‘ఛలో’

Fri Feb 02 2018 GMT+0530 (IST)

‘ఛలో’

చిత్రం : ‘ఛలో’

నటీనటులు: నాగశౌర్య - రష్మిక మందానా - వెన్నెల కిషోర్ - సత్య - నరేష్ - ప్రగతి - అచ్యుత్ కుమార్ - మైమ్ గోపి తదితరులు
సంగీతం: మహతి సాగర్
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
నిర్మాత: ఉష ముల్పూరి
రచన - దర్శకత్వం: వెంకీ కుడుముల

మంచి అభరుచి ఉన్న సినిమాలతో కథానాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు నాగశౌర్య. ఇన్నాళ్లూ బయటి బేనర్లలోనే సినిమాలు చేస్తూ ఉన్న అతను సొంతంగా నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి తొలి ప్రయత్నంగా ‘ఛలో’ అనే సినిమా చేశాడు. త్రివిక్రమ్ దగ్గర శిష్యరికం చేసిన వెంకీ కుడుముల ఈ చిత్రంతో దర్శకుడి అవతారమెత్తాడు. ఆసక్తికర ప్రోమోలతో జనాల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ఇంజినీరింగ్ చదివే హరి (నాగశౌర్య) ఎప్పుడూ ఏదో ఒక గొడవలోకి వెళ్లి తన తల్లిదండ్రులకు ఇబ్బంది తెచ్చి పెడుతుంటాడు. దీంతో ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతను అనుసరించి కొడుకుని.. ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లోఎప్పుడూ గొడవల్లో మునిగి తేలే తిరుప్పూరు అనే ఊరికి పంపిస్తాడు హరి తండ్రి. ఆ ఊరి దగ్గర్లోనే ఉండే కాలేజీలో చేరిన హరి.. అక్కడే చదివే కార్తీక (రష్మిక)ను ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడిని ప్రేమిస్తుంది. ఐతే తన వల్ల అవమానానికి గురైన అవతలి ఊరి పెద్ద కూతురే కార్తీక అని హరికి ఆలస్యంగా తెలుస్తుంది. ఆ పరిస్థితుల్లో హరి ఏం చేశాడు.. ఎలా కార్తీక తండ్రి మనసు గెలిచి ఆమెను సొంతం చేసుకున్నాడు.. మధ్యలో ఊరి గొడవలు ఏమయ్యాయి అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

‘ఛలో’ సినిమాలో ఆల్రెడీ ప్రేమలో ఉన్న కథానాయికను పెళ్లి చేసుకోవడానికి పెళ్లికొడుకు అవతారంలో వస్తాడు వెన్నెల కిషోర్. అప్పుడు హీరోయిన్ తాను ఆల్రెడీ మరో వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెబుతుంది. దానికి కిషోర్ ఏమీ షాకవ్వడు. తాను ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయితో వెళ్లిపోయిందని.. కాబట్టే వేరొకరు ప్రేమించిన అమ్మాయిని తాను పెళ్లి చేసుకుని ప్రతీకారం తీర్చుకుంటానని అంటాడు. హీరో హీరోయిన్లిద్దరూ ఇదేం లాజిక్కో అర్థం కాక తెల్లమొహం వేస్తారు. ప్రేక్షకులకు కూడా ఇది పిచ్చి లాజిక్ లాగే అనిపిస్తుందని.. కిషోర్ ఆ సంగతి చెప్పి తన పైత్యం చూపించినపుడు నవ్వాపుకోవడం కష్టం.

‘ఛలో’ సినిమాలో చాలా వరకు ఇలాంటి జోకులే వచ్చీ పోతుంటాయి. కావాల్సినంత వినోదం పంచుతాయి. ఆ ఎంటర్టైన్మెంట్ మత్తులో పడి లాజిక్ ఏంటో పట్టించుకోం. ఇందులో ప్రతికూలతలు లేవని కాదు. కానీ వాటిని మరిపించే వినోదంతో మ్యాజిక్ చేశాడు కొత్త దర్శకుడు వెంకీ కుడుముల. ద్వితీయార్ధం కొంచెం ఎగుడుదిగుడుగా సాగినా.. ముగింపు తేలిపోయినా.. దాదాపు ముప్పావు శాతం సినిమా నవ్వుల్లో ముంచెత్తుతూనే సాగిపోయే ‘ఛలో’ పైసా వసూల్ అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి కామెడీ ఎంటర్టైనర్ రాలేదంటే పెద్ద మాటేమీ కాదు.
‘జబర్దస్త్’.. ‘పటాస్’ లాంటి కార్యక్రమాలు టీవీల్లో.. యూట్యూబ్ లో రాజ్యమేలుతున్న  ఈ రోజుల్లో వెండితెరపై కామెడీ పండించడం సవాలుగా మారిపోయింది. ప్రపంచంలో ఉన్న పాత.. కొత్త జోకులన్నీ ఇక్కడే పేలిపోతున్నాయి. అదే తరహాలో కొంచెం లౌడ్ కామెడీ చేస్తే.. చాల్లే ఈ జబర్దస్త్ కామెడీ అనేస్తున్నారు జనాలు. ఈ నేపథ్యంలో సినిమాల్లో కామెడీ పండించడం గతంలో కంటే పెద్ద సవాలుగా మారిపోయింది. కామెడీ పండించడంలో పండిపోయిన దర్శకులు కూడా చేతులెత్తేస్తున్న ఈ రోజుల్లో కొత్త దర్శకుడు వెంకీ కుడుముల అదిరిపోయే కామెడీ టైమింగ్ తో ‘ఛలో’ను వినోదాల వల్లరిగా మార్చాడు. ఈ సినిమాకు కామెడీనే ప్రధాన బలంగా తయారు చేశాడు.

ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లో ఒక గ్రామం.. మధ్యలో సరిహద్దు రేఖ.. తెలుగోళ్లంటే వాళ్లకు పడదు. తమిళోళ్లంటే వీళ్లకు పడదు. అటు వైపు నుంచి ఒక వ్యక్తి ఇటువైపు అడుగు పెడితే తల తెగిపోతుంది. ఇలాంటి చోటికి గొడవలంటే మహా మోజున్న తెలుగు హీరో అడుగుపెడతాడు. అవతలి వైపు ఊరమ్మాయిని ప్రేమిస్తాడు. దీంతో మొదలవుతుంది సమస్య. వినడానికి.. చదవడానికి కూడా బాగా అనిపించే సెటప్పే ఇది. ఇది కథను మొదలుపెట్టడానికి.. ఆరంభంలో కొంచెం కామెడీ పండించడానికి బాగానే అనిపిస్తుంది. ముఖ్యంగా మంచి ట్రైలర్ కట్ చేయడానికి ఉపయోగపడే సెటప్పే ఇది. కానీ ఈ పాయింట్ మీద రెండున్నర గంటల సినిమాను నడిపించడం అంత తేలిక కాదు. ఇక్కడే వెంకీ తన ప్రతిభ చూపించాడు. లాజిక్ విషయంలో కొంచెం ఫ్రీహ్యాండ్ తీసుకుని ప్రతి సన్నివేశాన్ని వినోదాత్మకంగా తీర్చిదిద్దాడు.

ప్రథమార్ధంలో ఇటు ఊరిలో.. అటు కాలేజీలో వచ్చే సరదా సన్నివేశాలు సినిమాకు పెద్ద ఆకర్షణ. కమెడియన్ సత్య కెరీర్లో ఎప్పటికీ చెప్పుకునే పాత్రలో కామెడీ అదరగొట్టేశాడంతే. అతడి కామెడీ టైమింగ్ ను సరిగ్గా వాడుకుని భలే సీన్లు రాశాడు దర్శకుడతడికి. ఇక సుదర్శన్.. వైవా హర్ష లాంటి మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటులు అతడికి తోడవడంతో ప్రథమార్ధంలో నవ్వులకు లోటు లేకపోయింది. హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ కూడా సరదాగా సాగడంతో ప్రథమార్ధం రయ్యిన సాగిపోతుంది. ద్వితీయార్ధం కూడా మొదట్లో సరదాగా మొదలైనప్పటికీ.. ఆ తర్వాత ఊరి గొడవకు సంబంధించిన లోతుల్లోకి వెళ్లడం.. కథ కొంచెం సీరియస్ గా సాగడం వల్ల బండి కొంచెం నెమ్మదిస్తుంది. ప్రేమకథను ఎమోషనల్ గా కనెక్ట్ చేసేందుకు చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది.

అలాంటి టైంలో ఎంటరవుతాడు వెన్నెల కిషోర్. ఉన్నవి కొన్ని సీన్లే అయినా ప్రతి సీన్లోనూ అలరించాడు కిషోర్. ద్వితీయార్ధానికి ప్రధాన బలం కిషోరే అంటే అతిశయోక్తి ఏమీ కాదు. ఐతే ‘ఛలో’కు అతి పెద్ద మైనస్.. పతాక సన్నివేశమే. మనం ఏదేదో ఊహించుకుంటే ఎంతో బిల్డప్ ఇచ్చి క్లైమాక్సును సిల్లీగా తేల్చేశాడు దర్శకుడు. ఊరి గొడవను కామెడీకి బాగానే వాడుకున్నప్పటికీ.. ఆ సమస్యను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయడంలో.. దాన్ని కన్విన్సింగ్ గా చెప్పడంలోనూ దర్శకుడు విఫలమయ్యాడు. రొమాంటిక్ ట్రాక్ మొదట్లో సరదాగానే అనిపిస్తుంది కానీ.. ఆ తర్వాత కథలో అంతగా ఇమడ లేదు. ద్వితీయార్ధంలో కథనం నెమ్మదించడం.. కొన్ని చోట్ల లాజిక్ లేకపోవడం.. క్లైమాక్స్ తేలిపోవడం ‘ఛలో’లో ప్రధానమైన బలహీనతలు. కానీ ముందే అన్నట్లుగా వాటిని మరిపించే వినోదం ఇందులో ఉంది.

నటీనటులు:

నాగశౌర్య హుషారైన నటనతో ఆకట్టుకుంటాడు. అతడి లుక్.. స్క్రీన్ ప్రెజెన్స్.. నటన అన్నీ పాత్రకు తగ్గట్లుగా ఉండి మెప్పిస్తాయి. ఈ కథకు అతను చక్కగా సూటయ్యాడు. కొత్తమ్మాయి రష్మిక మందానా ఆకట్టుకుంటుంది. గొప్ప అందగత్తె ఏమీ కాదు కానీ.. కార్తీక పాత్రకు సరిపోయింది. తాజాగా.. క్యూట్ గా కనిపించి అలరిస్తుంది. ఆమె నటన కూడా ఓకే. హీరో తండ్రి పాత్రలో నరేష్ నవ్విస్తాడు. అచ్యుత్ కుమార్.. మైమ్ గోపీ బాగా చేశారు. సత్య చాన్నాళ్ల తర్వాత తనదైన కామెడీతో అదరగొట్టాడు. సుదర్శన్.. వైవా హర్ష కూడా నవ్వించే బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. ద్వితీయార్ధంలో వెన్నెల కిషోర్ తనదైన శైలిలో నవ్వించి సినిమాను సేవ్ చేశాడు.

సాంకేతికవర్గం:

మహతి సాగర్ సంగీతం బాగుంది. చూసీ చూడంగానే.. పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ట్యూన్ చేశాడు. ఆ పాట చిత్రీకరణ కూడా బాగుంది. ఇంకో రెండు పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. సాయిశ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణల్లో ఒకటి. నిర్మాణ విలువల విషయంలో రాజీ పడలేదు. ఈ కథకు తగ్గట్లుగా సినిమా రిచ్ గానే తెరకెక్కింది. కొత్త దర్శకుడు వెంకీ కుడుముల ఎంచుకున్న కథ ఆసక్తి రేకెత్తిస్తుంది. కొన్ని లోపాలున్నప్పటికీ ఆరంభం నుంచే ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతినిస్తుంది. వినోదాత్మకమైన సన్నివేశాలతో.. సరదాగా సాగిపోయే నరేషన్ తో మెప్పించాడు వెంకీ. నటీనటుల బలానికి తగ్గట్లుగా వాళ్ల పాత్రల్ని తీర్చిదిద్ది.. వారి నుంచి మంచి ఔట్ పుట్ రాబట్టగలిగాడతను. ఐతే ద్వితీయార్ధాన్ని ఇంకొంచెం మెరుగ్గా తీర్చిదిద్దుకోవాల్సింది. క్లైమాక్స్ విషయంలోనూ భిన్నమైన దారిని ఎంచుకోవాల్సింది.

చివరగా: ఛలో.. కామెడీ చల్తా!

రేటింగ్- 3/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS