ఫోకస్: ఇదో ట్రెండు గురూ

Sat Jul 25 2015 11:46:07 GMT+0530 (IST)

ఇటీవలే భజరంగి భాయిజాన్ రిలీజై రికార్డులు తిరగరాసింది. ఈ సినిమాలో సల్మాన్ అనుసరించిన స్టయిల్స్ పెద్ద రేంజు లో చర్చకొచ్చాయి. ముఖ్యంగా లాకెట్ లాంటి ఓ పెండెంట్ అతడి మెడలో వేలాడుతూ యువతరం దృష్టిని ఆకర్షించింది. అదే క్రేజును ఓ ఆన్ లైన్ పోర్టల్ తెలివిగా క్యాష్ చేసుకుంది. పెండెంట్లను ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టి భారీగా సొమ్ములు చేసుకుంది. ఇలాంటి విషయాల్లో ఓమారు మన హీరోల ట్రాక్ రికార్డు పరిశీలిస్తే..

పవన్ కల్యాణ్ 'బాలు'గా కనిపించిన స్టయిల్ ఇప్పటికీ హాట్ టాపిక్. ఫ్యాంటుపై ఫ్యాంటు తొడిగి ఫ్యాంటంతా జేబులతో అదో వెరైటీ డ్రెస్ అంటూ చెప్పుకున్నారు యూత్. అంతేకాదు కొందరు దాన్ని యథావిధిగా ఫాలో చేసేశారు. పోకిరి సినిమా వచ్చాక మహేష్ డబుల్ షర్ట్ ఫార్ములా బాగా వర్కవుటైంది. టీషర్లు ని షర్టుతో కలిపి కుట్టేశారు కూడా. ఆ ట్రెండ్ చాలా కాలం పాటు అప్పటి యువతరాన్ని వెంటాడిందంటే అతిశయోక్తి కాదు. అలాగే బన్నీ స్టయిలిష్ స్టార్ అన్న పేరు తెచ్చుకున్నది అతడు తొడుక్కునే డ్రెస్సుల వల్లే. దుబాయ్ హాంగ్ కాంగ్ లండన్ లాంటి ఖరీదైన నగరాల నుంచి సరికొత్త బ్రాండెడ్ డ్రెస్సుల్ని కొని తెచ్చుకుంటాడు. అందులో రకరకాల రంగులు ఉన్నవి దుస్తులు యాక్సె సరీస్ యూత్ పల్స్ ను పట్టేస్తుంటాయి. ఆ తర్వాత వాటినే షాపుల్లో కొనుక్కోవడానికి ఎగబడిన సందర్భాలున్నాయి.

ఇక స్టయిల్ విషయంలో నాగార్జున ఓ ఐకన్. అతడు హలో బ్రదర్ టైమ్ లో సరికొత్త హెయిర్ స్టయిల్ తో కనిపించి ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు. తర్వాత ఆ లుక్ కోసం యూత్ పిచ్చెక్కిపోయారు. ఫలితం బార్బర్ షాపులన్నీ క్షణం తీరిక లేనంత గా కిటకిటలాడాయి. అంతేకాదు నాగార్జున ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ ని ఫాలో చేసే హీరో. అతడు తొడుక్కునే డ్రెస్సులు జీన్స్ గాగుల్స్ ప్రతిదీ యువతరంలో హాట్ టాపిక్. ఇటీవలే ఫ్రెంచి కట్ గెడ్డంతో కనిపించి యువతరంలో ఫీవర్ రాజేశారు నాగ్. ఆ స్టయిల్ ని ఇప్పటికీ యూత్ ఇమ్మిటేట్ చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో.. ఎన్నెన్నో