Begin typing your search above and press return to search.

చైనాలో కొత్త పిచ్చి; బతికుండగానే కీచైన్ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   11 Aug 2015 6:06 AM GMT
చైనాలో కొత్త పిచ్చి; బతికుండగానే కీచైన్ చేస్తున్నారు
X
అనుకుంటాం కానీ ప్రకృతిలో అత్యంత క్రూరమైన జీవి ఏదైనా ఉందంటే అది మనిషి మాత్రమే. తన అవసరం కంటే కూడా ఆనందం కోసం అతగాడు చేసే పనులు చూసినప్పుడు.. మరీ ఇంత రాక్షసమా అనిపించక మానదు. సాటి జీవుల పట్ల ఎలాంటి బాధ్యత లేకుండా వ్యవహరించటం.. తన ఆనందం కోసం చిన్నచిన్న జీవుల ప్రాణాలతో చెలగాటాలడటం మనిషికి మాత్రమే సాధ్యమేమో.

తాజాగా.. చైనాలో నడుస్తున్న ట్రెండ్ చూస్తే.. ముక్కున వేలేసుకోవాల్సిందే. సాధారణంగా కీచైన్లు అన్న వెంటనే అయితే ప్లాస్టిక్.. లేదంటే వుడ్.. కాదంటే మెటల్ తోనూ రూపొందించినవి వాడేయటం మామూలే. కానీ.. చైనాలో మాత్రం లేటెస్ట్ గా సరికొత్త కీచైన్ లు వచ్చేశాయి. ఈ కీచైన్ లు బతికున్న చిన్న చిన్న జీవులతో తయారు చేస్తుండటం గమనార్హం.

బుజ్జి.. బుజ్జి తాబేళ్లు (బతికి ఉన్న వాటితోనే) ను కీచైన్ లుగా వినియోగిస్తున్న వారి సంఖ్య ఈ మధ్య పెరిగిపోయింది. ఈ పిచ్చ ఎంత ఎక్కువైందంటే.. రైల్వేస్టేషన్లు.. బస్టాండ్ల దగ్గర పప్పు బెల్లాలు అమ్మినట్లుగా అమ్మేస్తున్నారు.

ప్రాణం ఉన్న తాబేళ్లను కీచైన్లుగా ఎలా తయారు చేస్తున్నారన్న డౌట్ రావొచ్చు. ఆ విషయంలోకి వెళితే.. ఒక ప్లాస్టిక్ కవర్లో.. ఆక్సిజన్.. వాటికి అవసరమైన విటమిన్లతో కూడిన నీటిని నింపేస్తున్నారు. ఆపై చిన్న చిన్న తాబేళ్లను వాటిల్లో పెట్టేసి ప్యాక్ చేసేస్తున్నారు. కావాల్సిన ఆకారాల్లో మార్చేసి కీచైన్లుగా మార్చేస్తున్నారు.

ఈ మధ్య బాగా పెరిగిన ఈ కల్చర్ పై చైనాలో విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. మరోవైపు పర్యావరణ వేత్తలు మాత్రం ఈ ట్రెండ్ పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే రీతిలో పోతే.. తాబేళ్లు కనిపించకుండా పోతాయాని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కీచైన్ల వ్యాపారాన్ని దారుణమైన.. క్రూరమైన జీవహింసగా పలువురు అభివర్ణిస్తున్నారు.

జంతుప్రేమికుల మాటల్ని లైట్ తీసుకుంటున్న చైనీయులు.. ఈ తాబేళ్ల కీ చైన్లను విపరీతంగా ఆదరిస్తున్నారట. దీంతో.. చైనాలో ఇదో కుటీర పరిశ్రమగా మారిపోయిందని చెబుతున్నారు. తమకు కాసులు కురిపించే వాటిని.. మనిషి ఎందుకు వదిలిపెడతాడు..?