పసుపు ముక్కతో షుగర్ మాయం

Sat Jul 18 2015 23:35:16 GMT+0530 (IST)

చక్కగా చక్కెర వ్యాధి అంటూ తియ్యనైన పేరు పెట్టుకున్న కానీ.. దాని వల్ల పడే కష్టాలేంటో ఆ పేషెంట్లకే తెలుసు. ఏం తినాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఎదురుగా స్వీట్లు ఊరిస్తున్నా నోరు కట్టేసుకోవాలి. అన్నం ఎక్కువ తిన్నా ఇబ్బందే. ఒక్కసారి షుగర్ వచ్చిందంటే జీవితాంతం దాంతో వేగాల్సిందే. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఈ మధ్య చిన్న వయసులోనే షుగర్ బారిన పడిపోతున్నారు జనాలు. శక్తి సామర్థ్యాల్ని సగానికి సగం పడిపోయేలా చేసి మనిషిని నిర్వీర్యం చేసేసే షుగర్ వ్యాధిని నివారించడానికి అనేకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ.. ఫలితాలు అంతంతమాత్రమే. ఐతే పరిశోధనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

ఐతే ఇటీవలే ఆస్ట్రేలియాకు చెందిన న్యూకాజిల్ యూనివర్శిటీలో భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ మనోహర్ గార్గ్ షుగర్ వ్యాధి నివారణకు సంబంధించి ఓ కీలకమైన పరిశోధన చేశారు. ఆయన చెబుతున్న దాని ప్రకారం పసుపుకు షుగర్ నివారించే గుణం ఉందట. ఇందులో ఉండే కర్కమిన్ అనే పదార్థం షుగర్ రాకుండా ఔషధంలా పని చేస్తుంటున్నారాయన. ఇందులో ఒమోగా-3 ఫ్యాట్స్ ఉంటాయని.. ఇవి షుగర్‌పై పోరాడుతాయని.. పసుపు తింటే షుగర్ రాకుండా నివారించవచ్చని... షుగర్ వచ్చిన వాళ్లు కూడా పసుపు తీసుకుంటే షుగర్ తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని ఆయన అంటున్నారు. మామూలుగానే పసుపును ఔషధంలా వాడతాం. దెబ్బలేవైనా తగిలితే పసుపు రాస్తే గాయం త్వరగా మానుతుందన్న సంగతి తెలిసిందే. పసుపు చక్కెర వ్యాధి నివారణిగా కూడా పని చేస్తుందంటే అది అందరికీ సంతోషం కలిగించే విషయమే. తన పరిశోధనలు పూర్తయ్యాక దీనిపై పూర్తి నివేదిక ఇస్తానని అంటున్నారు ఆ ప్రొఫెసర్. చూద్దాం ఆయన కంక్లూజన్ ఎలా ఉంటుందో.