'లై'

Fri Aug 11 2017 GMT+0530 (IST)

'లై'

చిత్రం: ‘లై’

నటీనటులు: నితిన్ - మేఘా ఆకాశ్ - అర్జున్ - శ్రీరామ్ - రవికిషన్ - నాజర్ - మధునందన్ - పూర్ణిమ - సురేష్ - రాజీవ్ కనకాల - పృథ్వీ - బ్రహ్మాజీ తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: యువరాజ్
నిర్మాతలు: అనిల్ సుంకర - రామ్ ఆచంట - గోపీనాథ్ ఆచంట - వెంకట్
రచన - దర్శకత్వం: హను రాఘవపూడి

దర్శకుడిగా తన తలి సినిమా ‘అందాల రాక్షసి’తోనే తన అభిరుచిని చాటుకున్నాడు హను రాఘవపూడి. ఆ సినిమాతో ప్రశంసలు మాత్రమే దక్కించుకున్న హను.. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో కమర్షియల్ సక్సెస్ కూడా అందుకున్నాడు. ఇప్పుడతను ‘లై’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆసక్తికర ప్రోమోలతో క్యూరియాసిటీ పెంచుతూ వచ్చిన ‘లై’ అ రోజే థియేటర్లలోకి దిగింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

సత్యం (నితిన్) ఆవారాగా తిరిగే కుర్రాడు. అమెరికాకు వెళ్లి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితం సెటిలైపోతుందని ఉద్దేశంతో ఆ ప్రయత్నంలో ఉంటాడు. ఆ సమయంలోనే ఛైత్ర (మేఘా ఆకాశ్)తో కలిసి అతను యుఎస్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో ఇద్దరూ దగ్గరవుతారు. మరోవైపు అమెరికాలో ఉంటూ భారత్ కు వ్యతిరేకంగా పని చేస్తున్న ఒక అజ్నాత నేరస్థుడిని పట్టుకునేందుకు భారత నిఘా విభాగం ప్రయత్నిస్తుంటుంది. ఆ విభాగానికి చెందిన ఆది (శ్రీరామ్) కూడా యుఎస్ వస్తాడు. ఆ నేరస్థుడికి.. భారత నిఘా విభాగానికి మధ్య  సాగే పోరులో సత్యం చిక్కుకుంటాడు. అప్పుడు సత్యం జీవితం ఎలాంటి మలుపు తిరిగింది.. ఇంతకీ ఆ అజ్నాత నేరస్థుడు ఎవరు.. అతనేం చేస్తుంటాడు.. అతడికి-సత్యంకు సాగే పోరులో ఎవరు గెలిచారు.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘1 నేనొక్కడినే’ సినిమాను ఇప్పుడు చూస్తూ.. ఒక్కో సీన్ ఓపిగ్గా అర్థం చేసుకుంటూ వెళ్తే ఎంత గొప్ప సినిమానో కదా.. సుకుమార్ ఎంత తెలివైనోడో కదా అనిపిస్తుంది. కానీ ఆ సినిమాను థియేటర్లలో చూస్తున్నపుడు మాత్రం మెజారిటీ ప్రేక్షకులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. నిరంతరం పరీక్ష పెడుతూ సాగే సన్నివేశాలతో అయోమయంలో పడిపోయారు. తికమక పడి అసహనానికీ గురయ్యారు. ‘1 నేనొక్కడినే’ను ఆదరించనందుకు ప్రేక్షకుల్ని తిట్టిపోసేవాళ్లు కూడా లేకపోలేదు. కానీ ప్రేక్షకులకు అర్థం అయ్యేలా సరళంగా కథను చెప్పకపోవడం కచ్చితంగా దర్శకుడి వైఫల్యమే అవుతుంది.

ఓ దర్శకుడు ఎంతటి మేధావి అయినా కావచ్చు.. కానీ ఆ మేధావితనాన్నంతా తెరపై చూపిస్తానంటే ప్రేక్షకులు అంగీకరించరు. ఇంటలిజెన్స్ అనేది ఓ స్థాయి వరకే ఉండాలి. కథలో కీలకమైన అంశాల్ని కొంచెం విడమరిచి.. సరళంగా చెప్పాలి. లేకుంటే అది ‘1 నేనొక్కడినే’లా తయారవుతుంది. ఈ కోవలోని సినిమానే ‘లై’ కూడా. ఇలా అంటుంటే.. ఇది కూడా ‘1 నేనొక్కడినే’ ఫలితాన్ని చూస్తుందని కాదు. ‘1 నేనొక్కడినే’ లాగే ప్రేక్షకులకు పరీక్ష పెడుతుందని. దాని లాగే ఇది కూడా ‘ఇంటలిజెంట్’ సినిమా అని. ఓ వర్గం ప్రేక్షకులకు ఈ ఇంటలిజెంట్ స్పై థ్రిల్లర్ చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తే.. మిగతా ప్రేక్షకులకు ఇది చాలా వరకు ‘పరీక్ష’ పెడుతూ గందరగోళానికి గురి చేస్తుంది. ఇది కచ్చితంగా ఓ మంచి ప్రయత్నమే. వైవిధ్యమైన సినిమానే. కానీ ఓ ఇంటిలిజెంట్ సినిమాగా తీయాలన్న ప్రయత్నంలో ‘లై’ని ఒక వర్గానికే పరిమితం చేసేశాడు హను.

ట్రైలర్ చూడగానే కథ చెప్పేసి.. ఆరంభ సన్నివేశం చూడగానే క్లైమాక్స్ వరకు అంతా ఊహించేసేలా ప్రేక్షకులకు ఎవాల్వ్ అయిపోయిన ఈ రోజుల్లో సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్ని గెస్సింగ్ లో ఉంచుతూ.. వాళ్లను ఉత్కంఠకు గురి చేస్తూ కథనాన్ని నడిపించడం అంటే సులువైన విషయం కాదు. ఈ విషయంలో హనుకు మంచి మార్కులు పడతాయి. టూకీగా చెప్పుకుంటే ‘లై’ కథ అంత కొత్తదేమీ కాదు. ఒక అండర్ కవర్ ఏజెంట్.. చట్టానికి దొరక్కుండా వ్యవహారాలు నడిపే ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ ఆట ఎలా కట్టించాడన్నదే ఈ కథ.

ఐతే ఈ సింపుల్ స్టోరీని ఇంటలిజెంట్ స్క్రీన్ ప్లేతో ఆసక్తికరంగా నడిపించే ప్రయత్నం చేశాడు హను. ఇందుకోసం అతను ఎంచుకున్న ప్లాట్ చాలా కొత్తగా అనిపిస్తుంది. అలాగే విలన్ పాత్రను తీర్చిదిద్దిన విధానమూ ఆకట్టుకుంటుంది. అసలీ కథ అంతా కూడా విలన్ కోణంలోనే నడవడం కూడా వైవిధ్యంగా అనిపిస్తుంది. విలన్ పాత్రలో షేడ్స్.. ‘సూట్’ చుట్టూ నడిచే ప్లాట్ ఎంతో ఆసక్తి రేకెత్తిస్తాయి. ప్రేక్షకుల్ని ఆద్యంతం ఉత్కంఠకు గురి చేస్తాయి. మొత్తంగా ఈ సెటప్ అంతా కూడా బాగుంది. విలన్-హీరో మధ్య నడిచే మైండ్ గేమ్ ‘లై’కి ప్రధాన ఆకర్షణ. దీని వరకు హాలీవుడ్ థ్రిల్లర్లను మ్యాచ్ చేస్తుంది ‘లై’. కానీ ముందే అన్నట్లు సరళంగా.. కొంచెం విడమరిచి చెప్పాల్సిన విషయాల్ని నర్మగర్భంగా చెప్పడం.. కథనం మరీ ఇంటలిజెంట్ గా సాగడం మెజారిటీ ప్రేక్షకుల్ని గందరగోళానికి గురి చేస్తుంది.

లై.. విడమరిచి చెబితే లవ్-ఇంటలిజెన్స్-ఎనిమిటీ. ఇందులో ‘ఇంటలిజెన్స్’ పార్ట్ మీదే దర్శకుడి దృష్టంతా నిలిచింది. నరేషన్ కొంచెం గందరగోళంగా ఉన్నప్పటికీ సినిమాకు బలం మాత్రం ఆ పార్టే. మిగతా రెండు విషయాలు అనుకున్నంతగా పండలేదు. లవ్ ట్రాక్ లో స్పెషాలిటీ ఏమీ లేదు. అబద్ధాల మీదే నడిచే ప్రేమకథలో హను చమత్కారం ఆకట్టుకుంటుంది కానీ.. ఈ ప్రేమకథలో ఇంటెన్సిటీ కానీ.. ఫీల్ కానీ తీసుకురాలేకపోయాడు హను. ఇక ‘ఎనిమిటీ’ పార్ట్ ను కూడా సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. ఈ విషయంలో చివర్లో హడావుడిగా లాగించేశాడు. ఆరంభంలో సరదాగా సాగిపోయి.. మధ్యమానికి వచ్చేసరికి ఆసక్తికర మలుపులతో ఉత్కంఠ రేకెత్తించే ‘లై’.. ఇంటర్వెల్ తర్వాత కొంచెం ట్రాక్ తప్పినప్పటికీ.. మళ్లీ ఒక చోట హై పాయింట్ కు చేరుతుంది. ఆ దశలో సస్పెన్స్ రివీల్ చేసే సన్నివేశాల ద్వారా మరింత ఉత్కంఠకు గురి చేయడానికి అవకాశమున్నా దర్శకుడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. హడావుడిగా కథను క్లైమాక్స్ తీసుకెళ్లిపోయి.. మామూలుగా ముగించేశాడు.

ఓవరాల్ గా స్టైలిష్.. ఇంటలిజెంట్ స్పై థ్రిల్లర్లను ఇష్టపడేవారికి ‘లై’ మెప్పిస్తుంది. ఐతే దీన్ని మిగతా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నదానిపై ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉంది. ‘1 నేనొక్కడినే’ రోజులతో పోలిస్తే.. గత కొన్నేళ్లలో ప్రేక్షకులు బాగానే ఎవాల్వ్ అయ్యారు. కొత్తదనంతో కూడిన కథల్ని బాగానే ఆదరిస్తున్నారు. పైగా ‘లై’ ఎలా ఉండొచ్చనే విషయంలో వాళ్లకు ముందే ఫీలర్స్ కూడా వదిలారు కాబట్టి ‘లై’ ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఎదురు చూడాల్సిందే.

నటీనటులు:

నితిన్ ‘లై’లో సరికొత్తగా కనిపిస్తాడు. అతడి లుక్.. మేనరిజమ్స్.. నటన.. అన్నీ కూడా చాలా భిన్నంగా అనిపిస్తాయి. పాత్రకు తగ్గట్లుగా సటిల్ పెర్ఫామెన్స్ తో నితిన్ ఆకట్టుకున్నాడు. పాత్రను అర్థం చేసుకుని నటించడంలో.. హావభావాలు ఇవ్వడంలో.. యాటిట్యూడ్ చూపించడంలో నితిన్ పరిణతి కనిపిస్తుంది. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో అతను బాగానే ఒదిగిపోయాడు. నితిన్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్సెస్ లో ఇదొకడనంలో సందేహం లేదు. హీరోయిన్ మేఘా ఆకాష్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఆమె క్యూట్ అనిపిస్తుంది కానీ.. మరీ అందగత్తె ఏమీ కాదు. నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికేమీ లేదు. సినిమాలో నటన పరంగా అగ్రతాంబూలం మాత్రం అర్జున్ కే ఇవ్వాలి. తన అనుభవాన్నంతా ఉపయోగించి.. పద్మనాభం పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు అర్జున్. ఆయన నటన వల్ల ఆ పాత్ర మరింత ప్రత్యేకంగా తయారైంది. ఈ సినిమా చూశాక అర్జున్ ను దృష్టిలో పెట్టుకుని దర్శకులు కొత్త పాత్రలు తీర్చిదిద్దుకునే అవకాశముంది. కథకు కీలకమైన పాత్రల్లో శ్రీరామ్.. నాజర్ కూడా బాగా నటించారు. మధునందన్ ను కామెడీ కోసం పెట్టుకున్నారు కానీ.. అతను ఆశించిన స్థాయిలో నవ్వించలేకపోయాడు. పృథ్వీ-బ్రహ్మాజీ ఓకే.

సాంకేతికవర్గం:

టెక్నికల్ గా ‘లై’ ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కింది. సాంకేతిక హంగులన్నీ బాగా కుదిరాయి. మణిశర్మ నేపథ్య సంగీతం.. యువరాజ్ ఛాయాగ్రహణం సినిమా స్థాయిని పెంచాయి. మణిశర్మ పాటలు కొంచెం కొత్తగా అనిపిస్తాయి కానీ.. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా అయితే లేవు. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం సన్నివేశాల్ని ఎలివేట్ చేయడంలో బాగా ఉపయోగపడింది. సినిమా టోన్ కు తగ్గట్లుగా చాలా స్టైలిష్ ఆర్.ఆర్ ఇచ్చాడు మణి. అలాగే యువరాజ్ విజువల్స్ కూడా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కెమెరా పనితనం వల్ల సినిమా చాలా రిచ్ గా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మార్కెట్ లెక్కలు చూసుకోకుండా బాగానే ఖర్చు పెట్టినట్లున్నారు నిర్మాతలు. ఇక దర్శకుడు హను రాఘవపూడి విషయానికొస్తే.. అతడిలో చాలా విషయం ఉందనే సంగతి మరోసారి తెలుస్తుంది. ప్రతిదీ కొత్తగా ఉండాలనే అతడి తపన సినిమాలో కనిపిస్తుంది. అతడి ఆలోచనలు బాగున్నాయి. కాకపోతే నరేషన్ సరళంగా ఉండేలా చూసుకోవాల్సింది. లవ్ ట్రాక్ ను మరింత బాగా తీర్చిదిద్దుకుని.. ఇంకొంచెం ఎంటర్టైనింగ్ గా కథను చెప్పగలిగి ఉంటే ‘లై’ స్థాయే వేరుగా ఉండేది. అయినప్పటికీ దర్శకుడిగా హను ప్రతిభను మాత్రం ‘లై’లో చూడొచ్చు.

చివరగా: లై.. ‘ఇంటెలిజెంట్’  థ్రిల్లర్!

రేటింగ్- 2.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre