చౌకబేరం; పాతిక వేల కిందకు పడిపోయింది

Tue Jul 21 2015 21:04:35 GMT+0530 (IST)

రోజురోజుకీ పడిపోతున్న బంగారం మంగళవారం మరింత పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ లో చోటు చేసుకున్న పరిణామాలతో బంగారం ధర మరింత పడిపోయింది. మంగళవారం నాటి సెషన్ లో పది గ్రాముల బంగారం రూ.25వేల కిందకు పడిపోయింది.

సోమవారం ముగింపుతో పోలిస్తే.. పది గ్రాములకు రూ.81 తగ్గి.. రూ.24953కు పడిపోయింది. 2013 ఆగస్టు తర్వాత ఇంతలా బంగారం ధర పడిపోవటం ఇదే తొలిసారి. బంగారంతో పాటు.. వెండి ధర కూడా తగ్గింది. మంగళవారం నాటి మార్కెట్ ముగిసే సమయానికి కిలో వెండి ధర రూ.34062కు చేరింది.  డాలర్ బలపడటం.. చైనాలో బంగారం కొనుగోళ్లు తగ్గటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.

మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం.. బంగారం ధర మరింత తగ్గే వీలుందని చెబుతున్నారు. వాస్తవానికి.. విదేశాలతో పోలిస్తే భారతదేశంలో పది గ్రాముల బంగారం రూ.3 వేల వరకు ధర అధికంగా ఉంది. ఎక్సైస్ సుంకం.. పన్నులు అన్నీ కలుపుకోవటం వల్ల ఈ ధర ఉంది కానీ.. అలాంటివేమీ లేకపోతే.. మరింత తక్కువకే బంగారం లభించాల్సిన పరిస్థితి.