‘టెన్త్ క్లాస్’ అనే చెప్పాలి. ఆ తర్వాత ‘ఆంధ్రా పోరి’.. ‘నిర్మలా కాన్వెంట్’ లాంటి సినిమాలు ఇలాంటి కథలతోనే తెరకెక్కాయి కానీ.. అవి మెప్పించలేదు. దీంతో ఇలాంటి కథలు మళ్లీ ఎవ్వరూ ట్రై చేయలేదు. ఇలాంటి కథతో తెరకెక్కిన సినిమానే ‘లవర్స్ డే’. కన్ను గీటే వీడియోతో ప్రియ ప్రకాష్ వారియర్ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న నేపథ్యంలో ఈ చిత్రం ఇక్కడికి వచ్చింది. ప్రియ గురించి.. సినిమా గురించి ఏదోో ఊహించుకుని పొరబాటున తొలి రోజు ఈ సినిమా థియేటర్లకుళ్తే.. జీవితంలో ‘వేలంటైన్స్ డే’ అనేది ఎప్పటికీ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయం. సినిమా చూసిన వాళ్లెవ్వరికీ కూడా ఈ స్టేట్మెంట్ ఎంత మాత్రం అతిగా అనిపించదు.

‘లవర్స్ డే’ పర భాషల నుంచి వచ్చిన అత్యంత చెత్త సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. మామూలుగా వేరే భాష నుంచి ఒక సినిమా తెలుగులోకి అనువాదం అవుతోందంటే.. అది మన వాళ్లకు బాగానే పరిచయం ఉన్న నటీనటులో.. టెక్నీషియన్లో చేసిన సినిమా అయ్యుండాలి. లేదంటే బలమైన కంటెంట్ ఉన్న చిత్రమైనా అయ్యుండాలి. ఐతే కేవలం ప్రియకు పాపులారిటీ వచ్చింది కదా అని ఈ సినిమాను తీసుకొచ్చి తెలుగు ప్రేక్షకుల పైకి తోసేశారు. మలయాళంలో గొప్ప గొప్ప సినిమాలొస్తుంటాయి కాబట్టి కనీస స్థాయిలో అయినా ‘లవర్స్ డే’ ఉంటుందనుకుంటే అది అత్యాశే అవుతుంది. మొదలైన కొన్ని నిమిషాలకే ఒక బి-గ్రేడ్ సినిమా చూస్తున్న భావన కలిగించే ‘లవర్స్ డే’ రెండున్నర గంటల పాటు థియేటర్లలో కూర్చున్న ప్రేక్షకులకు నరకం చూపిస్తుంది. ఒక కథ లేదు. సరైన పాత్రలు లేవు. పర్వాలేదు అనిపించే ఒక సన్నివేశం లేదు. సినిమా మీద ఏమాత్రం అవగాహన లేని వాళ్లు.. చేతికి కెమెరా దొరికి ఏది పడితే తీసేసినట్లుగా అనిపిస్తుంది ‘లవర్స్ డే’ చూస్తున్నంతసేపూ.

కథాకథనాలు.. ఇతర విశేషాల గురించి మరీ లోతుల్లోకి వెళ్లి చర్చించే అర్హత ఉన్న సినిమా కూడా కాదిది. ఈ సినిమాకు జనాల్ని ఆకర్షించింది ప్రియ ప్రకాష్ వారియర్ కాబట్టి ఆమె పాత్ర గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఈ సినిమా ఆరంభ దశలో ఉండగానే ప్రియ వీడియో వైరల్ అయింది. ఆమెకు ఎక్కడలేని పాపులారిటీ వచ్చింది. సినిమాపై అంచనాలు పెరిగిన నేపథ్యంలో చాలా టైం తీసుకుంది చిత్ర బ ృందం. ఇలా ఆలస్యం జరిగిందంటే.. ప్రియ పాత్ర మీద.. సినిమా మీద మరింత శ్రద్ధ పెట్టి తీశారేమో అనుకుంటాం. కానీ ఆశ్చర్యకరంగా ప్రియకు సినిమాలో సరైన క్యారెక్టరే లేదు. ఆమెను లీడ్ హీరోయిన్ అని కూడా అనలేం. మధ్యలో సైడైపోయి మరో అమ్మాయి పాత్ర హైలైట్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రియది ఇందులో సహాయ పాత్రే. చెప్పుకోవడానికి ఒక్క సరైన సీన్ పడలేదు ప్రియకి. ఏవో రెండుచోట్ల కన్ను కొట్టించి పక్కన పెట్టేశారు. అవి ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసినవే ఆయె. వాటిని దాటి సినిమాలో ప్రియ కొత్తగా చేసిందేమీ లేదు. ఆమె కోసం సినిమాకు వెళ్లేవాళ్లకు తీవ్ర నిరాశ తప్పదు. ఊరికే ప్రియ పేరు చెప్పి సినిమాను అమ్మి.. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల్ని మోసం చేయడం తప్పితే.. చిత్ర బృందం చేసిందేమీ లేదు. సినిమా అంతా ఒకెత్తయితే.. ఇందులో క్లైమాక్స్ మరో ఎత్తు. చెత్తగా అనిపించే అలాంటి క్లైమాక్స్ తర్వాత తానేదో కళాఖండం తీసినట్లు ‘ఎన్ ఒమర్స్ లవ్’ అంటూ దర్శకుడు ట్యాగ్ వేసుకోవడమే విడ్డూరం.

నటీనటులు:

‘లవర్స్ డే’ అనే సినిమా తెలుగులో రిలీజైందన్నా.. దాని పట్ల ప్రేక్షకులు ఏమైనా ఆసక్తి కనబరిచారన్నా అందుక్కారణం ప్రియ ప్రకాష్ వారియరే. ఆమె మీద ఎన్నో అంచనాలు పెట్టుకుని సినిమాకు వెళ్లిన వాళ్లకు నిరాశ తప్పదు. ఇందులో ప్రియ పాత్ర సాధారణం. ఆమె కొన్ని సీన్లలో తన అందంతో హావభావాలతో మెప్పించినప్పటికీ.. కథలో కానీ.. ఆమె పాత్రలో కానీ ఏ ప్రత్యేకతా లేకపోవడం వల్ల నిరాశే మిగులుతుంది. హీరో రోషన్ చలాకీగా నటించి మెప్పించాడు కానీ.. అతడి పాత్రా సాధారణమే. హీరో స్నేహితురాలిగా నటించిన నూరిన్ షెరీఫ్ చక్కటి హావభావాలతో ఆకట్టుకుంది. మిగతా నటీనటుల గురించి చెప్పడానికేమీ లేదు.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా ‘లవర్స్ డే’ సోసోగా అనిపిస్తుంది. షాన్ రెహ్మాన్ పాటలు పర్వాలేదనిపిస్తాయి. నేపథ్య సంగీతం మామూలుగా అనిపిస్తుంది. కెెమెరా పనితనం సాధారణం. తెలుగు సినిమాలతో పోలిస్తే నిర్మాణ విలువలు సబ్ స్టాండర్డ్ అనిపిస్తాయి. ఏదో బి-గ్రేడ్ సిిినిమా చూస్తున్న భావన కలుగుతుంది. దర్శకుడు ఒమర్ లులు గురించి చెప్పడానికేమీ లేదు. ప్రియ కారణంగా సినిమాకు వచ్చిన క్రేజ్ ను అతనేమాత్రం ఉపయోగించుకోలేదు. పేలవమైన కథాకథనాలతో చెత్త సినిమా తీసి పెట్టాడు.

చివరగా: లవర్స్ డే.. భరించలేం బాబోయ్

రేటింగ్-1/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre


LATEST NEWS