కనుపాప

Sat Feb 04 2017 GMT+0530 (IST)

కనుపాప

‘కనుపాప’ రివ్యూ
నటీనటులు: మోహన్ లాల్-బేబీ మీనాక్షి-నెడుముడి వేణు-సుముద్రఖని-విమలా రామన్-అనుశ్రీ తదితరులు
సంగీతం: 4 మ్యూజిక్స్
నేపథ్య సంగీతం: రాన్ యొహాన్
ఛాయాగ్రహణం: ఏకాంబరన్
కథ: గోవింద్ విజయన్
మాటలు: ఎం.రాజశేఖర్ రెడ్డి
నిర్మాతలు: మోహన్ లాల్-దిలీప్ కుమార్
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ప్రియదర్శన్

గత ఏడాది తెలుగులో మనమంతా.. జనతా గ్యారేజ్ సినిమాల్లో నటించి మన ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. ఆ సినిమాలు తెచ్చిన గుర్తింపుతో మలయాళంలో మోహన్ లాల్ నటించిన సినిమాలు ఒక్కొక్కటిగా తెలుగులోకి వచ్చేస్తుంది. గత ఏడాది ‘మన్యం పులి’ అలాగే తెలుగులో విడుదలై సర్ప్రైజ్ హిట్టయింది. ఇప్పుడు మోహన్ లాల్ మిత్రుడు.. లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ రూపొందించిన ‘ఒప్పం’ను ‘కనుపాప’ పేరుతో అనువాదం చేసి విడుదల చేశారు. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: జయరాం (మోహన్ లాల్) ఒక అంధుడు. కానీ అతడికి గొప్ప పరిశీలనా శక్తి ఉంటుంది. తన ఎదురుగా నిలుచుని మాట్లాడే వ్యక్తి ఎత్తు బరువు చెప్పేయగలడు. ఇంకా ఎన్నో విషయాల్ని పసిగట్టగలడు. ఈ పరిశీలనా శక్తితోనే అతను ఒక అపార్ట్ మెంట్లో లిఫ్ట్ ఆపరేటర్ గా పని చేస్తుంటాడు. ఆ ఆపార్ట్ మెంట్లో ఉండే జడ్జి కృష్ణమూర్తి (నెడుముడి వేణు)కి జయరాంపై గురి. నందిని (బేబీ మీనాక్షి) అనే చిన్నారి బాధ్యతను జయరాంకు అప్పగించి దూరంగా బోర్డింగ్ స్కూల్లో పెట్టి చదివిస్తుంటాడు కృష్ణమూర్తి. ఆ చిన్నారి పెరిగి పెద్దవుతున్న క్రమంలో ఆమెకు పొంచి ఉన్న ఒక ముప్పు గురించి జయరాంకు వెల్లడిస్తాడు కృష్ణమూర్తి. ఇంతలో కృష్ణమూర్తి హత్యకు గురవుతాడు. అంతకంటే ముందే అతడి కుటుంబ సభ్యులు కూడా హత్య చేయబడతారు. ఇంతకీ ఈ హత్యలన్నీ చేసిందెవరు.. నందినికి పొంచి ఉన్న ముప్పేంటి.. ఆ చిన్నారికి కృష్ణమూర్తికి ఉన్న సంబంధమేంటి.. నందినిని జయరాం ఎలా కాపాడుకున్నాడు.. ఈ విషయాలన్నీ తెరమీదే చూసుకోవాలి.

కథనం-విశ్లేషణ: ఒక స్టార్ హీరో ఏదైనా వైకల్యం ఉన్న పాత్ర వేస్తున్నాడంటే సగటు ప్రేక్షకుడిలో కొంత ఆసక్తి తగ్గిపోతుంది. వైకల్యం ఉందంటే.. హీరోయిజం ఉండదన్న ఉద్దేశంతో డీలా పడిపోతారు అభిమానులు. ఈ మధ్య హృతిక్ రోషన్ సినిమా ‘కాబిల్’కు ఎంత మంచి రివ్యూలు వచ్చినా కలెక్షన్లు లేవంటే అందుకు ఆ సినిమాలో అతను గుడ్డివాడి పాత్ర పోషించడమే ఒక రకంగా కారణం అని చెప్పొచ్చు. ఈ కారణంతోనే స్టార్ హీరోలు అంధుడు.. వికలాంగుడు లాంటి పాత్రల జోలికి వెళ్లరు. ఐతే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అలా ఆలోచించలేదు. ప్రేక్షకుల అభిరుచిని నమ్మాడు. తన నటనను నమ్మాడు. కథను నమ్మాడు. ‘ఒప్పం’ (కనుపాప) సినిమా చేశాడు. మోహన్ లాల్ ను నమ్మి సినిమాకు వెళ్లిన వాళ్లు మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటికి వస్తారు.

మనమంతా.. జనతా గ్యారేజ్.. మన్యం పులి సినిమాలు చూసి మోహన్ లాల్ పై ఇష్టం పెంచుకున్న వాళ్లు ‘కనుపాప’ చూశాక అతడికి దాసోహం అయిపోతారు. మోహన్ లాల్ ఎందుకంత గొప్ప నటుడయ్యాడో చెప్పడానికి మరో గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది ‘కనుపాప’. గుడ్డివాడి పాత్ర అనగానే కళ్లు తేలేసేయడం.. తారాడుతూ వెళ్లడం.. ముఖంలో హావభావాలు అదోలా పెట్టడం.. ఇలాంటి స్టీరియో టైపు నటన చూసి చూసి విసిగిపోయిన వాళ్లకు మోహన్ లాల్ పోషించిన పాత్ర.. అతడి నటన చాలా భిన్నంగా కనిపిస్తాయి. ‘కనుపాప’లో కథాకథనాలు మరీ గొప్పగా ఏమీ ఉండవు. ఇంతకంటే మంచి థ్రిల్లర్లెన్నో చూశాం. ఉన్నంతలో ఆసక్తికరంగానే సాగుతుంది కానీ.. మరీ గొప్ప థ్రిల్లర్ అయితే కాదిది. అక్కడక్కడా ఉత్కంఠ రేకెత్తించినా.. చాలా వరకు సన్నివేశాలు సాదాసీదాగా అనిపిస్తాయి. కానీ సినిమా అంతటా ప్రేక్షకుడి ఆసక్తిని నిలిపి ఉంచేది మాత్రం మోహన్ లాలే.

ఇప్పటిదాకా అంధుడి పాత్రల్లో చాలామంది నటీనటుల్ని చూశాం. చాలా వరకు అంధుల పాత్రల్ని సెంటిమెంటు కోసమే ఉపయోగించుకుంటారు మన ఫిలిం మేకర్స్. ఆ పాత్రల్ని తీర్చిదిద్దే తీరు అలాగే ఉంటుంది. ఆ పాత్రల్ని ప్యాథటిగ్గా.. బలహీనులుగా చూపించడం వల్ల ఇలాంటి సినిమాలనగానే ప్రేక్షకులకు కూడా ఒక రకమైన ప్యానిక్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకే మెజారిటీ ఆడియన్స్ ఆ సినిమాల జోలికి వెళ్లరు. ఐతే ‘కనుపాప’ అలాంటి కోవకు చెందదు. ఇప్పటిదాకా ఎంతమంది అంధుడి పాత్ర పోషించినా.. వాటన్నింటికీ భిన్నంగా కనిపిస్తుంది ‘కనుపాప’లో మోహన్ లాల్ క్యారెక్టర్.

అంధులకు కళ్లు లేకపోవడం వల్ల మిగతా జ్నానేంద్రియాలు వాళ్లకు చాలా చురుగ్గా పని చేస్తాయి. వాళ్లకు గొప్ప పరిశీలనా శక్తి ఉంటుంది. ఆ శక్తితోనే వారు జీవనాన్ని సాగిస్తారు. ప్రియదర్శన్.. మోహన్ లాల్ ప్రధానంగా ఈ విషయం మీద దృష్టిపెట్టారు. ‘కనుపాప’లో ఒక సన్నివేశంలో సైకో విలన్.. అంధుడైన హీరో ఉన్న లిఫ్టులోనే ఉంటాడు. లిఫ్ట్ తెరుచుకోగానే అడుగులేస్తూ వెళ్తాడు. అతడి అడుగుల చప్పుడును బట్టి అతను ఎక్కడికి వెళ్లింది సరిగ్గా అంచనా వేసి.. ఆ గదికి వెళ్లి అతడి గుట్టు రట్టు చేసే ప్రయత్నం చేస్తాడు హీరో. మరో సన్నివేశంలో హీరో కాయిన్ బాక్సు ద్వారా ఒక ఫోన్ చేస్తాడు. అతణ్ని దూరం నుంచి అనుసరిస్తున్న విలన్.. తర్వాత అక్కడికి వచ్చి రీడయల్ ద్వారా అతనెక్కడికి ఫోన్ చేశాడో చూద్దామని ప్రయత్నిస్తే సున్నాలు నొక్కేసి వెళ్లి ఉంటాడు హీరో.  ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలున్నపుడు హీరో గుడ్డివాడైనా హీరోయిజానికి ఢోకా ఏముంటుంది?

ప్రథమార్ధంలో నత్తనడకన సాగే కథనం కొంచెం బోర్ కొట్టించినా.. చాలా వరకు మోహన్ లాల్ సినిమాను లాక్కొచ్చాడు. ఇంటర్వెల్ ముందు జడ్జి హత్య దగ్గర్నుంచి కథనంలో ఆసక్తి పెరుగుతుంది. ద్వితీయార్దంలో ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేలా సన్నివేశాలు సాగుతాయి. సముద్రఖని చేసిన సైకో పాత్రను ఇంకాస్త మెరుగ్గా తీర్చిదిద్దాల్సింది. కొన్ని చోట్ల నేటివిటీ ఫ్యాక్టర్ ఇబ్బంది పెడుతుంది. డైలాగులు కూడా కొంత ఇబ్బంది పెడతాయి. హీరోను ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ క్యారెక్టర్ చాలా చిరాకు పెడుతుంది.

అంధుడైన కథానాయకుడి కథను విలన్ తలుచుకుంటే సులువుగానే ముగించేయొచ్చు. కానీ ఇక్కడ కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. ఇక విలన్ పాత్ర సైకో లాగా కంటే ప్రొఫెషనల్ కిల్లర్ లాగా అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ మీద మరింత శ్రద్ధ పెట్టాల్సింది. మొత్తంగా ‘కనుపాప’ కథాకథనాల పరంగా యావరేజే అయినా.. మోహన్ లాల్ వల్ల ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. లాల్ అభినయం కోసమే ఈ సినిమా చూడొచ్చు. ఈ సినిమా చూశాక అంధుల సినిమాలకు సంబంధించిన ప్రేక్షకుల పర్సెప్షనే మారిపోతుందన్నా అతిశయోక్తి కాదు.

నటీనటులు: ‘కనుపాప’లో ఒక సన్నివేశంలో హీరో మీద అకారణంగా పోలీసులు నింద మోపుతారు. అతడికి ఊర్లో పేరు దెబ్బ తింటుంది. అతను తన పెళ్లికి వస్తే తన పెళ్లి చెడిపోతుందనే అర్థంలో మాట్లాడుతుంది అతడి చెల్లెలు. ఆ సందర్భంలో ‘‘నన్ను పెళ్లికి రావొద్దంటున్నావా’’ అంటూ మోహన్ లాల్ ఒక ఎక్స్ ప్రెషన్ ఇస్తాడు. అప్పుడతనేమీ ఏడవడు. కానీ చూస్తున్న ప్రేక్షకుడికి మాత్రం కళ్లు తడి అయిపోతాయి. ఈ ఒక్క సన్నివేశం చాలు లాల్ ఏ స్థాయి నటుడో చెప్పడానికి. ‘కనుపాప’ చూశాక ఎవరైనా లాల్ ప్రేమలో పడిపోతారు. లాల్ బదులు ఎవరున్నా సరే.. ఈ సినిమా ఇలా ఉండేది కాదేమో. బేబీ మీనాక్షి.. నెడుముడి వేణు కూడా బాగా చేశారు. సముద్రఖని నటన బాగుంది కానీ.. అతడి పాత్ర అంత బాగా తీర్చిదిద్దలేదు. మిగతా వాళ్లందరూ మామూలే.

సాంకేతిక వర్గం: నేపథ్య సంగీతం.. ఛాయాగ్రహణం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఇందులో పాటలేమీ ఆకట్టుకోవు. ఉన్న రెండు మూడు పాటల్ని కూడా తీసేస్తే బాగుండేది. నేపథ్య సంగీతం సినిమా మూడ్ కు తగ్గట్లుగా సాగి ప్రేక్షకుల్ని సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. ఛాయాగ్రహణం కూడా చక్కగా కుదిరింది. కెమెరా యాంగిల్స్.. విజువల్స్ గొప్పగా థ్రిల్లర్ సినిమాలకు పర్ఫెక్ట్ సూటయ్యేలా ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలోనే తేడా జరిగింది. నిడివి తగ్గించే క్రమంలో ఒరిజినల్లోని కొన్ని కీలక సన్నివేశాలు లేపేయడంతో సినిమాలో కొన్ని డీటైల్స్ మిస్సయ్యాయి. కంటిన్యుటీ దెబ్బ తింది. డబ్బింగ్ అంత బాగా లేదు. డైలాగులు కూడా సరిగా లేవు. నిర్మాణ విలువలు ఓకే. దర్శకుడు ప్రియ దర్శన్.. అంధుడి పాత్రను తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రియదర్శన్.. అతడి ఆప్త మిత్రుడైన మోహన్ లాల్ కు మధ్య సమన్వయం సినిమా అంతటా కనిపిస్తుంది. ఐతే థ్రిల్లర్ సినిమాలంటే ఆద్యంతం గ్రిప్పింగ్ గా ఉండాలి. లూప్ హోల్స్ ఉండకూడదు. ఈ విషయంలో ప్రియదర్శన్ కొంత నిరాశ పరిచాడు. ఓవరాల్ గా ‘కనుపాప’తో ఓకే అనిపించాడు.

చివరగా: కనుపాప.. మోహన్ లాల్ కోసం

రేటింగ్: 3/5

LATEST NEWS