ఇంట్లో దెయ్యం నాకేం భయం

Fri Dec 30 2016 GMT+0530 (IST)

ఇంట్లో దెయ్యం నాకేం భయం

‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ రివ్యూ

నటీనటులుః అల్లరి నరేష్ - రాజేంద్ర ప్రసాద్ - కృతిక జయకుమార్ - మౌర్యాని - కాలకేయ ప్రభాకర్ - బ్రహ్మానందం - జయప్రకాష్ రెడ్డి - షకలక శంకర్ - చమ్మక్ చంద్ర - చలపతిరావు తదితరులు
సంగీతం: సాయికార్తీక్
ఛాయాగ్రహణం:దాశరథి శివేంద్ర
మాటలుః డైమండ్ రత్నబాబు
నిర్మాతః బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
కథ - స్క్రీన్ ప్లే-దర్శకత్వంః నాగేశ్వరరెడ్డి

అల్లరి నరేష్ హిట్టు ముఖం చూసి నాలుగేళ్లయింది. తనకు అలవాటైన రీతిలో కామెడీ సినిమాలు ట్రై చేసి విఫలమైన నరేష్.. ఈసారి రూటు మార్చి హార్రర్ కామెడీని ఎంచుకున్నాడు. నరేష్ తో ఇంతకుముందు సీమశాస్త్రి.. సీమటపాకాయ్ లాంటి సినిమాలు తీసిన నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించడం.. అగ్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించడంతో ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ చిత్రంపై బాగానే అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా అయినా అల్లరోడిని సక్సెస్ ట్రాక్ ఎక్కించేలా ఉందేమో చూద్దాం పదండి.

కథః

నరేష్ (అల్లరి నరేష్) పెళ్లిళ్లకు బ్యాండ్ మేళం అందించే బృందానికి యజమాని. ఐతే ఓ పసిపాప ప్రాణాలు నిలబెట్టే క్రమంలో అతను అప్పుల పాలవుతాడు. అలాంటి సమయంలోనే తన ఇంట్లో తిరుగుతున్న దయ్యాన్ని తరిమికొట్టే బాధ్యతను అనుకోకుండా నరేష్ కు అప్పగిస్తాడు గోపాల్  (రాజేంద్ర ప్రసాద్) అనే పెద్ద మనిషి. తనకు దయ్యాల్ని వెళ్లగొట్టే విద్య ఏమీ తెలియకపోయినా డబ్బు కోసం ఈ పనికి ఒప్పుకుంటాడు నరేష్. కానీ ఆ ఇంట్లో అడుగుపెట్టాక అతడికి అసలు విషయం బోధపడుతుంది. దయ్యమే అతణ్ని అక్కడికి రప్పించుకున్న సంగతి తెలుస్తుంది. ఇంతకీ దయ్యంతో నరేష్ కు సంబంధమేంటి.. దాన్నుంచి అతను ఎలా బయటపడ్డాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణః

ఒక కొత్త ఫార్ములాతో ఒక సినిమా హిట్టయితే.. ఇక వరుసగా అదే బాటలో కథలు అల్లడం.. సినిమాలు తెరకెక్కించడం మన రచయితలు.. దర్శకులకు అలవాటు. ఈ ఫార్ములా మొహం మొత్తి ప్రేక్షకులు విసిగి వేసారి పోయే వరకు దాన్ని వదిలిపెట్టరు. హార్రర్ కామెడీల పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. ప్రేమకథా చిత్రమ్తో మొదలైన ఈ ఫార్ములాకు సక్సెస్ రేట్ బాగానే ఉంది కానీ.. ఇది చాలా త్వరగా మొనాటనీ తెప్పించేసింది. ఈ జానర్లో వచ్చిన చాలా సినిమాల్ని డిట్టో ఫాలో అయిపోయింది ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’.

ఇంట్లో ఒక ఆడ దెయ్యం తిష్ట వేయడం.. ఆ ఇంట్లో హీరో సహా ఒక్కొక్కరుగా కామెడీ బ్యాచ్ చేరిపోవడం.. వాళ్లందరినీ దెయ్యం చితకబాదడం.. తర్వాత ఆ దయ్యం ఫ్లాష్ బ్యాక్ చూపించడం.. చివరికి దయ్యం పగ చల్లారడంతో కథ సుఖాంతమవడం.. ఇలా ప్రతి హార్రర్ కామెడీ కూడా ఇదే బాటలో నడుస్తుండటంతోనే వస్తోంది సమస్య. ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ కూడా ఈ ఫార్ములాను ఎక్కడా తప్పలేదు. కామెడీ కింగ్స్ అల్లరి నరేష్.. రాజేంద్ర ప్రసాద్ ఉన్నారన్న విషయం పక్కనబెడితే ఈ సినిమాలో ఏమాత్రం కొత్తదనం లేదు. అదే దయ్యం విన్యాసాలు.. అవి దెబ్బలు.. అదే కామెడీ.. అదే ఫ్లాష్ బ్యాక్.. అదే ముగింపు.. ఇలా ఇప్పటికే చూసిన బోలెడన్ని హార్రర్ కామెడీల్ని రివైండ్ చేసి చూస్తున్నట్లు అనిపిస్తుంది తప్ప ఇంట్లో దెయ్యం నాకేం భయం ఏమాత్రం ప్రత్యేకంగా అనిపించదు.

ఈ మధ్య వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’లోనూ హార్రర్ కామెడీ టచ్ ఉంటుంది. అందులోనూ దెయ్యం కమెడియన్లను వరుసబెట్టి కోటింగ్ ఇస్తుంది. కానీ అందులో మాదిరి ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’లో వాయింపుడు అంతగా నవ్వు తెప్పించదు. చిన్నవాడాలో ఈ హార్రర్ కామెడీతో పాటు చెప్పుకోదగ్గ విశేషాలు చాలా ఉన్నాయి. వాటి మధ్యన వచ్చే హార్రర్ కామెడీ కొసమెరుపులా అనిపిస్తుంది. కానీ అల్లరోడి సినిమాలో చెప్పుకోవడానికి ఇంకే విశేషాలూ లేవు. ఈ బాదుడు సహా సన్నివేశాలన్నీ చాలాసార్లు చూసినవే కావడంతో ఇందులో ఏముంది ప్రత్యేకత.. ఇలాంటివి చాలా చూశాం కదా అన్న ఫీలింగ్ ఆద్యంతం ప్రేక్షకుడిని వెంటాడుతూ ఉంటుంది.

కామెడీని డీల్ చేయడంలో నాగేశ్వరరెడ్డి పట్టు వల్ల ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ అక్కడక్కడా నవ్వులు పంచుతుంది. కొన్ని కామెడీ పంచ్ లు పేలాయి. ప్రథమార్ధంలో దెయ్యం ఒక్కో పాత్రకు పరిచయమై తన దెబ్బల రుచి చూపించే సన్నివేశాలు రొటీనే అయినా కొద్దిగా నవ్విస్తాయి. కానీ ద్వితీయార్ధంలో కథ మరీ మామూలుగా సాగిపోవడం.. ఈ మాత్రం కామెడీ కూడా పండకపోవడం.. ఫ్లాష్ బ్యాక్ తేలిపోవడం.. క్లైమాక్స్ కూడా ఏమంత ఎగ్జైటింగ్ గా లేకపోవడంతో ఇంట్లో దెయ్యం.. సగటు హార్రర్ కామెడీ చిత్రంలా ముగుస్తుంది. అల్లరి నరేష్ తాను రెగ్యులర్ గా చేస్తున్న సినిమాల బాట నుంచి పక్కకు వచ్చాడు కానీ.. చాలామంది నడుస్తున్న బాటలోనే నడవడంతో వచ్చింది సమస్య. నరేష్.. రాజేంద్ర ప్రసాద్ సహా మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటులు చాలామంది ఉన్న నేపథ్యంలో కథ కొంచెం వైవిధ్యంగా ఉండి.. కామెడీ కోసం కొంచెం భిన్నమైన సన్నివేశాలు అల్లుకుని ఉంటే ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ ఈజీగా గట్టెక్కేసి ఉండేది. కానీ అలాంటి ప్రయత్నమేమీ జరక్కపోవడం నిరాశ కలిగిస్తుంది.

నటీనటులుః

పేరడీలు.. స్పూఫుల విషయంలో విమర్శలు పెరిగిపోయిన నేపథ్యంలో అల్లరి నరేష్ వాటి జోలికి వెళ్లకుండా మామూలుగా నటించాడు. హార్రర్ కామెడీలో నరేష్ ను చూడటం కొత్తే కానీ.. ఈ పాత్ర మాత్రం కొత్తది కాదు. నరేష్ తన వంతుగా కామెడీ పండించే ప్రయత్నం చేశాడు కానీ.. కథలో పాత్రలో కొత్తదనం లేకపోవడంతో అతడి ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. రాజేంద్ర ప్రసాద్ కూడా తనదైన శైలిలో కొన్ని చోట్ల నవ్వించాడు కానీ.. ఆయన స్థాయికి తగ్గట్లు పెర్ఫామ్ చేసే స్కోప్ లేకపోయింది. హీరోయిన్ కృతిక జయకుమార్ పర్వాలేదు. బాగానే చేసింది. దయ్యం పాత్రలో కనిపించిన మౌర్యానిలో మాత్రం  ఏ ప్రత్యేకతా లేదు. ఆమెతో ప్రేక్షకులు కనెక్టవ్వలేరు. షకలక శంకర్.. చమ్మక్ చంద్ర ఓ మోస్తరుగా నవ్వించారు. కాలకేయ ప్రభాకర్ భూత వైద్యుడి పాత్రకు బాగానే సూటయ్యాడు. మిగతా వాళ్లంతా పర్వాలేదు.

సాంకేతిక వర్గంః

సాయికార్తీక్ సంగీతం సినిమాకు ఏమాత్రం ప్లస్ కాలేకపోయింది. పాటలు సినిమాలో సింక్ కాలేదు. సినిమాతో సంబంధం లేకుండా వచ్చి పోతుంటాయి. గుర్తుంచుకోదగ్గ పాట ఒక్కటీ లేదు. నేపథ్య సంగీతం పర్వాలేదు. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం ఓకే. డైమండ్ రత్నబాబు డైలాగులు అక్కడక్కడా పేలాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి మెరుగ్గానే ఉన్నాయి. తొలిసారి హార్రర్ కామెడీ ట్రై చేసిన దర్శకుడు నాగేశ్వరరెడ్డి ఏమాత్రం కొత్తదనం కోసం ప్రయత్నించకుండా.. ఇప్పటిదాకా తెలుగు ప్రేక్షకులు ఈ జానర్లో చూసిన సినిమాల్నే ఫాలో అయిపోయాడు. ఏమాత్రం కొత్తదనం కోసం ప్రయత్నించలేదు. కొన్ని కామెడీ సీన్లను బాగానే డీల్ చేశాడు కానీ.. అంతకుమించి వైవిధ్యం ఏమీ చూపించకపోవడంతో అతడి ముద్రేమీ కనిపించలేదు.

చివరగాః ఇంట్లో దెయ్యం నాకేం భయం.. అదే దెయ్యం.. అదే కామెడీ

రేటింగ్ః 2.25/5


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre