‘చల్ మోహన్ రంగ’

Thu Apr 05 2018 GMT+0530 (IST)

‘చల్ మోహన్ రంగ’

‘చల్ మోహన్ రంగ’

నటీనటులు: నితిన్ - మేఘా ఆకాష్ - రావు రమేష్ - లిజి - మధునందన్ - నరేష్ - ప్రగతి - సత్య - నర్రా శీను - ప్రభాస్ శీను - సంజయ్ స్వరూప్ తదితరులు
సంగీతం: తమన్           
ఛాయాగ్రహణం: నటరాజ్ సుబ్రమణ్యన్
నిర్మాత: సుధాకర్ రెడ్డి
కథ: త్రివిక్రమ్
స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: కృష్ణచైతన్య

పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ నిర్మాతలు.. నితిన్ హీరో. ఈ కాంబినేషన్ చూశాక సినిమాపై ఆసక్తికి కొదవేమంటుంది? పైగా ‘రౌడీ ఫెలో’ లాంటి వైవిధ్యమైన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన లిరిసిస్ట్ కృష్ణచైతన్య తీసిన సినిమా. దీంతో ‘చల్ మోహన్ రంగ’కు హైప్ బాగానే వచ్చింది. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఆ అంచనాల్ని ఏమేరకు అందుకుందో చూద్దాం పదండి.

కథ:

మోహన్ రంగ (నితిన్) అత్తెసరు మార్కులతో చదువు పూర్తి చేసి అమెరికాకు వెళ్లాలని కలలు కంటుంటాడు. వీసా కోసం అతను చేసిన చాలా ప్రయత్నాలు విఫలమై చివరికి ఒక విచిత్రమైన ఐడియాతో వీసా సంపాదిస్తాడు. అమెరికాకైతే వెళ్తాడు కానీ.. అక్కడ అతడికి ఉద్యోగం దొరకదు. ఆ ప్రయత్నంలో ఉండగానే అనుకోకుండా మేఘ (మేఘా ఆకాష్) పరిచయమవుతుంది. గొడవతో మొదలైన వీరి పరిచయం.. తర్వాత స్నేహంగా మారుతుంది. తర్వాత ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడతారు. కానీ ఇద్దరివీ భిన్నమైన దారులు కావడంతో ఒకరిపై ఒకరు ప్రేమను చెప్పుకోరు. మరి ఈ ఇద్దరి జీవితాలు తర్వాత ఏ మలుపు తిరిగాయి.. ఇద్దరూ ఒక్కటయ్యారా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

కథ ఎంత పాతది అయినా.. దాన్ని కొంచెం కొత్తగా.. వినోదాత్మకంగా చెప్పగలిగితే బాక్సాఫీస్ పరీక్షలో ఈజీగా పాసైపోవచ్చన్నది ఈ తరం యువ దర్శకుల ఆలోచన. తమను వినోదంలో ముంచెత్తిత ప్రేక్షకులకు పెద్దగా పట్టింపు ఉండదు. వారికి రెండు రెండున్నర గంటల సమయం ఎలా గడిచిపోయిందో తెలియకుండా చేయగలిగితే చాలు. ‘చల్ మోహన్ రంగ’ సరిగ్గా ఈ విషయంలోనే మార్కులు కొట్టేస్తుంది. ఒక అమ్మాయి.. అబ్బాయి.. అనుకోకుండా కలుస్తారు. పరిచయం ప్రేమగా మారుతుంది. అంతలో ఏవో అపార్థాలు వచ్చి దూరమవుతారు. మళ్లీ అపార్థాలు తొలగించుకుని ఒక్కటవుతారు. సింపుల్ గా చెప్పాలంటే ‘చల్ మోహన్ రంగ’ కథ ఇది. ఇలాంటి కథలు కొన్ని వందలు చూసి ఉంటాం. అయినా ‘చల్ మోహన్ రంగ’ మెప్పిస్తుంది. కథ గురించి ఏమీ ఆలోచించనివ్వకుండా ఆద్యంతం ఎంటర్టైన్మంట్ తో మాయ చేయడం ద్వారా ప్రేక్షకుల మనసు గెలుస్తాడు లిరిసిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ కృష్ణచైతన్య.

దర్శకుడిగా తొలి ప్రయత్నంలో ‘రౌడీ ఫెలో’ లాంటి సీరియస్ సినిమా తీశాడు కృష్ణచైతన్య. అందులో ఎంతో డెప్త్.. ఇంటెన్సిటీ ఉన్న కథాకథనాలతో.. డైలాగులతో మెప్పించాడతను. ఐతే ఇప్పుడు కృష్ణచైతన్యను పూర్తి భిన్నంగా చూస్తాం. తొలి సినిమాకు పూర్తి భిన్నంగా ఆద్యంతం వినోదం నిండిన స్క్రిప్టును అతను డీల్ చేసిన విధానం ఆశ్చర్యపరుస్తుంది. ‘రౌడీ ఫెలో’ తీసిన దర్శకుడే ‘చల్ మోహన్ రంగ’ను కూడా తీశాడంటే నమ్మశక్యం కాదు. అంత సరదాగా సాగుతుంది ఈ చిత్రం. ఎక్కడా ఏ హడావుడి లేకుండా.. చాలా సింపుల్ గా సాగిపోవడమే ‘చల్ మోహన్ రంగ’లోని ప్రత్యేకత. ప్రత్యేకంగా కామెడీ ట్రాకులేమీ లేకుండానే.. ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సాగే సిచ్యువేషనల్ కామెడీ సినిమాకు అతి పెద్ద ఆకర్షణ.

‘చల్ మోహన్ రంగ’కు త్రివిక్రమ్ కథ మాత్రమే అందించాడు. కథనం.. మాటలు.. దర్శకత్వ బాధ్యతలు కృష్ణచైతన్యవే. ఐతే సినిమాలో అక్కడక్కడా త్రివిక్రమ్ టచ్ కనిపిస్తుంది. కథ త్రివిక్రమ్ ది కాబట్టి.. కథనాన్ని కొంచెం ఆయన స్టయిల్లోనే నడిపించే ప్రయత్నం చేశాడు కృష్ణచైతన్య. వినోదం పండించడంలో త్రివిక్రమ్ కు తాను ఏమీ తీసిపోనని చాలా చోట్ల చాటాడతను. చాలా సన్నివేశాల్లో అతడి సెన్సాఫ్ హ్యూమర్ ప్రేక్షకుల్ని గిలిగింతలు పెడుతుంది. ఉదాహరణకు సినిమా ఆరంభంలో యుఎస్ వెళ్లడానికి వీసా కోసం హీరో చేసే ప్రయత్నాలే. దీని చుట్టూ నడిపిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. అక్కడే సినిమా ఎలా సాగుతుందో ఒక అంచనాకు వచ్చేయొచ్చు. ఇక్కడి నుంచి చివరిదాకా ప్రేక్షకుడి ముఖంపై చిరునవ్వు చెరగదు.

దాదాపు పూర్తిగా అమెరికా నేపథ్యంలోనే సాగే ప్రథమార్ధంలో బోర్ కొట్టించే సన్నివేశాలేమీ లేవు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలను ప్రేమ కోసం కంటే వినోదం పండించడానికే దర్శకుడు ఉపయోగించుకున్నాడు. సందర్భానుసారం సాగే కామెడీ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. హీరో పాత్రనే వినోదాత్మకంగా రాసుకోవడం.. ఇంకా మధునందన్.. ప్రభాస్ శీను. రావు రమేష్ కూడా తమదైన శైలిలో నవ్వించడంతో ప్రథమార్ధం వేగంగా సాగిపోతుంది. ద్వితీయార్ధమంతా ఊటీ నేపథ్యంలో సాగుతుంది. హీరో నుంచి విడిపోయిన కథానాయిక మరో పెళ్లికి సిద్ధం కావడం.. ఆమెను వెతుక్కుంటూ హీరో ఊటీకి రావడం చూశాక ఈ కథ ఎలా ముగుస్తుందనే విషయంలో ప్రేక్షకుడికి ముందే ఒక అంచనా వచ్చేస్తుంది. కానీ ప్రేక్షకుడికి కథ గురించి ఆలోచించే అవకాశం లేకుండా ద్వితీయార్ధంలో మరింత ఎంటర్టైన్మెంట్ డోస్ దొరుకుతుంది. నితిన్ తో పాటుగా సత్య.. రావు రమేష్.. నర్రా శీను కావాల్సినంత వినోదం పంచుతారు. ముగింపు ఊహించినట్లుగానే ఉంటుంది. అక్కడ కూడా వినోదానికి ఢోకా ఉండదు.

కథలో కొత్తదనం లేకపోవడం ‘చల్ మోహన్ రంగ’లో కొంత నిరాశ కలిగించే విషయం. అలాగే ప్రేమకథలో ఇంకొంచెం డెప్త్ ఉండాల్సింది. హీరో హీరోయిన్లు ప్రేమలో పడటానికి సరైన కారణాలు కనిపించవు. ఎక్కువగా వినోదం మీదే దృష్టిపెట్టడం.. సినిమాను ఆద్యంతం లైట్ హార్టెడ్ కామెడీతో నడిపించడం వల్ల ప్రేమకథలో ఫీల్ అనుకున్న స్థాయిలో లేకపోయింది. లవ్ స్టోరీని ప్రేక్షకులు అంత సీరియస్ గా తీసుకోకపోవచ్చు. ఐతే వినోదం కోరుకునే వారికి మాత్రం ‘చల్ మోహన్ రంగ’ బాగా నచ్చుతుంది. ప్రధానంగా క్లాస్ ప్రేక్షకుల్ని టార్గెట్ చేసిన కామెడీ.. కొన్ని చోట్ల మాస్ ను కూడా అలరిస్తుంది. పెద్ద పులి పాట కూడా మాస్ కు విందు భోజనమే. ప్రథమార్ధంలో ‘జాకీ’ ఎపిసోడ్.. ద్వితీయార్ధంలో ‘డాక్టర్ మిత్రా’ ఎపిసోడ్ హిలేరియస్ అనిపిస్తాయి. అవి వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కథ గురించి ఎక్కువ ఆలోచించకుండా లైటర్ వీన్ లో సాగే కామెడీని ఎంజాయ్ చేయాలనుకుంటే మంచి ఛాయిస్ ‘చల్ మోహన్ రంగ’.

నటీనటులు:

‘ఇష్క్’ దగ్గర్నుంచి క్లాస్ లవ్ స్టోరీల్లో చాలా ఈజీగా ఒదిగిపోతున్న నితిన్ మరోసారి మెప్పించాడు. మోహన్ రంగ పాత్రను అతను ఈజ్ తో చేసుకుపోయాడు. పాత్రకు తగ్గట్లు సింపుల్ నటనతో ఆకట్టుకున్నాడు. అతడి కామెడీ టైమింగ్ మెప్పిస్తుంది. నితిన్ పాత్ర.. లుక్.. యాక్టింగ్ యువ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. పెద్ద పులి పాటలో అతను డ్యాన్స్ అదరగొట్టేశాడు. మేఘా ఆకాష్ క్యూట్ గా అనిపిస్తుంది. ఆమె తన అందంతో ఆకర్షిస్తుంది. నటన పర్వాలేదు. ఐతే ఇలాంటి లవ్ స్టోరీల్లో ప్రేక్షకుల్లో ఆరాధ్య భావం కలిగించే కథానాయిక అయితే బాగుండేదనిపిస్తుంది. ప్రథమార్ధంలో మధు నందన్.. ద్వితీయార్ధంలో సత్య చక్కటి వినోదం పంచారు. రావురమేష్ కూడా ఎంటర్టైన్ చేశాడు. నర్రా శీను కెరీర్ ఈ సినిమాకు ఓ టర్నింగ్ పాయింట్ అనొచ్చు. డాక్టర్ మిత్రా పాత్రలో అతను అదరగొట్టాడు. నరేష్ తక్కువ సన్నివేశాల్లోనే తన ప్రత్యేకతను చాటుకున్నారు. హీరోయిన్ తల్లిగా కీలక పాత్రలో లిజి మెప్పిస్తుంది .

సాంకేతిక వర్గం:

‘చల్ మోహన్ రంగ’కు సాంకేతిక హంగులు బాగా కుదిరాయి. ముఖ్యంగా ప్రేమకథలకు చాలా కీలకమైన సంగీతం.. ఛాయాగ్రహణం ఆకర్షణగా నిలిచాయి. ‘తొలి ప్రేమ’ తర్వాత తమన్ మరోసారి ఫీల్ ఉన్న సంగీతంతో ఈ ప్రేమకథకు పెద్ద బలం అయ్యాడు. వారం.. మేఘ.. పాటలు వినసొంపుగా ఉండటమే కాక చిత్రీకరణలోనూ ఆకట్టుకుంటాయి. పెద్ద పులి పాట మాస్ ను ఊపేస్తుంది. నేపథ్య సంగీతం ఆద్యంతం మంచి ఫీల్ తో సాగుతుంది. వారం పాట థీమ్ మ్యూజిక్ ను చాలా బాగా వాడుకున్నాడు. నటరాజ్ సుబ్రమణ్యం కలర్ ఫుల్ విజువల్స్ తో సినిమాకు మరో పెద్ద ఆకర్షణగా నిలిచాడు. అటు అమెరికా.. ఇటు ఊటీ నేపథ్యంలో సాగే సన్నివేశాల్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాడు. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ లేదు. సినిమా రిచ్ గా కనిపిస్తుంది. త్రివిక్రమ్ అందించిన కథ మామూలుగా అనిపిస్తుంది. అయితే స్క్రిప్టులో ఆయన మార్కు చమత్కారం అక్కడక్కడా కనిపిస్తుంది. కృష్ణ చైతన్య ఆద్యంతం వినోదాత్మకంగా సాగే కథనంతో మ్యాజిక్ చేశాడు. అతడి మాటలు సినిమాకు అతి పెద్ద ఆకర్షణ. అక్కడక్కడా డైలాగుల్లో త్రివిక్రమ్ శైలి కూడా కనిపిస్తుంది. కృష్ణచైతన్య దర్శకుడిగానూ మెప్పించాడు.

చివరగా: 'చల్ మోహన్ రంగ'.. సింపుల్ అండ్ బ్యూటిఫుల్

రేటింగ్- 3/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre


LATEST NEWS