ఆ కార్డు ఉంటే.. ఫ్రైడే జర్నీలన్నీ ఫ్రీ..?

Thu Aug 06 2015 11:18:52 GMT+0530 (IST)

డిజిటల్ యుగంలో అసాధ్యం అన్నది ఏదీ లేదు. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా.. జేబులోని నుంచి పైసా తీయకుండా.. కాస్తంత తెలివితేటలు.. మరికాస్త ట్రెండ్ మీద అవగాహన ఉండాలే కానీ.. బండి లాగించే అవకాశాలు చాలానే ఉన్నాయి.

వ్యాపారం పెంచుకోవటం కోసం వాణిజ్య సంస్థలు విచిత్రమైన ఆఫర్లు పెట్టటం.. వాటితో వచ్చే ప్రచారంతో తమ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచుకోవటంతో పాటు.. అమ్మకాలను మరింత వృద్ధి చేసుకోవటం ఇప్పుడో వ్యూహంగా మారిపోయింది. కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇచ్చే కన్నా.. ఉక్కిరిబిక్కిరి పెట్టే విచిత్రమైన ఆఫర్లు పెట్టి.. అందరి నోళ్లలో నానటం ఇప్పుడు తాజా వ్యాపార సూత్రంగా మారిపోయింది.

సింగపూర్ కు చెందిన ఓ క్రెడిట్ కార్డుల కంపెనీ తాజాగా ప్రకటించిన ఆఫర్ వింటే అదిరిపోవాలి. అయ్యో.. మనకు అవకాశం లేదే అని తెగ ఫీలైపోవాలి. ఇంతకీ ఆ ఆఫర్ ఏమిటన్న డిటైల్స్ లోకి వెళితే..

సింగపూర్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్ని పురస్కరించుకొని పీవోఎస్ బీ అనే బ్యాంక్.. ఫేర్ ఫ్రీ ఫ్రైడే అనే ఆపర్ పెట్టింది. ఈ ఆఫర్ గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే.. ఈ బ్యాంకు జారీ చేసే క్రెడిట్ కార్డు చేతిలో ఉండాలే కానీ.. ఒక ఏడాది పాటు ప్రతి శుక్రవారం రైళ్లు.. బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు ఇవ్వటం.

ఈ ఆఫర్ ను జూలై 31 నుంచి డిసెంబర్ 25తో క్లోజ్ చేయనున్నారు. అయితే.. ఈ ఆపర్ ను కేవలం లక్ష మందికి మాత్రమే పరిమితం చేయనున్నట్లు చెప్పిన బ్యాంకు మరింత ఊరిస్తోంది. తాజాగా ఆఫర్ విన్న వారంతా.. సదరు బ్యాంకు క్రెడిట్ కార్డు తీసుకునేందుకు తెగ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారంట. ఆఫర్ అదిరిపోవాలే కానీ.. సొంతం చేసుకోవటానికి ఎవరికి మాత్రం ఉత్సాహం ఉండదు చెప్పండి.