‘బ్రాండ్ బాబు’

Sat Aug 04 2018 GMT+0530 (IST)

‘బ్రాండ్ బాబు’

చిత్రం: ‘బ్రాండ్ బాబు’

నటీనటులు: సుమంత్ శైలేంద్ర - ఈషా రెబ్బా - మురళీ శర్మ - పూజిత పొన్నాడ - రాజా రవీంద్ర - వేణు - సాయికుమార్ పంపాన తదితరులు
సంగీతం: జె.బి
ఛాయాగ్రహణం: కార్తీక్ పళని
నిర్మాత: శైలేంద్ర బాబు
కథ - స్క్రీన్ ప్లే - మాటలు: మారుతి
దర్శకత్వం: ప్రభాకర్

ఓవైపు తన దర్శకత్వంలో సినిమాలు తీస్తూనే.. చిన్న సినిమాలకు రచనా సహకారం అందించడం.. నిర్మాణంలో భాగస్వామి కావడం దాసరి మారుతికి అలవాటు. అతడి నుంచి ఈ కోవలో చాలా సినిమాలే వచ్చాయి. కొంచెం విరామం తర్వాత మారుతి బ్రాండుతో వచ్చిన సినిమా ‘బ్రాండ్ బాబు’. బుల్లితెర నుంచి వెండితెర వైపు అడుగులేస్తన్న ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

డైమండ్ (సుమంత్ శైలేంద్ర) ఒక పెద్దింటి కుర్రాడు. అతడికి బ్రాండ్స్ అంటే పిచ్చి. తాను తినే కూరగాయల్లో కూడా బ్రాండ్ కోరుకునే రకం అతను. అతడి తండ్రి చిన్నప్పట్నుంచి అలా పెంచుతాడు అతడిని. అలాంటి వాడు హోం మంత్రి కూతురు అనుకుని కన్ఫ్యూజన్ లో ఆ ఇంటి పని మనిషి అయిన రాధ (ఈషా రెబ్బా)ను ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడిని ఇష్టపడుతుంది. ఐతే రాధతో డైమండ్ పెళ్లికి సిద్ధమైన సమయంలో ఆమె అసలు నేపథ్యం బయటపడుతుంది. ఈ పరిస్థితుల్లో డైమండ్ ఏం చేశాడు.. రాధను బ్యాగ్రౌండ్ చూడకుండా పెళ్లి చేసుకున్నాడా.. ఆమెను తిరస్కరించాడా.. తర్వాత ఏం జరిగింది అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘బ్రాండ్ బాబు’ కథను మారుతి శర్వానంద్ కోసం రాశాడట. అతను నో అంటే ‘మహానుభావుడు’ తీసి.. ఆ తర్వాత ‘బ్రాండ్ బాబు’ కథను ప్రభాకర్ కు ఇచ్చి సినిమా తీయించినట్లు చెప్పాడు మారుతి. ‘బ్రాండ్ బాబు’ సినిమా చూస్తుంటే శర్వానంద్ ఈ సినిమాను తిరస్కరించడంలో ఆశ్చర్యమేమీ లేదనిపిస్తోంది. మారుతి స్వయంగా ఈ కథను తీస్తే ఏమైనా బెటర్ గా ఉండేదో ఏమో తెలియదు కానీ.. ‘బ్రాండ్ బాబు’ మాత్రం ప్రేక్షకుల సహనానికి ఆద్యంతం పరీక్ష పెడుతుంది. బ్రాండ్స్ అంటే పడి చచ్చే కుర్రాడు ఒక పేదింటి అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే పాయింట్ వినడానికి ఆసక్తి రేకెత్తించేదే. ఇది కామెడీ వర్కవుట్ చేయడానికి మంచి స్కోప్ ఉన్న సబ్జెక్టే. కానీ కేవలం ఈ ఐడియాకు ఎగ్జైట్ అయిపోయి.. దాని చుట్టూ ఏం తోస్తే అది రాసేసి.. ఎలా పడితే అలా తీసేస్తే అది ‘బ్రాండ్ బాబు’ అయింది.

‘బ్రాండ్ బాబు’లో పాత్రలు ఎంత అర్థ రహితంగా ఉంటాయో కొన్ని ఉదాహరణలు చూద్దాం. తన కొడుకు పేదింటి అమ్మాయిని ప్రేమించాడని తెలిసి ఆమెతో నిశ్చితార్థం క్యాన్సిల్ చేస్తాడు హీరో తండ్రి. అమ్మాయి వైపు వాళ్లు వెళ్లి టీవీ ఛానెల్లో చర్చ పెడతారు. దీంతో తండ్రి నేరుగా వెళ్లి టీవీ ఛానెల్లో కూర్చుంటాడు. మా వాడి వాచ్ ఖరీదు చేయవు మీ జీవితాలు అంటాడు. ఏంటి మీ బోడి బతుకులు అన్నట్లు మాట్లాడతాడు. లైవ్ నడుస్తోందని తెలిసి కూడా పేదింటి వాళ్లను ఎలా పడితే అలా తిట్టేస్తాడు. కాస్తయినా ఇంగిత జ్ఞానం ఉన్నవాడెవడైనా ఇలా చేస్తాడా అన్నది బేసిక్ క్వశ్చన్. ఇక హీరోయిన్ క్యారెక్టర్ చూద్దాం. తనో పెద్దింటి అమ్మాయనుకుని హీరో ప్రేమించాడని తెలిసినా.. తన గురించి అతను చాలా తేలిగ్గా మాట్లాడినా.. అతడిని ప్రేమిస్తూనే ఉంటుంది. అతడి ఇంట్లో పనికి కూడా వెళ్తుంది. ఈమె అతడిని ప్రేమించడానికి సహేతుకమైన కారణం ఒక్కటీ కనిపించదు. ఇక హీరో పాత్ర గురించైతే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒక్కో సన్నివేశంలో ఒకలా ఉంటాడు. ఒక సీన్లో హీరోయిన్ బాగుందంటాడు. ఇంకో సీన్లో వేరే అమ్మాయికి లైనేస్తుంటాడు. ఇలా ఒక్కో క్యారెక్టర్ వ్యవహారం ఒక్కో రకంగా సాగుతుంది. ఏ పాత్రకూ ఒక నిర్దిష్టమైన క్యారెక్టరైజేషన్ లేకుండా అన్ని పాత్రల్నీ కిచిడీ చేసేశాడు మారుతి.

ప్రేక్షకులకు అన్నిసార్లూ లాజిక్ తో పని లేదు. కానీ వాళ్లు లాజిక్ గురించి పట్టించుకోకూడదంటే ఒక మ్యాజిక్ జరగాలి. వాళ్లను వినోదంలో ముంచెత్తితే లాజిక్ సంగతి మరిచిపోతారు. కానీ ‘బ్రాండ్ బాబు’ ఏ దశలోనూ నిఖార్సయిన నవ్వులు పంచలేకపోయింది. కాన్సెప్ట్ ఫన్నీగా అనిపించినా.. దాని చుట్టూ మంచి కథను.. కథనాన్ని అల్లడంలో మారుతి ఫెయిలయ్యాడు. ఇక ఈ కథను ప్రభాకర్ తెరెక్కించిన తీరు మరింత పేలవం. చాలా ఏళ్ల కిందటే ఔట్ డేట్ అయిపోయిన కన్ఫ్యూజింగ్ కామెడీని ఇప్పుడు ట్రై చేయడమే ఆశ్చర్యమంటే.. దాన్ని మరీ సాధారణంగా డీల్ చేయడంతో ‘బ్రాండ్ బాబు’ ఏ దశలోనూ మెప్పించదు. ఇప్పుడంతా సటిల్ కామెడీనే ప్రేక్షకులు ఇష్టపడుతుండగా.. ఇందులో ఓవర్ ద టాప్.. లౌడ్ కామెడీతో ఇరిటేట్ చేశారు. హీరో ఫ్యామిలీకి బ్రాండ్ల పిచ్చి అని తెలిసి ఒక సీన్లో హీరోయిన్ బస్తీ వాళ్లంతా బ్రాండెడ్ బట్టలు.. ప్రాడెక్టులు వాడి హీరో ఇంటికొచ్చి హంగామా చేసే ఒక సీన్ ఉంటుంది. ఆ ఒక్క సీన్ చాలు.. ప్రేక్షకుల అసహనం పతాక స్థాయికి చేరిపోవడానికి. ఇక రావా రావా అంటూ హీరో ఫ్యామిలీ కథానాయికను ఆహ్వానిస్తూ చేసే ఒక వీడియో సాంగ్ గురించైతే వర్ణించ తరం కాదు. ఇవన్నీ చూస్తే ఈ చిత్ర రచయిత.. దర్శకుడు ఇంకా ఏ కాలంలో ఉన్నారో అనిపిస్తుంది. సినిమా ఆరంభంలోనే ‘బ్రాండ్ బాబు’ మీద ఇంప్రెషన్ పోవడంతో.. అక్కడక్కడా రెండు మూడు సీన్లు బాగున్నా కూడా అవి కూడా సినిమాపై ఫీలింగ్ ను మార్చవు. రచయితగా మారుతికి ఇంకా ఏమైనా బ్రాండ్ వాల్యూ ఉంటే.. దాన్ని ‘బ్రాండ్ బాబు’తో పూర్తిగా తుడిచి పెట్టేస్తుంది.

నటీనటులు:

సుమంత్  శైలేంద్ర పర్వాలేదు. నటుడిగా పెర్ఫామ్ చేయడానికి ఈ పాత్ర ఏమీ స్కోప్ ఇవ్వలేదు. ఐతే అతను మరీ ఆడ్ గా అయితే కనిపించలేదు. క్యారెక్టర్ లో ఏ విశేషం లేకపోయినా.. దానికి అతను ఓకే అనిపించాడు. ఈషా రెబ్బాది కూడా పేలవమైన పాత్రే. ఆమె తన టాలెంట్ చూపించడానికి పెద్దగా అవకాశం లేకపోయింది. ఈషా ఈ పాత్రను ఎలా ఒప్పుకుందో అనిపిస్తుంది. పేదింటి అమ్మాయి కాబట్టి ఆమెకు మేకప్ కూడా అందుకు తగ్గట్లే వేశారు. దీంతో ఈషా మీదున్న ఇంప్రెషన్ తగ్గిపోయేలా చేసిందీ పాత్ర. ఆమెతో పోలిస్తే పూజిత పొన్నాడ అందంగా కనిపించి ఆకట్టుకుంది. మామూలుగా ఒద్దికగా నటించే మురళీ శర్మ.. ఎన్నడూ లేని విధంగా చాలా ఓవర్ యాక్షన్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పాత్ర డిమాండ్ ను బట్టే అలా చేశాడనుకుందామనుకున్నా కూడా ఆయన నటన అతిగానే అనిపిస్తుంది. కానీ ఏమాటకామాటే చెప్పాలి. సినిమాలో చెప్పుకోదగ్గ స్థాయిలో వినోదం పంచిందంటే ఆయనొక్కరే. ఆయన తర్వాత వేణు-సాయి పర్వాలేదనిపించారు. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతికవర్గం:

‘బ్రాండ్ బాబు’లో టెక్నీషియన్స్ కూడా సినిమా స్థాయికి తగ్గ ఔట్ పుటే ఇచ్చారు. జె.బి. సంగీతంతో ఏ ప్రత్యేకతా లేదు. పాటలేవీ గుర్తుండవు. నేపథ్య సంగీతం కూడా సాధారణంగా అనిపిస్తుంది. కార్తీక్ పళని ఛాయాగ్రహణంలోనూ ఏ ప్రత్యేకతా కనిపించదు. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఇక ఈ సినిమాకు స్క్రిప్టు అందించిన మారుతి గురించి ఏం చెప్పాలి? దర్శకుడిగా తన సినిమాల్లో క్వాలిటీ చూపిస్తున్న మారుతి.. రచయితగా మాత్రం ఇలాంటి సెకండ్ గ్రేడ్ స్క్రిప్టులు ఎందుకు ఇస్తున్నాడో అర్థం కాదు. దర్శకుడు ప్రభాకర్ అయితే తాను సీరియల్స్ నుంచి వచ్చాననే విషయాన్ని గుర్తు చేశాడు ఈ చిత్రంతో.

చివరగా: ‘బ్రాండ్ బాబు’తో బ్యాండే

రేటింగ్-1.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS