‘అభిమన్యుడు’

Sat Jun 02 2018 GMT+0530 (IST)

‘అభిమన్యుడు’

చిత్రం : ‘అభిమన్యుడు’

నటీనటులు: విశాల్ - సమంత - అర్జున్ - రోబో శంకర్ - ఢిల్లీ గణేష్ తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా
ఛాయాగ్రహణం: జార్జ్ సి.విలియమ్స్
నిర్మాత: విశాల్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: పి.ఎస్.మిత్రన్

తమిళంలో చిన్న స్థాయి సినిమాలతో మొదలుపెట్టి పెద్ద హీరోగా ఎదిగాడు తెలుగు వాడైన విశాల్. అక్కడ నిలదొక్కుకున్నాక డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులోనూ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కానీ మధ్యలో ఇక్కడ అతడి మార్కెట్ దెబ్బ తింది. ఇప్పుడు తమిళంలో విజయవంతమైన ‘ఇరుంబుతిరై’ను ‘అభిమన్యుడు’గా అనువాదం చేయించి.. మంచి టైమింగ్ చూసి పెద్ద ఎత్తునే రిలీజ్ చేశాడు విశాల్. కొత్త దర్శకుడు పి.ఎస్.మిత్రన్ రూపొందించిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

కరుణ (విశాల్) మిలిటరీలో మేజర్. అతడికి యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. దీంతో సైక్రియాట్రిస్టు అయిన లత (సమంత)ను కలవాల్సి వస్తుంది. ఆ క్రమంలో అతను తన జీవితాన్ని కొత్తగా ఆవిష్కరించుకుంటాడు. అప్పటిదాకా పట్టించుకోని తన కుటుంబం మీద శ్రద్ధ పెడతాడు. కష్టపడి తన చెల్లెలి పెళ్లి చేయడానికి సిద్ధపడతాడు. కానీ చెల్లి పెళ్లి కోసం సమకూర్చుకున్న డబ్బంతా బ్యాంక్ అకౌంట్ నుంచి హఠాత్తుగా మాయమవుతుంది. దీంతో కరుణ దిక్కుతోచని స్థితిలో పడతాడు. ఇంతకీ ఆ డబ్బేమైందో తెలుసుకుందామని ప్రయత్నిస్తే.. దీని వెనుక చాలా పెద్ద నెట్వర్క్ ఉందని తెలుస్తుంది. మరి ఆ నెట్ వర్క్ ఎలా నడుస్తోంది.. దాన్ని నడుపుతున్నదెవరు? వాళ్ల ఆట కరుణ ఎలా కట్టించాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

నిత్యం జనాలతో ముడిపడ్డ సమస్య నేపథ్యంలో కథ ఎంచుకుని సినిమా తీస్తే అది చాలా ఈజీగా ప్రేక్షకులకు కనెక్టయిపోతుంది. కానీ సమస్యను ఎంచుకోవడం ఒకెత్తయితే.. దాని మీద సరైన అవగాహన పెంచుకుని.. వాస్తవిక కోణంలో దాన్ని తెరమీద చూపించడం.. దాన్ని పకడ్బందీగా కథతో ముడిపెట్టడం.. ఆద్యంతం ఆసక్తి రేకెత్తించడం.. సినిమాటిక్ అనుభూతి మిస్సవకుండా చూసుకోవడం.. ఇవన్నీ మరో ఎత్తు. ఇలా అన్ని విధాలా పకడ్బందీగా కుదిరిన సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి సినిమాలు తీసే శంకర్ గొప్ప దర్శకుడిగా ఎదిగాడు. శంకర్ ను అనుకరించిన దర్శకులు చాలామందే ఉన్నారు కానీ.. అతడిలా నైపుణ్యం చూపించి జనాలు కనెక్టయ్యే సినిమాలు తీసిన దర్శకులు కొంతమందే. ఇప్పుడు ‘అభిమన్యుడు’ దర్శకుడిగా పరిచయం అయిన పి.ఎస్.మిత్రన్ ఆ కోవలోకే చెందుతాడు.

స్మార్ట్ ఫోన్ అనేది మెజారిటీ ప్రజల జీవితంలో అంతర్భాగమైపోయిన నేపథ్యంలో ‘అభిమన్యుడు’ సినిమాలో దాంతో ముడిపడ్డ కొన్ని సన్నివేశాలు చూస్తుంటే.. మొబైల్ తో మనం యథాలాపంగా.. పర్యవసానాలు ఆలోచించకుండా చేసే పనులన్నీ గుర్తుకొచ్చి ఒళ్లు గగుర్పొడిస్తే ఆశ్చర్యమేమీ లేదు. రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీతో కలిగే ప్రయోజనాలే చూస్తుంటాం అందరం. కానీ దాని వల్ల కలిగే దుష్పరిణామాల్ని నోరెళ్లబెట్టే రీతిలో చూపిస్తుంది ‘అభిమన్యుడు’. ఐతే ఏదో డాక్యుమెంటరీ తీసినట్లు కాకుండా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ లాగానే ఈ చిత్రం రూపుదిద్దుకోవడం.. సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తూనే ఆలోచన రేకెత్తించడం ఇందులోని ప్రత్యేకత. అసలు కథలోకి వెళ్లడానికి సమయం పట్టడం.. కొన్ని సాధారణమైన ఎపిసోడ్లు ప్రేక్షకుల సహనానికి కొంచెం పరీక్ష పెట్టినా.. అక్కడక్కడా గందరగోళం నెలకొన్నా.. వీటన్నింటినీ మించి ప్రేక్షకుల్ని కట్టిపడేసే అంశాలు ఇందులో ఉన్నాయి. ఇది తప్పక చూడాల్సిన సినిమా అనే స్టేట్మెంట్ పెద్దదేమీ కాదు.

ప్రతినాయకుడి పాత్ర బలంగా ఉంటే.. ఆటోమేటిగ్గా హీరో పాత్ర ఎలివేట్ అవుతుంది. హీరో-విలన్ మధ్య పోరు రసవత్తరంగా సాగితే కథనం కచ్చితంగా రక్తి కడుతుంది. ఇందుకు ‘ధృవ’ సహా చాలా ఉదాహరణలు చూశాం గతంలో. ‘అభిమన్యుడు’కు కూడా అదే పెద్ద బలం. దర్శకుడు హీరో కంటే కూడా విలన్ క్యారెక్టర్ మీదే శ్రద్ధ పెట్టిన విషయం స్పష్టంగా తెలుస్తుంది. కొత్తగా.. ఆసక్తికరంగా అనిపించే పాత్ర అది. పైగా అందులో అర్జున్ లాంటి నటుడుంటే చెప్పేదేముంది? ప్రథమార్ధం వరకు విలన్ అనేవాడు కనిపించకపోయినా.. మొత్తంగా ఒక 40 నిమిషాలు మాత్రమే తెరమీద కనిపించినా.. సినిమా నుంచి బయటికి వచ్చాక హీరో కంటే విలన్ పాత్రే వెంటాడుతుందంటే దాని ప్రత్యేకతేంటో అర్థం చేసుకోవచ్చు. పాత్రలో ఉన్న ఆసక్తికి తోడు వాహ్ అనిపించే అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడవడంతో వైట్ డెవిల్ పాత్ర రక్తి కట్టింది. ప్రథమార్ధం సాదాసీదాగా ఉన్నా.. అసలు కథలోకి వెళ్లే ముందు హీరో రొమాంటిక్ ట్రాక్.. ఫ్యామిలీ ఎపిసోడ్లు సాధారణంగా.. సాగతీతగా అనిపించినా.. అసలు కథ మొదలయ్యాక కథనం రయ్యిన దూసుకెళ్తుంది. విలన్ పాత్ర.. హీరో-విలన్ ఎత్లులు పైఎత్తులు ద్వితీయార్ధాన్ని నడిపించేశాయి. రెండు మూడు చోట్ల విశాల్ మార్కు పవర్ ఫుల్ హీరోయిజం తోడవడంతో ‘అభిమన్యుడు’ మాస్ ప్రేక్షకులూ సంతృప్తి చెందుతారు.

ప్రథమార్ధంలో వేగం లేకపోవడం ‘అభిమన్యుడు’కు బలహీనత అయితే.. ద్వితీయార్ధానికి వేగం ఎక్కువైపోవడం ప్రతికూలంగా మారింది. తొలి అర్ధంలో కోత వేయదగ్గ సీన్లు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా హీరో ఫ్యామిలీ ఎపిసోడ్ నిడివి మరీ ఎక్కువైపోయింది. ఇంటర్వెల్ దగ్గరే ‘అభిమన్యుడు’ సరైన ట్రాక్ లోకి వస్తాడు. ఇక అక్కడి నుంచి సినిమా ఎక్కడా ఆగదు. ద్వితీయార్ధంలో డీటైలింగ్ అవసరమైన చోట.. మరీ స్పీడుగా కథనాన్ని నడిపించేశారు. ఎడిటింగ్ గందరగోళంగా తయారైంది. రెండోసారి డైలాగ్ వింటే కానీ విషయం అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ పక్కన పెడితే ఇందులోని కథాంశంతో మాత్రం మెజారిటీ ప్రేక్షకులు కనెక్టవుతారు. ఈ సినిమా చూశాక మొబైల్ వినియోగంలో.. తమ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునే విషయంలో కచ్చితంగా ఒక భయం పుడుతుంది. ఇకపై జాగ్రత్త పడతారు.

నటీనటులు:

గత కొన్నేళ్లలో విశాల్ సినిమాల ఎంపికే వేరుగా ఉంటోంది. జనాలకు ఈజీగా కనెక్టయ్యే.. థ్రిల్ చేసే కథలు ఎంచుకుని.. కమర్షియల్ గానూ మెప్పించేలా సినిమాలు చేస్తున్నాడు. ఈ కోవలో ‘అభిమన్యుడు’తో మరో మంచి ప్రయత్నం చేశాడు. అతడి సినిమాల ఎంపికకే అభినందించాలి. పెర్ఫామెన్స్ విషయంలోనూ అతడికి మంచి మార్కులు పడతాయి. విలన్ పాత్ర డామినేట్ చేసినప్పటికీ విశాల్ తన ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేశాడు. ఇక అర్జున్ గురించి ఏం చెప్పాలి? అదరగొట్టేశాడంతే. ‘ధృవ’లో అరవింద్ స్వామిలాగా బలమైన ముద్ర వేశాడు. ఇలాంటి పాత్రలు అర్జున్ మరిన్ని చేయాలనిపిస్తుంది. ఆయన స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు పాత్రకు.. సినిమాకు పెద్ద బలంగా నిలిచింది. సమంత ఓకే. ఉన్నంతలో బాగా చేసింది. చాలా అందంగా.. ఆహ్లాదంగా కనిపించింది. హీరో తండ్రి పాత్రలో ఢిల్లీ గణేష్ మెప్పించాడు. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం:

యువన్ శంకర్ రాజా పాటల కంటే నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. సినిమాలోని ఉత్కంఠకు తగ్గట్లుగా చక్కటి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు యువన్. ‘తొలి ప్రేమ’ ఫేమ్ జార్జ్ సి. విలియమ్స్ ఛాయాగ్రహణం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమా రిచ్ గా కనిపిస్తుంది. ఇక దర్శకుడు మిత్రన్.. సినిమా తీయడానికంటే ముందు ఎంత పరిశోధన జరిపాడో.. సినిమాలో చూపించిన అంశాలపై ఎంత అవగాహన పెంచుకున్నాడో స్పష్టంగా తెలుస్తుంది. ఇది కొత్తగా దర్శకులు కావాలనుకునేవాళ్లకే కాదు.. పేరుమోసిన దర్శకులకు కూడా ఒక పాఠమే. దర్శకుడు అందరికీ కనెక్టయ్యే కథాంశాన్ని తీసుకుని.. దాన్ని ఆసక్తికరంగా చెప్పిన తీరు మెప్పిస్తుంది. సినిమా మొత్తంలో ఒకే బిగి చూపించకపోయినప్పటికీ చాలా వరకు బలమైన ముద్ర వేశాడు మిత్రన్.

చివరగా: అభిమన్యుడు.. అలరిస్తాడు.. ఆలోచన రేకెత్తిస్తాడు

రేటింగ్-2.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS