Begin typing your search above and press return to search.

ఇలా చేస్తే చుండ్రు మాయం

By:  Tupaki Desk   |   5 July 2015 4:39 PM GMT
ఇలా చేస్తే చుండ్రు మాయం
X
తెలుగులో చుండ్రు.. ఇంగ్లిష్‌లో డాండ్రఫ్‌.. ఇది పెట్టే చికాకు అంతా ఇంతా కాదు. జుట్టు బలహీనంగా తయారై రాలిపోవడమే కాదు.. మన నుంచి ఇతరులు దూరంగా పారిపోయేలా చేస్తుంది. డాండ్రఫ్‌ షాంపూలు ప్రకటనల్లో చూపించినంత ప్రభావం నిజంగా చూపించవు. మరి డాండ్రఫ్‌ పోవాలంటే ఏం చేయాలి? కొన్ని చిట్కాలు పాటిస్తే చుండ్రు గుడ్‌బై చెప్పేసి వెళ్లిపోవడం ఖాయం. ఆ చిట్కాలేంటో చూద్దాం పదండి.

! రెండు మూడు నిమ్మకాయ తొక్కలు తీసుకుని.. ఐదారు కప్పుల నీటిలో 15-20 నిమిషాల పాటు ఉడికించాలి. చల్లార్చాక ఈ నీటితో తలను శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒక్కసారి చేయాలి.

! రెండు టేబుల్‌ స్పూన్‌ల మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. తర్వాతి రోజు ఉదయం వాటిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌గా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి.

! స్నానానికి వెళ్లే ముందు నిమ్మకాయ రసాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేసినా ప్రయోజనం ఉంటుంది. ఇది రెగ్యులర్‌గా చేయాలి.

! వెనిగర్‌, నీళ్లు సమపాళ్లలో తీసుకుని.. నిద్రపోయే ముందు తలకు పట్టించాలి. తర్వాతి రోజు ఉదయం నిద్ర లేచాక తేలికపాటి బేబీ షాంపుతో తలస్నానం చేయాలి.

! జుట్టుకు పెరుగు పట్టించి గంటపాటు వదిలేయాలి. గంట తర్వాత తేలికపాటి షాంపూతో స్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయాలి.

! తలకు గుడ్డులోనితెల్లసొనను పట్టించి గంట తర్వాత తేలికపాటి షాంపూతో స్నానం చేయాలి. ఇది చుండ్రును అరికట్టడంతో పాటు హెయిర్‌ఫాల్‌ను కూడా తగ్గిస్తుంది.

! బాదం నూనె, కొబ్బరినూనె లేదా ఆలివ్‌ ఆయిల్‌ను కొంచెం వేడి చేసి.. గోరువెచ్చగా ఉన్నపుడు తలకు మసాజ్‌ చేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం తలస్నానం చేయాలి.

! అలోవీరా జెల్‌ తలమాడుకు బాగా మర్దనా చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

! ఒక టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసానికి ఐదు టేబుల్‌ స్పూన్‌ల కొబ్బరి నూనె మిక్స్‌ చేసి బాగా గిలక్కొట్టి తలమాడుకు, జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

! వేపాకులను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌ చేసి.. తలకు పట్టించాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. తులసి ఆకుల పేస్ట్‌ కూడా బాగానే పని చేస్తుంది.

! వెల్లుల్లి పేస్ట్‌కు నిమ్మరసం కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత చల్లటినీటితో తలస్నానం చేసినా ఫలితముంటుంది.

! షాంపూకన్నా శీకాకాయతో స్నానం చేయడం చాలా మంచిది. ఇది నేచురల్‌ డాండ్రఫ్‌ ట్రీట్‌మెంట్‌కు పనికొస్తుంది.