‘అర్జున్ రెడ్డి’

Fri Aug 25 2017 GMT+0530 (IST)

‘అర్జున్ రెడ్డి’

చిత్రం : ‘అర్జున్ రెడ్డి’

నటీనటులు: విజయ్ దేవరకొండ - షాలిని - రాహుల్ రామకృష్ణ - కమల్ కామరాజు - సంజయ్ స్వరూప్ - కాంచన - ప్రియదర్శి తదితరులు
సంగీతం: రధాన్
ఛాయాగ్రహణం: రాజు తోట
నిర్మాత: ప్రణయ్ రెడ్డి వంగ
రచన - దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగ

అర్జున్ రెడ్డి.. గత కొంత కాలంగా టాలీవుడ్లో చర్చనీయాంశం అవుతున్న సినిమా. ‘పెళ్లిచూపులు’ ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగ రూపొందించిన ఈ చిత్రం సెన్సేషనల్ ప్రోమోలతో జనాల్లో క్యూరియాసిటీ తీసుకొచ్చింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) ఒక మెడికో. అతడికి కోపం బాగా ఎక్కువ. దాని వల్ల అతను కాలేజీ వదిలేసి వెళ్లిపోవాల్సి వస్తుంది. అలాంటి స్థితిలో ప్రీతి (షాలిని) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోతాడు. తన కోసమే కాలేజీలో కొనసాగడానికి కూడా నిర్ణయించుకుంటాడు. కొన్నాళ్ల తర్వాత ప్రీతి కూడా అతణ్ని ఇష్టపడుతుంది. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు. కానీ కొన్ని అనూహ్య పరిణామాల వల్ల ప్రీతి అతడికి దూరమవుతుంది. ఆ స్థితిలో అర్జున్ రెడ్డి ఏమైపోయాడు.. అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. అందులో కొన్ని నచ్చుతాయి. వాటిని ఆస్వాదిస్తాం. వదిలేస్తాం. కానీ కొన్ని సినిమాలు మాత్రం మనసుపై బలమైన ముద్ర వేస్తాయి. మాటల్లో చెప్పలేని ఒక అనుభూతిని కలిగిస్తాయి. ‘అర్జున్ రెడ్డి’ ఈ కోవలోని సినిమానే. ఇది పర్ఫెక్ట్ మూవీ అని కాదు.. ఇందులో లోపాలు లేవని కాదు.. కానీ ఇది ఓ వర్గం ప్రేక్షకుల మనసులకు బలంగా తాకే  సినిమా. అలాగే పాత్ బ్రేకింగ్ మూవీ కూడా. ఒక సినిమా చూస్తున్నపుడు ఏదో ఒక దశలో ఇది ఫలానా సినిమాలా ఉందే.. అంటూ మన తలపుల్లోకి వేరే సినిమాలేవో గుర్తుకు రాకుండా పోవు. ‘అర్జున్ రెడ్డి’ అలాంటి భావన కలిగించదు. ఇదో రకం సినిమాలాగా అనిపిస్తుంది. ఈ సినిమాకు ఎంతమంది కనెక్టవుతారన్నది సందేహమే కానీ.. ఆ కనెక్టయిన వాళ్లు మాత్రం సినిమా చూస్తున్నంతసేపూ ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోయేంతలా డిస్టర్బ్ చేస్తుంది ‘అర్జున్ రెడ్డి’.

ప్రేక్షకుకులకు భిన్న అభిరుచులు ఉంటాయి. అందరూ ఒకలా ఉండరు. ‘అర్జున్ రెడ్డి’ కొందరికి అద్భుతంగా అనిపించొచ్చు. కొందరికి భరించలేని విధంగానూ అనిపించొచ్చు. ఒక్క లిప్ లాక్ కే ఆశ్చర్యపోయి అదోలా చూసే ప్రేక్షకులు ఇందులో రెండంకెల సంఖ్యలో ఉన్న ముద్దులకు కంగారెత్తి పోవచ్చు. ముద్దుల్ని ప్రత్యేకంగా కాకుండా.. అదొక మామూలు విషయం అన్నట్లుగా సాధారణీకరించే ప్రయత్నం జరిగింది ‘అర్జున్ రెడ్డి’లో. ముద్దుల విషయంలోనే మాత్రమే కాదు.. మాటల విషయంలో ఇప్పటిదాకా తెలుగు సినిమాలు నడుస్తున్న బాట నుంచి పూర్తిగా బయటికి వచ్చింది ‘అర్జున్ రెడ్డి’. ఇందులో ప్రతి సన్నివేశం.. ప్రతి మాట కొత్తగా అనిపిస్తాయి. ఓ వర్గం ప్రేక్షకులు ఈ కొత్తదనానికి ఫిదా అయిపోతారు. మిగతా వాళ్లు జీర్ణించుకోలేని విధంగానూ ఉంటుంది ఈ కొత్తదనం. ఓవైపు ప్రేమించిన అమ్మాయి దూరమైందని విలవిలలాడిపోతూనే.. ఫిజికల్ నీడ్ అంటూ దొరికిన ప్రతి అమ్మాయితోనూ శృంగారం నడిపే కథానాయకుడి పాత్ర చిత్రణను ఎంతమంది జీర్ణించుకుంటారన్నదీ సందేహమే.

ఒక్క విషయం స్పష్టం. ‘అర్జున్ రెడ్డి’ రుచిస్తుందా లేదా అన్నది కొన్ని నిమిషాల్లోనే తేలిపోతుంది. ఆరంభంలోనే కథానాయకుడి పాత్రకు.. నరేటివ్ స్టైల్ కు కనెక్టయ్యామంటే బండి సాఫీగా సాగిపోతుంది. లేదంటే ఆరంభంలోనే తేడా కొట్టేస్తుంది. ఇది రుచించిన వాళ్లు పోను పోను మరింత డీప్ గా కనెక్ట్ అయిపోతారు. అర్జున్ రెడ్డితో కలిసి ట్రావెల్ చేస్తారు. అలా కాని వాళ్లకు ముందుకు సాగేకొద్దీ భరించలేని పరిస్థితికి చేరుకుంటారు. ఈ సినిమా టీజర్.. ట్రైలర్ చూసి ఏది ఆశించి థియేటర్లకు వస్తారో అది అయితే దక్కుతుంది.  ‘అర్జున్ రెడ్డి’తో కనెక్టయితే  మొదలైన కాసేపటికే మనం సినిమా చూస్తున్న భావన నుంచి బయటికొచ్చేస్తాం. ‘అర్జున్ రెడ్డి’ లోకంలోకి వెళ్లిపోతాం. ఒక వ్యక్తి మనకు పరిచయమై తన కథను మనకు విజువలైజ్ చేసి చూసిన భావనలోకి వెళ్లిపోతాం. అర్జున్ రెడ్డి కోపం చూసి భయపడతాం. అతడి ప్రేమను అనుభూతి చెందుతాం. అతడి బాధను మనమూ అనుభవిస్తాం. అతడి జీవితం దారి తప్పి పోతుంటే.. అయ్యో అనుకుంటాం. అతడి కథ సుఖాంతం అవుతుంటే ఉద్వేగానికి గురవుతాం.

ప్రతి సన్నివేశాన్నీ ఓ ఇంటెన్సిటీతో తీసే ప్రయత్నం చేసిన దర్శకుడు.. ఈ కథకు అత్యంత కీలకమైన ప్రేమకథను సరిగా తీర్చిదిద్దలేకపోయాడు. హీరో అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోవడం ఓకే. కానీ ఆ అమ్మాయికి ఇతనెందుకు నచ్చుతాడన్నది అర్థం కాదు. అసలు పరిచయమైన కొన్ని గంటల్లోనే హీరో వచ్చి ముద్దు పెట్టేస్తుంటే హీరోయిన్ ఏ చలనం లేకుండా కనిపిస్తుంది. కేవలం శారీరక సంబంధం ద్వారానే వీరి ప్రేమలోని గాఢతను చూపించే ప్రయత్నం చేయడం నిరాశ కలిగిస్తుంది. శృంగారం ప్రేమను తెలియజేయడానికి ఒక మార్గమే తప్ప.. అదొక్కటే మార్గం కాదు. బైక్ మీద ముద్దాడుతూ.. యాక్సిడెంట్ అయ్యి.. ఆ తర్వాత కూడా తమకు ఏమైందో పట్టించుకోకుండా ముద్దుల్లో మునిగిపోయేంత ఇంటెన్స్ లవ్ అన్నట్లుగా చూపించిన దర్శకుడు.. ఈ శృంగార భావనలేమీ లేకుండా వీళ్ల ప్రేమలోని ఇంటెన్సిటీని చూపించే ఒక్క సన్నివేశాన్నీ తీయలేదు. దీంతో ప్రధాన పాత్రల మధ్య ఉన్నది ప్రేమ బంధమా.. కామ బంధమా అన్న సందేహం కూడా కలుగుతుంది.

అలాగే హీరో హీరోయిన్ల శారీరక బంధాన్నే ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసిన దర్శకుడు.. హీరోయిన్ హీరోకు దూరమయ్యాక కూడా అతను ఆ శారీరక బంధం కోసమే తపించేలా.. కనిపించిన ప్రతి అమ్మాయితోనూ శృంగారం నెరిపేలా చూపించడంతో ఇక్కడసలు నిజమైన ప్రేమ ఎక్కడుందనే డౌట్ వస్తుంది. ద్వితీయార్ధమంతా హీరో వ్యసనాల మీదే ఎక్కవగా దృష్టిసారించడంతో కథనం ఒకింత సాగతీతగా.. బోరింగ్ గానూ అనిపిస్తుంది. ఐతే దర్శకుడు సందీప్ సినిమా అంటే ఇలాగే ఉండాలి.. అనే ఆలోచనల్ని అడుగడుగునా బ్రేక్ చేస్తూ చాలా వినూత్నంగా కథాకథనాల్ని నడిపించాడు. ఇందులో ప్రతి సన్నివేశం ఒక కొత్త అనుభూతిని పంచుతుందనడంలో సందేహం లేదు. అర్జున్ రెడ్డి పాత్రను ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో.. భావోద్వేగాల్ని బలంగా చూపించడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. ఈ తరం అర్బన్ యూత్ ఆలోచనలకు అద్దం పట్టేలా అతను ‘అర్జున్ రెడ్డి’ని తీర్చిదిద్దాడు.

సినిమా అంతటా కూడా రాజీ అన్నదే లేకుండా తాను ఏం నమ్మాడో అది చూపిస్తూ వెళ్లిన సందీప్.. ముగింపు విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయిపోయాడనిపిస్తుంది. చాలా వాస్తవికంగా సాగే కథ చివర్లో మాత్రం సినిమాటిక్ ముగింపుతో.. అప్పటిదాకా ఈ సినిమాను ఒక కోణంలో చూస్తున్న ప్రేక్షకుల్ని ఒకింత నిరాశ కలిగిస్తుంది. ఇలాంటి భిన్నమైన సినిమాలో అలాంటి రొటీన్ క్లైమాక్స్ ఊహించలేం. ముగింపు బాగోలేదని కాదు కానీ.. మధ్యలోనే ప్రేక్షకుల్ని ఒక శైలికి అలవాటు పడేలా చేసి.. దేనికైనా సిద్ధంగా ఉండమని సంకేతాలిచ్చిన దర్శకుడు.. చివరికి కథను సుఖాంతం చేయడానికి నాటకీయమైన ముగింపు వైపు మళ్లడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ‘అర్జున్ రెడ్డి’లో లోపాలున్నాయి. కానీ ‘అర్జున్ రెడ్డి’ ఒక పాత్ బ్రేకింగ్ మూవీ అనడంలో మాత్రం సందేహం లేదు. అర్బన్ యూత్ కు బాగా కనెక్టయ్యే ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు రుచించకపోవచ్చు. ఇందులోని అడల్ట్ కంటెంట్ దృష్ట్యా ఫ్యామిలీ ఆడియన్స్ కూ కష్టమే.

నటీనటులు:

విజయ్ దేవరకొండ నటన చూస్తే ఓ పాత్రను ఎవరైనా ఇంతలా ఓన్ చేసుకుంటారా అన్న సందేహం కలుగుతుంది. తెరమీద విజయ్ కాకుండా అర్జున్ రెడ్డి మాత్రమే కనిపిస్తాడు. అర్జున్ అనేవాడు నిజంగా ఉన్నాడు.. అతను.. విజయ్ ఒక్కడు కాదు అనిపించేంత ఇంపాక్ట్ కలిగించాడు ఈ కుర్రాడు. ఫలానా సన్నివేశం అని కాకుండా ఒక సినిమా అంతటా కూడా అతను అర్జున్ రెడ్డిలా జీవించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మరీ ఎంచి చెప్పాలంటే తనపై కేసుకు సంబంధించి హౌస్ కోర్టులో విచారణ జరిగినపుడు తీవ్ర మానసిక సంఘర్షణకు లోనై బరస్ట్ అయ్యే సన్నివేశం స్టాండ్ ఔట్ గా నిలుస్తుంది.  హీరోయిన్ షాలినిది భావోద్వేగాలు బయటపడనివ్వని పాత్ర. ఆమెకు మాటలు కూడా చాలా తక్కువ. ఆమె బాగానే చేసింది.

ఇక సినిమాలో హీరో హీరోయిన్ల తర్వాత అత్యంత కీలకమైన పాత్రలో.. చాలా బాగా నటించిన వ్యక్తి రాహుల్ రామకృష్ణ. ‘పెళ్లిచూపులు’లో ప్రియదర్శి లాగా ఇందులో రాహుల్ గ్రేట్ ఫైండ్ అని చెప్పొచ్చు. తెలంగాణ స్లాంగ్ లో డైలాగులు చెబుతూ.. చాలా సహజంగా నటిస్తూ అదరగొట్టేశాడు రాహుల్. అర్జున్ తర్వాత సినిమాలో అత్యంత నచ్చే పాత్ర ఇతడిదే. పెర్ఫామెన్స్ పరంగానూ విజయ్ తర్వాత అతనే నిలుస్తాడు. హీరో అన్నయ్య.. తండ్రి పాత్రల్లో కమల్ కామరాజు.. సంజయ్ స్వరూప్ కూడా బాగా చేశారు. చిన్న పాత్రలో ప్రియదర్శి కూడా మెప్పించాడు. సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై కనిపించిన కాంచన కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు.

సాంకేతికవర్గం:

నటీనటులే కాదు.. సాంకేతిక నిపుణులు కూడా ‘అర్జున్ రెడ్డి’ కథాకథనాల్ని అర్థం చేసుకునే పని చేశారు. రధాన్ మ్యూజిక్.. రాజు తోట ఛాయాగ్రహణం సినిమాలో ఫీల్ ను మరింత పెంచడానికి పనికొచ్చాయి. ‘అందాల రాక్షసి’ ఫేమ్ రధాన్ తనలోని కొత్త కోణాల్ని ఈ సినిమాతో చూపించాడు. సన్నివేశాల్ని ఎలివేట్ చేయడంలో బ్యాగ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో హీరో రోజు రోజుకూ పతనమైపోతున్నపుడు వచ్చే నేపథ్య సంగీతం ప్రత్యేకంగా అనిపిస్తుంది. రాజు ఛాయాగ్రహణం కూడా ఆరంభం నుంచి ఒక ప్రత్యేకమైన మూడ్ క్రియేట్ చేస్తూ సాగింది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కినప్పటికీ సినిమా రిచ్ గా అనిపించడంలో సంగీతం.. ఛాయాగ్రహణం కీలక పాత్ర పోషించాయి.

డైలాగుల విషయంలో గత ఏడాది వచ్చిన ‘పెళ్లిచూపులు’ సృష్టించిన కొత్త ఒరవడిని ‘అర్జున్ రెడ్డి’ కొనసాగించింది. మనకు అలవాటైన సోకాల్డ్ డైలాగుల్లా కాకుండా.. మన ముందు కొందరు వ్యక్తులు సందర్భాన్ని బట్టి సహజంగా మాట్లాడుకుంటున్నట్లుగా అనిపిస్తుంది తప్ప.. ఏ డైలాగ్ కూడా కృత్రిమంగా.. సినిమాటిగ్గా అనిపించదు. ఇక దర్శకుడు సందీప్ రెడ్డి ఔట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాలతో ‘అర్జున్ రెడ్డి’ని నడిపించే ప్రయత్నం చేశాడు. పాత్రలు.. వాటి చిత్రణ.. కథను చెప్పిన విధానంలో అడుగడుతునా సందీప్ రెడ్డి కొత్తదనం చూపించాడు. కాకపోతే అతడి నరేటివ్ స్టైల్ అందరికీ రుచించకపోవచ్చు. సహజత్వం పేరుతో మరీ ఎక్కువ చెడును చూపించాల్సిన అవసరమేముందో ఈ దర్శకుడు ఆలోచించాలి. ఈ విషయంలో కొంచెం కంట్రోల్ చేసుకుని ఉంటే..  ‘పెళ్లిచూపులు’ లాగా ‘అర్జున్ రెడ్డి’ని ఎక్కువమందికి చేరువ చేసే అవకాశం దక్కేది.

చివరగా: అర్జున్ రెడ్డి.. కుర్రాడు కొత్తగా ఉన్నాడు!

రేటింగ్- 3/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre