‘ఇంటిలిజెంట్’

Fri Feb 09 2018 GMT+0530 (IST)

‘ఇంటిలిజెంట్’

చిత్రం : ‘ఇంటిలిజెంట్’

నటీనటులు: సాయిధరమ్ తేజ్ - లావణ్య త్రిపాఠి - రాహుల్ దేవ్ - పోసాని కృష్ణమురళి - బ్రహ్మానందం - సప్తగిరి - పృథ్వీ - జయప్రకాష్ రెడ్డి - వినీత్ కుమార్ - అశిష్ విద్యార్థి - షాయాజి షిండే తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: విశ్వేశ్వర్
కథ-మాటలు: ఆకుల శివ
నిర్మాత: సి.కళ్యాణ్
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వి.వి.వినాయక్

మూడు హ్యాట్రిక్ హిట్ల తర్వాత.. వరుసగా నాలుగు ఫ్లాపులు తిన్నాడు మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్. ఈ పరిస్థితుల్లో అతడి ఆశలన్నీ ‘ఇంటిలిజెంట్’ మీదే నిలిచాయి. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ‘ఖైదీ నంబర్ 150’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రూపొందించిన చిత్రమిది. మరి ఈ చిత్రం తేజుకు.. వినాయక్ కు ఎలాంటి ఫలితాన్నందించేలా ఉందో చూద్దాం పదండి.

కథ:

సాయిధరమ్ తేజ (సాయిధరమ్ తేజ్) ఒక సాఫ్ట్ వేర్ కంపెనలో పని చేస్తూ స్నేహితులతో కలిసి సరదాగా జీవితాన్ని గడిపేస్తున్న కుర్రాడు. అనాథగా ఉన్న అతడిని ఓ పెద్ద మనిషి చేరదీసి పెద్దవాడిని చేసి తన కంపెనీలో ఉద్యోగం కూడా ఇస్తాడు. ఐతే ఆ పెద్ద మనిషికి చెందిన కంపెనీ కోసం విక్కీ భాయ్ అనే మాఫియా డాన్ మనుషులు బెదిరిస్తారు. వినకపోయేసరికి చంపేసి ఆ ఆఫీసును రాయించుకుంటారు. దీంతో తేజ ఉగ్రరూపం దాలుస్తాడు. విక్కీ భాయ్ తమ్ముడిని చంపి.. విక్కీ మీద పోరాటం మొదలుపెడతాడు. ఆ పోరాటంలో అతనెలా విజయం సాధించాడన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

తన గాడ్ ఫాదర్ ను చంపేసిన వాళ్ల మీద పగ తీర్చుకోవడానికి సిద్ధపడుతాడు హీరో. మొత్తం విలన్ నెట్ వర్క్ మొత్తం ఇతడి చేతుల్లోకి వచ్చేస్తుంది. ఇతడిని కౌంటర్ చేయడానికి ఢిల్లీ నుంచి హ్యాకర్లను పిలిపిస్తాడు విలన్. వాళ్లొచ్చి హీరో గుట్టు పట్టేయడానికి రెడీ అయిపోతారు. వెంటనే హీరోకు విషయం తెలిసిపోతుంది. అతను తన సాఫ్ట్ వేర్ ఫ్రెండుని అలెర్ట్ చేస్తాడు. వేటాడుతున్న పులి కళ్లు.. సింహం జూలు.. గుంటనక్క ముఖం.. చింపాంజీ పొట్ట.. ఇలా ఏవేవో చెప్పి నెట్లోంచి ఆ ఫొటోలు తీయమంటాడు. వాటన్నింటినీ మిక్స్ చేసి ఒక మనిషి బొమ్మ తయారు చేయమంటాడు. ఆ ఫ్రెండు హీరో చెప్పినట్లే క్షణాల్లో బొమ్మ రెడీ చేస్తాడు. చూస్తే.. తెర మీద బ్రహ్మానందం కనిపిస్తాడు. హీరో ఆ ఫొటోను ఇలా పంపించగానే అలా హ్యాకర్లు డైవర్ట్ అయిపోతారు. విలన్ బ్యాచ్ అతనే తాము వెతుకుతున్న హీరో అనుకుని బ్రహ్మిని టార్గెట్ చేస్తారు. వావ్.. ఏం ఫ్లానేశావురా అంటూ హీరోకు అతడి ఫ్రెండ్స్ హైఫైవ్ ఇస్తారు.

‘ఇంటిలిజెంట్’ సినిమాలో చాలా ‘ఇంటిలిజెంట్’గా సాగే ఒక సన్నివేశమిది. ప్రేక్షకులకు కళ్లు బైర్లు కమ్మేలా చేసే ఇలాంటి ‘ఇంటిలిజెంట్’ సీన్లకు సినిమాలో లెక్కే లేదు. ఎంత మాస్ జనాల కోసం సినిమా తీసినా.. మరీ ప్రేక్షకుల్ని ఇంత తక్కువగా అంచనా వేయడమా? మొదట్నుంచి మాస్ మసాలా సినిమాలే తీస్తున్నప్పటికీ వినాయక్ ‘మాస్’ పేరుతో మరీ ఇంత పేలవమైన సినిమా తీస్తాడని ఊహించి ఉండం. తన ఆత్మీయుడిని చంపిన వాళ్లపై పగ తీర్చుకునే క్రమంలో జనాలకూ దేవుడిలా మారే హీరో కథలు కొన్ని దశాబ్దాల నుంచి చూస్తున్నాం. పోనీ కథనంలో ఏమైనా విశేషం ఉందా.. కామెడీ ఏమైనా వర్కవుటైందా.. ఏమైనా ఆసక్తికర సన్నివేశాలు ఉన్నాయా అంటే.. భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కానరావు.

ఆరంభం నుంచి ఓవైపు సాయిధరమ్ తేజ్ ఎందుకీ సినిమా చేశాడని.. అసలు వినాయక్ ఎలా ఈ కథను ఓకే చేశాడని.. ఇంత పేలవమైన సీన్లు ఎలా తీశాడని సందేహాలు కొడుతూనే ఉంటాయి. ఎంతసేపూ విలన్.. అతడి గ్యాంగ్ సభ్యులు.. హీరోనుద్దేశించి అతను ఇంటిలిజెంట్ అని.. చాలా తెలివిగా అన్నీ చేసేస్తున్నాడని డైలాగులు చెబుతూ టైటిల్ ను జస్టిఫై చేయడానికి ప్రయత్నిస్తుంటారే తప్ప.. ఎక్కడా హీరో గారి చర్యలు తెలివిగా అనిపించవు. ఒక సీన్లో తన గాడ్ ఫాదర్ ను చంపిన వాళ్లపై పగ తీర్చుకోవడానికి రెడీ అయినవాడు.. తర్వాతి సీన్లోకి వచ్చేసరికి మొత్తం జనాలందరినీ రక్షించే దేవుడిలా మారడమేంటో.. ఎవరికి పడితే వాళ్లకు లక్షలు లక్షలు డబ్బులు వేసేయడమేంటో.. రాజకీయ నాయకుల అకౌంట్లను ఒక్క దెబ్బతో ఖాళీ చేసేయడమేంటో అర్థం కాదు. ఒక సీన్లో విమానం ఎయిర్ పోర్టులో ల్యాండ్ కాబోతుంటే దాన్ని డ్రోన్ సాయంతో అటాక్ చేయిస్తాడు హీరో. ఆ డ్రోన్ ను ఎక్కడో ఉన్న పోలీస్ కాల్చేయబోతాడు. వెంటనే పైలట్ భయపడి విమానాన్ని శంషాబాద్ నుంచి డైవర్ట్ చేసి బేగంపేటకు మళ్లిస్తాడు. ఇలాంటి సిల్లీ సీన్ టాలీవుడ్ వినాయక్ లాంటి పెద్ద దర్శకుడి సినిమాలో ఉందటే షాకవ్వాల్సిందే.

ఇక సినిమాలో పాటల గురించి ఏం చెప్పాలి..? సినిమాలో హీరోయిన్ ఎప్పుడైనా స్క్రీన్ మీద కనిపించిందంటే పాట రాబోతోందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక సీన్లో హీరో తన తల్లితో సీరియస్ గా ఒక డైలాగ్ చెప్పి నిష్క్రమించగానే.. తర్వాత కెమెరా హీరోయిన్ మీదికి షిఫ్ట్ అవుతుంది. ఆమె ఒక నవ్వు నవ్వుతుంది. వెంటనే మ్యూజిక్ స్టార్ట్.  ఇలా సాగుతుంది పాటల వ్యవహారం. పాటల్లో డ్యాన్సులు  ఇరగదీసినా.. తేజు చిరంజీవిని ఇమిటేట్ చేసినా ఏం ప్రయోజనం? ప్రతి సన్నివేశం పరీక్షకు గురి చేస్తుండగా.. ఇలా అసందర్భోచితంగా వచ్చి పడే పాటల్ని మాత్రం ఏం ఎంజాయ్ చేస్తాం? ‘ఇంటిలిజెంట్’ సినిమా మొదలైన దగ్గర్నుంచి మనం కాలంలో వెనక్కే ప్రయాణిస్తుంటాం. నిజానికి ‘ఇంటిలిజెంట్’ పదేళ్ల కిందటి సినిమాలా ఉందని అంటే.. అప్పటి సినిమాల్ని తక్కువ చేసినట్లే అవుతుంది. ఇలాంటి సినిమా ఎన్నేళ్ల ముందు వచ్చినా కూడా ఔట్ డేటెడ్ గా.. అర్థరహితంగానే అనిపిస్తుంది తప్పితే వేరే ఫీలింగ్ ఇవ్వదేమో. ఈ సినిమాను ఇలా మాస్ కోసమే తీశాం అని అంటే.. ఆ వర్గం ప్రేక్షకుల్ని కించపరిచినట్లే.

నటీనటులు:

సాయిధరమ్ తేజ్ నటన పరంగా కొత్తగా చేసిందేమీ లేదు. క్యారెక్టర్ కు తగ్గట్లే రొటీన్ గా ఉంది అతడి నటన. చిరంజీవి.. పవన్ కళ్యాణ్ లను చాలాసార్లు ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశాడు. తేజు లుక్ బాగుంది. డ్యాన్సులు.. ఫైట్లు బాగా చేశాడు. లావణ్య త్రిపాఠికి ఏమాత్రం చెప్పుకోదగ్గ  రోల్ లేదు. ఇలాంటి కమర్షియల్ సినిమాల్లో టెంప్లేట్ హీరోయిన్ క్యారెక్టర్ లాగే ఆమె పాత్ర సాగుతుంది. ఐతే గత సినిమాలతో పోలిస్తే గ్లామరస్ గా కనిపించిందామ. విలన్లు రాహుల్ దేవ్.. దేవ్ గిల్.. నాజర్.. సహా సినిమాలో అన్ని పాత్రలూ చాలా రొటీన్ గా అనిపిస్తాయి. నటన పరంగా అందరరూ మామూలుగానే అనిపిస్తారు.

సాంకేతికవర్గం:

తమన్ సంగీతం చాలా సాదాసీదాగా అనిపిస్తుంది. సినిమాలో కొంచెం వినసొంపుగా అనిపించే చమక్ చమక్ చామ్ పాటలో అతడి ప్రమేయం ఏమీ లేదు. మిగతా పాటలన్నీ తమన్ పాత స్టయిల్లో వాయించేశాడు. నేపథ్య సంగీతం చాలా రొటీన్ అనిపిస్తుంది. విశ్వేశ్వర్ ఛాయాగ్రహణంలో ఏ ప్రత్యేకతా లేదు. నిర్మాణ విలువలు చాలా సాధారణంగా అనిపిస్తాయి. ఆకుల శివ కథ గురించి.. మాటల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇంతకుముందు వినాయక్ ఎంత రొటీన్ సినిమాలు తీసినా.. కొన్ని అంశాల్లో అయినా ఆకట్టుకునేవాడు. కామెడీని బాగా డీల్ చేయడమో.. యాక్షన్ సన్నివేశాల్లో పనితనం చూపించడమో చేసేవాడు. కానీ ‘ఇంటిలిజెంట్’లో మాత్రం దర్శకత్వ పరంగా ఎక్కడా చిన్న మెరుపు కూడా లేడు. వినాయక్ కెరీర్లో డిజాస్టర్లున్నాయి కానీ.. ఇంత పేలవమైన సినిమా మాత్రం లేదు. ఇక ముందు కూడా వినాయక్ ఇలాంటి సినిమా తీయలేడేమో.

చివరగా: ఇంటిలిజెంట్.. ఇంత ఔట్ డేటెడా?

రేటింగ్- 1.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS