లక్కున్నోడు

Thu Jan 26 2017 GMT+0530 (IST)

లక్కున్నోడు

చిత్రం : ‘లక్కున్నోడు’

నటీనటులు: మంచు విష్ణు-హన్సిక-జయప్రకాష్-ఎంవీవీ సత్యనారాయణ-శ్రావణ్-ప్రభాస్ శీను-వెన్నెల కిషోర్-పోసాని కృష్ణమురళి-సురేష్-సత్యం రాజేష్ తదితరులు
సంగీతం: అచ్చు
నేపథ్య సంగీతం: చిన్నా
ఛాయాగ్రహణం: పి.జి.విందా
స్క్రీన్ ప్లే-మాటలు: డైమండ్ రత్నబాబు
నిర్మాత: ఎంవీవీ సత్యనారాయణ
కథ-దర్శకత్వం: రాజా కిరణ్

హారర్ కామెడీ ‘గీతాంజలి’తో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే విజయాన్నందుకున్నాడు రాజా కిరణ్. ఆ తర్వాత అతను తీసిన ‘త్రిపుర’ బోల్తా కొట్టేసింది. ఈసారి తన శైలికి భిన్నంగా ఓ కామెడీ ఎంటర్టైనర్ ట్రై చేశాడు రాజా కిరణ్. అదే.. లక్కున్నోడు. కామెడీ సినిమాల్లో మంచి ట్రాక్ రికార్డున్న మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ‘ఎస్-3’ వాయిదా పడ్డ నేపథ్యంలో వారం ముందుకు జరిగి గణతంత్ర దినోత్సవ కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

భక్తవత్సలం (జయప్రకాష్)కు లేక లేక పుట్టిన కొడుకు లక్కీ (మంచు విష్ణు). అతను పుట్టగానే తండ్రికి కలిసొస్తుంది. కానీ ఆ వెంటే కష్టాలు మొదలవుతాయి. లక్కీ పెరిగి పెద్దవుతున్న కొద్దీ మళ్లీ మళ్లీ ఇలాగే జరగడంతో అతణ్ని నష్ట జాతకుడిగా భావించి అసహ్యించుకుంటాడు భక్తవత్సలం. కూతురి పెళ్లి కోసం దాచిన డబ్బుల్ని కూడా లక్కీ పోగొట్టడం.. దాని వల్ల తన పరువు పోవడంతో లక్కీ మీద తండ్రికి అసహ్యం మరింత పెరిగిపోతుంది. మరోవైపు తాను ప్రేమించిన అమ్మాయి కూడా తనను అసహ్యించుకోవడంతో ఇక ఆత్మహత్యే శరణ్యం అనుకుంటాడు లక్కీ. అలాంటి సమయంలో అతడి జీవితం అనుకోకుండా మలుపు తిరుగుతుంది. ఆ మలుపేంటి.. తర్వాత ఏమైంది.. అన్నది తెరమీదే చూడాలి.

కథనం - విశ్లేషణ:

బస్సులో మారిపోయిన తన బ్యాగును హీరో భద్రంగా తీసుకొచ్చి తనకిచ్చేశాడని.. అతడి దగ్గర పాతిక కోట్లు తీసుకొచ్చి పెట్టేస్తాడు విలన్ గ్యాంగులో ఒకడు. కానీ ఆ డబ్బు అనుకోకుండా తన సొంతం అయిపోవడంతో ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోతాడు హీరో. కానీ ఒక పార్టీ సాంగ్ అతడికి జ్నానోదయం అయిపోతుంది. ఆ డబ్బు వాడుకోవడం తప్పని తీసుకెళ్లి పోలీస్ అధికారికి ఇచ్చేయబోతాడు. ఆ పాతిక కోట్లకు సంబంధించిన కథేంటో పోలీస్ అధికారి చెప్పగానే.. ఆ డబ్బు వెనక్కి తీసుకుని విలన్ భరతం పడతానంటూ రెడీ అయిపోతాడు. పోలీస్ బాస్ కూడా అలాగే.. నువ్వు ఎలా కావాలంటే అలా చెయ్యి అనేసి అతను ఓ పోలీసుని వాడేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చేస్తాడు. పాతిక కోట్ల మేటర్ని అందరూ ఇంత తేలిగ్గా తీసుకుని సిల్లీగా డీల్ చేస్తుంటే.. బ్యాగులో ఉన్నవి చెల్లే నోట్లేనా అని సందేహం కలగక మానదు.

డబ్బులతో ముడిపడ్డ దొంగా పోలీస్ కథలు కామెడీగా ఉంటేనే బాగుంటాయి. కానీ మరీ ఇంత సిల్లీగా సీన్స్ రాసుకునేసరికి కామెడీ పండకపోగా.. సినిమానే కామెడీ అయిపోయింది. ‘లక్కున్నోడు’లో ఆరంభ సన్నివేశాలు చూస్తుంటే లైట్ హార్టెడ్ కామెడీ ఎంటర్టైనర్ లాగా అనిపిస్తుంది. హీరో పరిచయం కాగానే అవతలి వాళ్లకు అదృష్టం కలిసొచ్చేసి.. తర్వాతి సీన్లోనే మొత్తం తిరగబడుతుందనే విషయాన్ని చూపించే క్రమంలో విష్ణు- సత్యం రాజేష్ కాంబినేషన్లో వచ్చే కామెడీ ఎపిసోడ్ బాగానే నవ్విస్తుంది. విష్ణు-వెన్నెల  కిషోర్ కాంబినేషన్లో సీన్లు కూడా పర్వాలేదనిపిస్తాయి. ఐతే ఈ కామెడీని ఓ మోస్తరుగా ఎంజాయ్ చేస్తుండగా.. ఇంతకీ ట్రైలర్లో చూపించిన అసలు కథ ఇంకా మొదలవలేదేంటి అనుకుంటాం. దాని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తాం. కానీ ఆ ఎపిసోడ్ మొదలయ్యాక ఈ కథ గాడి తప్పేసింది. పైన చెప్పుకున్న తరహాలో చాలా సిల్లీగా సాగిపోతూ ప్రేక్షకుడిలో ఆసక్తిని అంతకంతకూ తగ్గించేస్తుంది.

‘లక్కున్నోడు’ కొంత వరకు కామెడీ మాత్రమే పండింది. అసలు కథతో ముడిపడ్డ వ్యవహారమంతా కూడా విసిగిస్తుంది. అసలే కథలో అంత సీరియస్ నెస్ లేదనుకుంటుంటే.. విలన్ అవతారం ఎత్తిన ఎంవీవీ సత్యానారాయణ ఆ సీరియస్ నెస్ ను మరింత తగ్గించేస్తాడు. అసలే వీక్ క్యారెక్టర్ అంటే.. ఎంవీవీ చేయడంతో ఆ పాత్ర మరింత వీక్ అయిపోయింది. ప్రథమార్ధాన్ని కామెడీతో ఎలాగోలా లాగించేయొచ్చు కానీ.. ద్వితీయార్ధమే అనాసక్తికరంగా సాగి బోర్ కొట్టిస్తుంది. హీరో-విలన్ మధ్య సాగే ఆట ఆసక్తి రేకెత్తించదు. ప్రేక్షకుడితో ఉత్సాహం తీసుకొచ్చే మూమెంట్ ఏదీ ద్వితీయార్ధంలో లేదు. చివర్లోకి వచ్చేసరికి తండ్రీ కొడుకుల సెంటిమెంటు పండిచడానికి మెలోడ్రామా బాగా దట్టించారు. కొడుకును తండ్రి అపార్థం చేసుకోవడం.. చివర్లో రియలైజ్ అవ్వడం.. ఈ నేపథ్యంలో చాలా సినిమాల్లో చూసిన సెంటిమెంటు సీనే ఇందులోనూ కనిపిస్తుంది. ఐతే కొడుకును తండ్రి అపార్థం చేసుకునే సన్నివేశాలే చాలా ఫోర్స్డ్ గా అనిపించడంతో చివర్లో వచ్చే సన్నివేశాలు మరీ డ్రమటిగ్గా తయారయ్యాయి. సినిమా మొదలైనపుడు ఉండే పాజిటివ్ ఫీలింగ్ చివరికి వచ్చేసరికి బాగా తగ్గిపోతుంది. ‘లక్కున్నోడు’ ఒక సాదాసీదా సినిమాగా ముగుస్తుంది.
 
నటీనటులు:

మంచు విష్ణుకు ఈ కథ మీద అపారమైన నమ్మకం ఉన్నట్లుంది. అందుకే ‘ఢీ’ స్టయిల్లో కాన్ఫిడెంటుగా.. చలాకీగా నటించే ప్రయత్నం చేశాడు. కామెడీ సీన్స్ లోవిష్ణు నటన ఆకట్టుకుంటుంది. కానీ సెంటిమెంటు సీన్లలో అంతగా మెప్పించలేకపోయాడు. పాజిటివ్ పద్మగా ఆరంభంలో హన్సిక పాత్ర బాగానే అనిపిస్తుంది కానీ.. తర్వాత మామూలైపోయింది. ఆమెలో మునుపటి గ్లో లేదు. పైగా ఆమె మేకప్ పేలవంగా ఉంది. అసలే బాగా తెలుపు. దాని మీద మరీ ఎక్కువ మేకప్ వేయడం సినిమా అంతటా హన్సిక అదోలా కనిపించింది. ఆమెకు పెద్దగా నటించే అవకాశం కూడా రాలేదు. జయప్రకాష్ తండ్రి పాత్రలో ఓకే. ఎంవీవీ సత్యానారాయణ విలన్ పాత్రకు అవసరమైన క్రూరత్వాన్ని చూపించలేకపోయాడు. క్యారెక్టరైజేషన్ కూడా ప్రత్యేకంగా ఏమీ లేకపోవడంతో ఆ పాత్ర ఇంపాక్ట్ చూపించలేకపోయింది. సత్యం రాజేష్.. వెన్నెల కిషోర్ ఉన్నంతలో బాగానే నవ్వించారు. ప్రభాస్ శీను పర్వాలేదు.

సాంకేతికవర్గం:

అచ్చు పాటలేవీ కూడా అంత క్యాచీగా లేవు. చాలా మొక్కుబడిగా పాటలిచ్చినట్లున్నాడతను. చిన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. పి.జి.విందా ఛాయాగ్రహణం బాగుంది. కెమెరా పనితనం ప్రత్యేకంగా కనిపించేంత సినిమా కాకపోయినా.. విజువల్స్ మంచి ఫీలింగే ఇస్తాయి. నిర్మాణ విలువలు ఓకే. డైమండ్ రత్నబాబు అక్కడక్కడా తనదైన శైలిలో కొన్ని పంచులు పేల్చాడు. వెన్నెల కిషోర్-విష్ణు-హన్సిక కాంబినేషన్లో వచ్చే సన్నివేశాల్లో పంచులు నవ్విస్తాయి. ఐతే స్క్రీన్ ప్లేలో మాత్రం రత్నబాబు మ్యాజిక్ పని చేయలేదు. దర్శకుడు రాజా కిరణ్ రాసుకున్న కథే బలహీనంగా ఉండగా.. కథనం కూడా అలాగే సాగింది. హై మూమెంట్ ఏదీ లేకుండా స్క్రీన్ ప్లే ఫ్లాట్ గా సాగిపోవడంతో రెండు గంటల్లోపు నిడివి ఉన్నా సినిమా బోరింగ్ గా తయారైంది. థ్రిల్లర్ లక్షణాలున్న కథను ఎంచుకున్నప్పటికీ దర్శకుడు రాజా కిరణ్ ప్రేక్షకుల్ని పెద్దగా సర్ప్రైజ్ చేయలేకపోయాడు. అతడి నరేషన్ స్లోగా ఉండటం కూడా మైనస్ అయింది. కొన్ని కామెడీ సీన్లలో మినహాయిస్తే రాజా కిరణ్ మెప్పించలేకపోయాడు.

చివరగా: లక్కున్నోడు.. కిక్కు లేదు బాస్!

రేటింగ్: 2.25/5


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre