ఇదం జగత్

Fri Dec 28 2018 GMT+0530 (IST)

ఇదం జగత్

చిత్రం : 'ఇదం జగత్'

నటీనటులు: సుమంత్ - అంజు కురియన్ - సత్య - ఆదిత్య మీనన్ - శివాజీ రాజా - రామ్ తదితరులు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: బాల్ రెడ్డి
నిర్మాత: గంగపట్నం శ్రీధర్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: అనిల్ శ్రీకాంతం

అక్కినేని లాంటి పెద్ద ఫ్యామిలీ బ్యాకప్ తో వచ్చినా హీరోగా నిలదొక్కుకోవడానికి ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నాడు సుమంత్. ‘మళ్ళీ రావా’తో పుంజుకున్నాడనిపించినా.. ‘సుబ్రహ్మణ్యపురం’తో మళ్లీ వెనుకబడ్డాడు. ఇప్పుడతను ‘ఇదం జగత్’ అనే థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కొత్త దర్శకుడు అనిల్ శ్రీకాంతం రూపొందించిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

నిషిత్ (సుమంత్) చదువు పూర్తి చేసి.. సరైన ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న కుర్రాడు. న్యాయంగా పని చేద్దామంటే సరైన ఉద్యోగం దొరకట్లేదని.. డబ్బు సంపాదించడం కోసం అతను ఒక విచిత్రమైన పనిని ఎంచుకుంటాడు. ఏవైనా ప్రమాదాలు చోటు చేసుకున్న చోటికి వెళ్లి వాటిని వీడియోలు తీసి.. ఛానెళ్లకు అమ్మడం ద్వారా సొమ్ము చేసుకోవడం మొదలుపెడతాడు. మొదట్లో ఈ వ్యవహారం బాగానే సాగినా.. తర్వాత ఈ పని వల్లే అతను చిక్కుల్లో పడతాడు. ఆ చిక్కులేంటి.. వాటిని అతను ఎలా ఛేదించాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

హాలీవుడ్లో వచ్చే సినిమాల్లో ఏదైనా ఎగ్జైటింగ్ పాయింట్ కనిపిస్తే.. దాన్ని కాపీ చేసేయడం.. దాని చుట్టూ మన నేటివిటీతో కథ అల్లేసి సినిమా తీసేయడం.. మన దర్శకులు చాలామంది చేసే పనే ఇది. ఐతే ఇంతకుముందు అయితే సోషల్ మీడియా ఉండేది కాదు కాబట్టి ఈ ‘రహస్యాలు’ బయటికి వచ్చేవి కావు. కానీ ఇప్పుడు కథ మారింది. ఒక షాట్ చూసి కూడా జనాలు కాపీ గుట్టు కనిపెట్టేస్తున్నారు. ‘ఇదం జగత్’ టీజర్ రిలీజైనపుడే ఇది హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ ‘నైట్ క్రాలర్’ స్ఫూర్తితో తెరకెక్కిన సినిమా అని సంగతి కనిపెట్టేశారు. ఐతే కాన్సెప్ట్ కాపీ కొడితే కొట్టారు.. దాన్ని ఉన్నదున్నట్లు తీసినా హాలీవుడ్ సినిమాను తెలుగులో చూశామని ఫీలవ్వడానికైనా అవకాశం ఉండేదేమో. కానీ ‘నైట్ క్రాలర్’ ఐడియా తీసుకుని దాన్ని నాసిరకంగా లోకల్ స్టయిల్లో తీస్తే ‘ఇదం జగత్’ అవడమే విషాదకరమైన విషయం.

‘ఇదం జగత్’లో అత్యంత కీలకమైన ఒక సన్నివేశం గురించి మాట్లాడుకుందాం. ఇందులో హీరో ఏవైనా ప్రమాదాలు జరిగితే వెంటనే అక్కడికి చేరిపోయి వీడియో తీసి దాన్ని టీవీ ఛానెళ్లకు అమ్ముకునే వ్యక్తి. ఈ తరహాలోనే ఒక ప్రమాదాన్ని కవర్ చేయడానికి వెళ్తాడు. కానీ అక్కడ మర్డర్ జరుగుతుంది. కానీ ఆ సంగతి ఇతడికి తెలియదు. కానీ షూట్ చేస్తుంటాడు. అవతల విలన్ ముందే నడుచుకుంటూ వెళ్తుంటాడు. వీడియో తీస్తూనే ఉంటాడు. విలన్ మాత్రం ఏమీ పట్టనంటూ తన పని తాను చేేసుకుపోతుంటాడు. ఇంకో సీన్లో అయితే విలన్ గ్యాంగ్ ఏకంగా మాజీ మంత్రినే హత్య చేస్తుంది. దాన్ని కూడా హీరో తాపీగా చిత్రీకరిస్తుంటాడు. మాజీ మంత్రినే చంపేసే రేంజ్ విలన్లు హీరోను అక్కడ చూసినా కూడా ఏమీ చేయలేక వదిలేస్తారు. ఏదో అక్కడ చిన్న గొడవ జరిగింది అంతే అన్నట్లుగా చోద్యం చూస్తుంటారు. ఇలాంటి విచిత్రాలెన్నో సినిమాలో ఉన్నాయి. ఒక సీరియస్ సబ్జెక్టును ఇంత తేలిగ్గా డీల్ చేస్తే ప్రేక్షకుడికి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది.. అతను ఎలా కథలో ఇన్వాల్వ్ కాగలుగుతాడు?

‘ఇదం జగత్’ ఒక సీరియస్ పాయింట్ తో తెరకెక్కిన సినిమా. కానీ ప్రేక్షకుడిని సీరియస్ గా ఇన్వాల్వ్ చేసేలా ఏ అంశాలూ ఇందులో లేవు. అసలే వనరులు లేకపోగా.. కొత్త దర్శకుడు అనిల్ శ్రీకాంతం అనుభవ లేమి కూడా తోడై.. ఒక బి-గ్రేడ్ సినిమా చూస్తున్న భావన కలిగిస్తుంది ‘ఇదం జగత్’. దర్శకుడు లీడ్ పాయింట్ నే సరిగా డీల్ చేయకపోగా.. ఇక అతను తీర్చిదిద్దిన ప్రేమకథ.. ఇతర అంశాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సుమంత్.. ఆదిత్య మీనన్ లాంటి నటులున్నారని తప్పితే ఫీచర్ ఫిలిం లక్షణాలే కనిపించవు ఇందులో.

5కే రన్ అని చెప్పి హీరో హీరోయిన్లను తప్ప రన్నర్లుగా ఓ పది మంది జూనియర్ ఆర్టిస్టుల్ని కూడా పెట్టకపోవడం.. వేరే సన్నివేశంలో హీరో బైకులో వచ్చే షాట్ నే ఇంకో సన్నివేశానికి వాడుకోవడం.. తిప్పి తిప్పి అవే లొకేషన్లను చూపించడం.. ఇలా నిర్మాణ విలువల విషయంలో సుమంత్ గత సినిమా ‘సుబ్రహ్మణ్యపురం’కు ఏమాత్రం తీసిపోని నాణ్యతా ‘ప్రమాణాలు’ చూపించింది ‘ఇదం జగత్’ టీం కూడా. ఒకప్పుడు ఫలితం మాటెలా ఉన్నా ఒక క్వాలిటీ కనిపించేది సుమంత్ సినిమాల్లో. ఐతే ఇప్పడు ఎంత మార్కెట్ దెబ్బ తిన్నా కూడా ఇలాంటి లో స్టాండర్డ్స్ తో చిత్రీకరణ జరుపుతుంటే ఎలా చూస్తూ ఊరుకున్నాడో మరి?

ఒక మంచి పాయింట్ ను ఎంత పేలవంగా ఎగ్జిక్యూట్ చేయొచ్చో చెప్పడానికి ‘ఇదం జగత్’ రుజువు. ఏదైనా ప్లస్ పాయింట్ ఉందా అని వెతికినా కనిపించని ఈ చిత్రం సుమంత్ కెరీర్ కు ఏ రకంగానూ ఉపయోగపడే అవకాశం లేనట్లే. ఒక మంచి పాయింట్ ను ఎంత పేలవంగా ఎగ్జిక్యూట్ చేయొచ్చో చెప్పడానికి ‘ఇదం జగత్’ రుజువు. ఏదైనా ప్లస్ పాయింట్ ఉందా అని వెతికినా కనిపించని ఈ చిత్రం సుమంత్ కెరీర్ కు ఏ రకంగానూ ఉపయోగపడే అవకాశం లేనట్లే.

నటీనటులు:

సినిమా చేస్తుండగా మధ్యలోనే కాన్ఫిడెన్స్ కోల్పోయాడో ఏమో సుమంత్ ఏదో అన్యమనస్కంగా నటించినట్లు కనిపించాడు. ప్రేమ కథల్లో చక్కగా హావభావాలు పలికిస్తూ పరిణతితో నటించే సుమంత్.. ఇందులో మాత్రం చాలా మామూలుగా కానిచ్చేశాడు. అతడి ప్రత్యేకత ఏమీ కనిపించదు. హీరోయిన్ అంజు కురియన్ గురించి చెప్పడానికేమీ లేదు. ఆమె అంత అందంగా ఏమీ లేదు. నటన మరీ పేలవం. హీరో స్నేహితుడి పాత్రలో సత్య బాగానే చేశాడు. విలన్ పాత్రలో ఆదిత్య మీనన్ ఏ ప్రత్యేకతా చాటలేకపోయాడు. అతడి తమ్ముడి పాత్రలో నటించిన నటుడు పూర్తిగా ఆ పాత్రకు మిస్ ఫిట్ అయ్యాడు. ‘సాక్షి’ రామ్ టీవీ ఛానెల్ ఎడిటర్ పాత్రలో ఓకే అనిపించాడు షఫి పాత్ర వ్యర్థం.

సాంకేతికవర్గం:

శ్రీ చరణ్ పాకాల నేపథ్య సంగీతం పర్వాలేదు. థ్రిల్లర్ చిత్రాలకు పని చేసిన అనుభవాన్ని చూపించాడు. పాటలు ఒకట్రెండే ఉన్నా అవి కూడా అనవసరం అనిపిస్తుంది. బాల్ రెడ్డి ఛాయాగ్రహణంలో ఏ ప్రత్యేకతా లేదు. జానర్ కు తగ్గ కలర్ థీమ్ ఎంచుకున్నప్పటికీనా.. విజువల్స్ పరంగా ఏ ప్రత్యేకతా లేదు. నిర్మాణ విలువలు పేలవంగా ఉన్నాయి.దర్శకుడు అనిల్ శ్రీకాంతం ఏ రకంగానూ మెప్పించలేకపోయాడు. ‘నైట్ క్రాలర్’ స్ఫూర్తితో రాసుకున్న బేసిక్ ఐడియా బాగున్నా.. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు.

చివరగా: ఇదం జగత్.. అథో:గతే

రేటింగ్-1.25/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS