మానసిక ఒత్తిడి ఒకింత మంచిదే..!

Tue Jul 21 2015 12:19:48 GMT+0530 (IST)

స్ట్రెస్ మేనేజ్ మెంట్.. నేటి జీవన శైలిలో అందరూ నేర్చుకోవాల్సిన అంశం అయిపోయింది. ఇదొకు పట్టు సాధించాల్సిన సబ్జెక్టు అయిపోయింది. నేటి తరం వృత్తులు.. ఎదుర్కొంటున్న సమస్యలు.. మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయని విశ్లేషిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి మానసిక ఒత్తిడులు అనేవి ఒకింత మంచివే..అని కూడా మరికొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఊరికి తిని తొంగొంటే.. మనిషికీ గొడ్డుకీ తేడా లేదన్నట్టుగా.. ఏ మాత్రం ఒత్తిడి లేకపోయినా మనిషి జీవితానికి సార్థకం లేదని అంటున్నాయి ఈ విశ్లేషణలు.

ఒత్తిడి అనేది అనేక వ్యాధులకు కారకం అవుతోంది. క్యాన్సర్ నుంచి జుట్టూడిపోవడం వరకూ అనేక అనారోగ్య ఇబ్బందులకు కారణం ఒత్తిడే అని సూత్రీకరించే వాళ్లు ఉన్నారు. అయితే తీవ్రమైన ఒత్తిడి వల్ల అలాంటి అనర్థాలు ఉన్నా.. కాస్తంత ఒత్తిడి ఉండటం వల్ల మాత్రం కొన్ని ప్రయోజనాలున్నాయి. అవేమిటంటే... ఒత్తడి అనేది విజయం వైపు తీసుకెళుతుంది అనేది నంబర్ వన్ పాయింట్. జీవితలక్ష్యాన్ని సాధించడంలో అయినా.. లేక చిన్న టాస్క్ ను కంప్లీట్ చేయడం లో అయినా.. కొంత ఒత్తిడి టైమ్ బౌండ్ ఉండటం వల్ల మనిషి ఎక్కువగా శ్రమించే అవకాశాలుంటాయి. ఈ ఒత్తిడి మనిషిని ఎక్కువగా కష్టపడేలా చేస్తుంది. విజయం దిశగా నడిపిస్తుంది.

అలాగే కొంత మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగు పరిచే కణాలు ఉత్పత్తి అవుతాయని వైద్య శాస్త్ర పరిశోధనల్లో తేలింది. ఒక మనిషి ఉద్యోగ లేదా వ్యాపార జీవితంలో ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటే అతడితో ఇంట్లో వాళ్ల బంధం పెరుగుతుందనేది మరో అధ్యయనం చెబుతున్న మాట. మనిషి కష్టపడుతుండటం.. వల్ల ఇంట్లో వాళ్లకు అతడి మీద ప్రేమానురాగాలు పెరుగుతాయని ఇది కూడా ఒత్తిడి వల్ల కలిగే సానుకూల ఫలితమేనని ఈ అధ్యయనకర్తలు విశ్లేషిస్తున్నారు.

స్ట్రెస్ ను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మనుషుల్లో చురుకుదనం పెరుగుతుందని...  సమస్యల పరిష్కారానికి కొత్త శక్తి వస్తుందని.. చాకచక్యంగా వ్యవహరించే నేర్పు సమకూరుతుందని ఒకవేళ మెంటల్ గా ఎలాంటి స్ట్రెస్ లేకపోతే.. మానసికంగా చాకచక్యంగా తీరును మనిషి మరిచిపోవచ్చు కూడా! కాబట్టి ఒత్తిడి ఒకింత మంచిదే అనుకోవాలి. అయితే మరీ ఎక్కువ స్ట్రెస్ ను మాత్రం నెత్తికెత్తుకోకూడదు సుమా!