చిత్రాంగద

Fri Mar 10 2017 GMT+0530 (IST)

చిత్రాంగద

చిత్రం: ‘చిత్రాంగద’

నటీనటులు: అంజలి - జయప్రకాష్ - దీపక్ - సింధు తులాని - స్వాతి దీక్షిత్ - స్వాతి గులాటి - సప్తగిరి - రాజా రవీంద్ర - రక్ష - సుడిగాలి సుధీర్ తదితరులు
సంగీతం: సెల్వ - స్వామి
ఛాయాగ్రహణం: బాల్ రెడ్డి
నిర్మాతలు: రెహమాన్ - శ్రీధర్ గంగపట్నం
రచన - దర్శకత్వం: అశోక్.జి

‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్.. అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కించిన లేడీ ఓరియెంటెడ్ ఫిలిం ‘చిత్రాంగద’. ఎప్పుడో మొదలై.. ఎప్పుడో పూర్తయిన ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రాంగద కథాకమామిషేంటో చూద్దాం పదండి.

కథ:

చిత్రాంగద (అంజలి) ఒక కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేస్తుంటుంది. ఆమెకు ఆత్మలు.. దయ్యాలు అనే కాన్సెప్ట్ అంటేనే నచ్చదు. అలాంటి చిత్రాంగద దయ్యం పూనినట్లు ప్రవర్తిస్తుంది. అప్పుడప్పుడూ మగరాయుడిలా మారి తనతో పాటు హాస్టల్లో ఉండే అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతుంది. మరోవైపు ఆమెకు తరచుగా ఒక కల వస్తుంటుంది. అందులో ఎవరో మహిళ ఒకతణ్ని చంపేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ కల గురించి చిత్రాంగద చెబితే ఆమెకు పిచ్చి పట్టిందంటారు జనాలు. దీంతో ఈ కల సంగతేంటో చూడాలనుకుంటుంది చిత్రాంగద. ఇంతకీ చిత్రాంగదకు ఏమైంది.. ఆమె ఎందుకలా ప్రవర్తిస్తుంది.. ఆమె దయ్యం పట్టిందా.. తన కల సంగతేంటి.. ఈ విషయాలన్నీ తెరమీదే చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

‘చిత్రాంగద’ సినిమా విడుదల కాకుండా ఇన్నాళ్లు ఎందుకు ఆగిపోయిందో సినిమా మొదలైన ఓ పావుగంటకే అర్థమైపోతుంది. అసలు దర్శకుడు అశోక్.. అంజలికి కానీ.. నిర్మాతలకు కానీ ఏం చెప్పి ఈ సినిమా ఒప్పించాడో కానీ.. సినిమా చేస్తున్నపుడు మధ్యలో కూడా ఎవరికీ మనం ఏం చేస్తున్నామా అని సందేహాలు కలగలేదా అనిపిస్తుంది ‘చిత్రాంగద’ చూస్తున్నంతసేపూ. ‘చిత్రాంగద’లో బేసిక్ ఐడియా పర్వాలేదనే అనిపిస్తుంది. కానీ ఆ ఐడియాను నమ్ముకుని తలా తోకా లేకుండా.. తోచింది రాసేసి.. ఎలా పడితే అలా సినిమా తీసేసినట్లే ఉంది ఔట్ పుట్ చూస్తే.

ఒక్కటి మాత్రం వాస్తవం.. అశోక్ మనసు పెట్టి ఈ సినిమా తీయలేదు. సినిమా చేస్తున్నపుడు మధ్యలోనే అతడికి కాన్ఫిడెన్స్ పోయినట్లుంది. అందుకే ఇక ఎలాగోలా కానిచ్చేద్దాం అన్నట్లు అన్యమనస్కంగా సినిమా పూర్తి చేశాడేమో అనిపిస్తుంది. నటీనటులు.. సాంకేతిక నిపుణులు అందరూ కూడా చాలా మొక్కుబడిగా.. చాలా అనాసక్తికరంగా పని చేసినట్లు అనిపిస్తుంది. ఎవరి స్థాయిలో వాళ్లు ప్రేక్షకుల్ని మరింత ఇబ్బంది గురి చేయడం తప్ప చేసిందేమీ లేదు. షార్ట్ ఫిలిమ్స్.. వెబ్ సిరీస్ కూడా ఎంతో పకడ్బందీగా ఒక పద్ధతి ప్రకారం తీస్తున్న ఈ రోజుల్లో.. ‘పిల్ల జమీందారు’ లాంటి సక్సెస్ ఫుల్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన అశోక్.. ‘చిత్రాంగద’ను ఇంత అపరిపక్వంగా.. ఇంత గందరగోళంగా తీస్తాడని అస్సలు ఊహించలేం.

‘చిత్రాంగద’ క్లైమాక్స్ చూశాక ఆ పాయింటే అశోక్ ను.. హీరోయిన్ అంజలిని.. నిర్మాతల్ని ఎగ్జైట్ చేసి ఉండొచ్చేమో అనిపిస్తుంది. ఐతే ఏదో ఒక పాయింట్ వరకే ఎగ్జైట్ అయిపోయి.. దాని చుట్టూ ఏదో ఒకటి అల్లేసి.. ఏది పడితే అది తీసేస్తే ఎలా తయారవుతుందో ‘చిత్రాంగద’ సినిమా ఉదాహరణగా నిలుస్తుంది. ప్రతి సన్నివేశంలోనూ అవసరం లేని హడావుడి.. అర్థం లేని సన్నివేశాలు.. క్లూలెస్ గా అనిపించే నటీనటుల హావభావాలు.. చిత్ర విచిత్రమైన.. ఎబ్బెట్టుగా అనిపించే కెమెరా యాంగిల్స్.. విచిత్రమైన సౌండ్స్ తో బ్యాగ్రౌండ్ స్కోర్.. అప్పుడప్పుడూ ఎందుకొచ్చిపడ్డాయో తెలియని పాటలు.. ఇలా ‘చిత్రాంగద’ అన్ని రకాలుగా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.

మధ్యలో ఒక చోట ఒకమ్మాయి ఇది ‘నవరసాలు ఉన్న సకుటుంబ కథ’ అనే మాట వాడుతుంది. దర్శకుడు అశోక్ ‘చిత్రాంగద’ను అలాగే తీర్చిదిద్దాలని అనుకున్నట్లున్నాడు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ అని.. ఆ తరహాలోనే ఈ కథను నడిపించాలని మరిచిపోయి కామెడీ.. సెంటిమెంటు.. సహా అన్ని మసాలాల్నీ దీనికి అంటించే ప్రయత్నం చేశాడు. దీంతో సినిమా ఎటూ కాకుండా పోయింది. సినిమాలో ఒక్క పాత్రకు కూడా ఒక నిర్దిష్టమైన క్యారెక్టరైజేషన్ లేదు. ఏ పాత్ర ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో.. ఏ ఎక్స్ ప్రెషన్ ఎందుకిస్తుందో అర్థం కాదు. అంజలి పాత్రే తీసుకుంటే ఆ క్యారెక్టర్ కు దయ్యం పట్టి అబ్బాయిలాగా ప్రవర్తిస్తుంది. అమ్మాయిల మీద మోజు పడుతుంది. దానికి సంబంధించి ఆరంభంలో ఒక ఇంట్రడక్షన్ ఇస్తారు. ఆ తర్వాత ఆ సంగతి మరిచిపోతారు. అప్పుడప్పుడూ అంజలికి వీరావేశం వస్తుంది. అది వచ్చినపుడల్లా ఫ్యాక్షన్ సినిమాల్లో హీరో లాగా సవాళ్లు చేస్తుంది. తర్వాతి సీన్లోనే ఆ సంగతి మరిచిపోయి చాలా మామూలుగా కనిపిస్తుంది.

‘చిత్రాంగద’లో అంజలిని అబ్బాయి లాగా చూపించే సన్నివేశాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తాయి ఈ సన్నివేశాల్లో ఆమె మేనరిజమ్స్. సప్తగిరితో చేయించిన కామెడీ కూడా సినిమాను కాపాడలేకపోయింది. ఇదే కామెడీ మరో సినిమాలో అయితే వర్కవుటయ్యేదేమో కానీ.. ఇందులో అది సింక్ అవ్వలేదు. సప్తగిరి అనగానే ‘ప్రేమకథా చిత్రమ్’ గుర్తుకొచ్చి ఒకచోట అంజలికి నందిత గెటప్ వేయించి ఆమెతో సప్తగిరిని బాదించే కార్యక్రమం ఒకటి పెట్టారు. అది కూడా తేలిపోయింది. ఇక అంజలికి.. సాక్షి గులాటికి మధ్య వచ్చే సెంటిమెంటు సీన్లయితే మరీ సిల్లీగా తయారయ్యాయి.

‘చిత్రాంగద’లో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది క్లైమాక్సులో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రమే. దాని వరకు కొంచెం పకడ్బందీగా తీశాడు అశోక్. ఈ ఎపిసోడ్ కూడా ‘అరుంధతి’లో పశుపతి పాత్ర స్ఫూర్తితో అల్లుకున్నట్లు కనిపిస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ వరకు కొంచెం కన్విన్సింగ్ గా తీసి ముగింపులో పర్వాలేదనిపించాడు అశోక్. కాకపోతే సమస్య ఏంటంటే.. అక్కడిదాకా ప్రేక్షకుడు ఓపిగ్గా ఎదురు చూడటమే కష్టం. ప్రథమార్ధం అయ్యేసరికే ప్రేక్షకుల పరిస్థితి అయోమయంగా తయారవుతుంది. మొత్తంగా ‘చిత్రాంగద’లో ఒక్క క్లైమాక్స్ మినహాయిస్తే చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు.

నటీనటులు:

అంజలి తన వంతుగా ఏదో ప్రయత్నం చేసింది. కానీ ఆమెకు కూడా ఈ కథేంటో అర్థం కాలేదేమో అనిపిస్తుంది కొన్ని సన్నివేశాల్లో హావభావాలు చూస్తే. ‘సైజ్ జీరో’లో అనుష్కను చూసి ఆమె మీద జనాల ఫీలింగ్ మారిపోయినట్లుగా.. ఇందులో అంజలిని చూస్తే అలాంటి ఫీలింగే కలుగుతుంది. ఇక సినిమాలో సరైన క్యారెక్టర్ ఉండి.. దానికి తగ్గట్లుగా నటించిందంటే ఒక్క దీపక్ మాత్రమే. సింధు తులాని కూడా పర్వాలేదు. జయప్రకాష్.. సాక్షి గులాటి.. స్వాతి దీక్షిత్.. మిగతా పాత్రధారుల గురించి చెప్పడానికేమీ లేదు.

సాంకేతికవర్గం:

సెల్వ-స్వామి సంగీతం.. బాల్ రెడ్డి ఛాయాగ్రహణం కూడా సినిమాకు తగ్గట్లే తయారయ్యాయి. పాటలు కానీ.. బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ ఏమాత్రం ఆకట్టుకోవు. కెమెరా యాంగిల్స్ చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. నిర్మాణ విలువల గురించి ఏం చెప్పాలి. అమెరికా అని చెప్పి చాలా వరకు లోకల్ గానే కానిచ్చేశారు. నిజానికి ఈ సినిమాకు అమెరికా నేపథ్యమే అక్కర్లేదు. దాని వల్ల సినిమాకొచ్చిన అదనపు ప్రయోజనమేమీ లేదు. కథగా విన్నపుడు పర్వాలేదన్నట్లు అనిపించేలా ‘చిత్రాంగద’ను ఎంత పేలవంగా తీయొచ్చో అంత పేలవంగా తీశాడు అశోక్. దర్శకుడిగా అతడికీ చిత్రం ఓ చేదు జ్నాపకమే కావచ్చు.

చివరగా: చిత్రాంగద.. ఈ సిత్రాలు తట్టుకోలేం!

రేటింగ్-1.5/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre