'భలే మంచి చౌక బేరమ్'

Sat Oct 06 2018 GMT+0530 (IST)

'భలే మంచి చౌక బేరమ్'

చిత్రం : 'భలే మంచి చౌక బేరమ్'

నటీనటులు: నవీద్ - నూకరాజు - రాజా రవీంద్ర - యామిని భాస్కర్ - ముజ్ తబా అలీ ఖాన్ తదితరులు
సంగీతం: హరి గౌర
ఛాయాగ్రహణం: బాల్ రెడ్డి
నిర్మాత: ఆరోళ్ల సతీశ్ కుమార్
కాన్సెప్ట్: మారుతి
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: మురళీకృష్ణ

దర్శకుడు మారుతి తాను సొంతంగా తీసే సినిమాలు ఒక రకం. అతడి కథలతో వేరే దర్శకులు తెరకెక్కించే చిన్న సినిమాలు ఇంకో రకం. ఈ తరహా ప్రయత్నాలతో అతను వరుసగా ఎదురు దెబ్బలు తింటున్నాడు. ఈ మధ్యే ‘బ్రాండ్ బాబు’ మారుతికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇప్పుడు మారుతి కాన్సెప్ట్ తో ‘భలే మంచి చౌక బేరమ్’ అనే మరో చిన్న సినిమా వచ్చింది. ఇంతకుముందు మారుతి కథతోనే ‘రోజులు మారాయి’ అనే సినిమా తీసిన మురళీకృష్ణ ఈ చిత్రానిి దర్శకత్వం వహించాడు. మరి ఈసారైనా ఈ కాంబినేషన్ వర్కవుటైందా.. ‘భలే మంచి చౌక బేరమ్’ ఏ మేరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.. చూద్దాం పదండి.

కథ:

పార్థు (నవీద్).. సలీమ్ (నూకరాజు) దుబాయ్ వెళ్లి భారీగా డబ్బులు సంపాదించి తమ కుటుంబాలను ఆదుకోవాలని అనుకుంటారు. కానీ ఒక బ్రోకర్ వీళ్లను మోసం చేయడంతో హైదరాబాద్ లో ఒకే గదిలో ఉంటూ ఒకరు వ్యాన్ డ్రైవర్ గా.. ఇంకొకరు కొరియర్ బాయ్ గా పని చేస్తుంటారు. ఇలాంటి స్థితిలో ఒక మాజీ ఆర్మీ ఆఫీసర్ రాసిన ‘దేశ రహస్యాలు’ అనే ఫైల్.. కొరియర్ బాయ్ అయిన సలీమ్ చేతికి అనుకోకుండా చిక్కుతుంది. దీన్ని సొమ్ము చేసుకుని పార్థు.. సలీమ్ తమ జీవితాల్ని చక్కదిద్దుకోవాలని అనుకుంటారు. మరి వారి ప్రయత్నం ఏమేరకు ఫలించిందన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘బ్రాండ్ బాబు’ తేడా కొట్టాక.. తన కథల్ని వేరే దర్శకులు సరిగా డీల్ చేయలేకపోతున్నారని.. ఇకపై తన కాన్సెప్టులతో చిన్న సినిమాలు తీయించే ప్రయత్నాలు మానుకుంటానన్న సంకేతాలు ఇచ్చాడు మారుతి. ‘భలే మంచి చౌక బేరమ్’ తర్వాత అతనీ విషయంలో గట్టి నిర్ణయానికే వచ్చేస్తే ఆశ్చర్యం లేదు. బేసిగ్గా మారుతి ఐడియాలు బాగానే ఉంటాయి. వినోదానికి మంచి ఆస్కారమున్నట్లే కనిపిస్తాయి. కానీ వాటిని డీల్ చేసే విధానంలో వస్తోంది సమస్య. కేవలం మారుతి బ్రాండును వాడుకుని.. సరైన కసరత్తు లేకుండా చాలా తక్కువ ఖర్చుతో లాగించేస్తుండటంతో తేడా కొట్టేస్తోంది. చిన్న సినిమా అంటే అన్నీ చాలా తక్కువ స్థాయిలో ఉండాలని అనుకుంటారో ఏమో తెలియదు కానీ.. ‘భలే మంచి చౌక బేరమ్’లో ఎక్కడా ఒక సినిమాకు ఉండాల్సిన స్థాయి కనిపించదు. షార్ట్ ఫిలిమ్స్ కూడా చాలా సీరియస్ గా తీస్తున్న ఈ రోజుల్లో ఈ చిత్రాన్ని నడిపించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఆర్మీలో పని చేసిన అధికారి తన 30 ఏళ్ల అనుభవాలతో ‘దేశ రహస్యాలు’ అనే పేరుతో ఫైల్ గా తయారు చేస్తాడట. ఆ ఫైల్ హీరోలకు దొరికి దాన్ని పాకిస్థాన్ కు అమ్మేసి సొమ్ము చేసుకుందామనుకుంటారట. వినడానికి సిల్లీగా అనిపించే కాన్సెప్ట్ ఇది. ఐతే దీన్ని హీరోల అమాయకత్వంతో ముడిపెట్టి కామెడీ పండించడానికి ఆస్కారం లేకపోలేదు. నూకరాజు రూపంలో అందుకు తగ్గ నటుడు కూడా దొరికాడు. కానీ ఏ కథనైనా ఎలా డీల్ చేస్తారన్న దాన్ని బట్టే ప్రేక్షకులకు అది ఏమేరకు రుచిస్తుందన్నది ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో మురళీ కృష్ణ ఏమాత్రం ప్రత్యేకత చూపించలేకపోయాడు. ఉగ్రవాద కార్యకలాపాలు నడిపే వ్యక్తి.. అతడి డెన్.. ఈ సెటప్ చూస్తేనే ‘భలే మంచి చౌక బేరమ్’ స్థాయి ఏంటో అర్థమైపోతుంది. ఎంత కామెడీ అయినా సరే.. ఒక ఉగ్రవాద నాయకుడి పాత్రను.. అతడి సెటప్ ను చూపించిన తీరు మరీ సిల్లీగా అనిపిస్తుంది.

‘భలే మంచి చౌక బేరమ్’ ఎక్కడా కూడా నమ్మశక్యంగా.. లాజికల్ గా అనిపించదు. కామెడీ పేరుతో ఇష్టానుసారం కథను తీసుకెళ్లిపోయారు. ప్రథమార్ధంలో చెప్పుకోదగ్గ మలుపుల్లేవు. కథ ఫ్లాట్ గా నడిచిపోతుంది. ప్రత్యేకంగా చెప్పుకునే సీన్లు లేవు. నవీద్-యామినిల రొమాంటిక్ ట్రాక్ తేలిపోయింది. నూకరాజు అక్కడక్కడా కొంచెం నవ్వించినా.. మిగతా సీన్లన్నీ బోరింగ్ గా తయారయ్యాయి. ఇంటర్వెల్ మలుపు ఒక్కటి ఓకే అనిపిస్తుంది. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం బెటరే. రాజా రవీంద్ర-నూకరాజు కలిసి కొన్ని సన్నివేశాల్ని నిలబెట్టారు. లాజిక్కుల గురించి మరిచిపోతే కొన్ని సీన్లలో నవ్వుకోవచ్చు. కానీ సినిమా ముగింపు సాదాసీదాగా తయారైంది. మొత్తంగా చూస్తే మారుతి బేసిక్ ఐడియా బాగున్నా.. దాన్ని తెరకెక్కించిన తీరు బాగా లేకపోవడం.. రాజారవీంద్ర-నూకరాజుల కామెడీ మినహాయిస్తే విశేషాలేమీ లేకపోవడంతో ‘భలే మంచి చౌక బేరమ్’ ఒక సాధారణ సినిమాగా మిగిలిపోయింది.

నటీనటులు:

‘కేరింత’ ఫేమ్ నూకరాజు తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. అక్కడక్కడా అతడి కామెడీ ఓవర్ ద టాప్ అనిపించినా.. రిపిటీటివ్ గా ఉన్నా.. ఉన్నంతలో అతనే కొంచెం నవ్వులు పంచాడు. మరో హీరో నవీద్ మాత్రం సాధారణంగా కనిపించాడు. అతడి లుక్ బాగున్నప్పటికీ నటన పరంగా ప్రత్యేకత ఏమీ లేదు. రాజా రవీంద్ర బాగా చేశాడు. సినిమాకు కొంచెం వెయిట్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది అతనే. ఫుల్ లెంగ్త్ రోల్ లో అతను రాణించాడు. హీరోయిన్ యామిని భాస్కర్ ది నామమాత్రపు పాత్ర. ఆమె కొంచెం గ్లామరస్ గా కనిపించింది. ఉగ్రవాదిగా చేసిన ముజ్ తబా అలీ ఖాన్ గురించి చెప్పడానికేమీ లేదు.

సాంకేతిక వర్గం:

హరి గౌర పాటలేవీ గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. బాల్ రెడ్డి ఛాయాగ్రహణం సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణల్లో ఒకటి. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన సినిమా అయినా.. కెమెరా వర్క్ లో క్వాలిటీ చూపించాడతను. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. ముందే చెప్పుకున్నట్లు మారుతి కాన్సెప్ట్ కామెడీకి స్కోప్ ఇచ్చేదే. ఐతే అతను అందించింది మరీ పలుచనైన కథ. దీన్ని దర్శకుడు మురళీకృష్ణ సరిగా డెవలప్ చేయలేదు. సరైన కసరత్తు లేకుండా సినిమా తీసేసినట్లుగా అనిపిస్తుంది.

చివరగా: భలే మంచి చౌక బేరమ్.. మారుతి కాన్సెప్ట్ మళ్లీ మిస్ ఫైర్

రేటింగ్-2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre


LATEST NEWS