సెలబ్రిటీల ఇంటి బడ్జెట్: సరదాగా కోట్లు పెట్టేస్తారు!

Sat Jul 11 2015 10:59:25 GMT+0530 (IST)

సంపాదించే వాడే ఖర్చు పెట్టడానికి అర్హుడు.. అనేది పెద్దలు చెప్పిన మాట. మరి ఈ లెక్కన బాగా సంపాదించే వాళ్లు బాగా ఖర్చు పెట్టుకోవడానికి అర్హులనమాట. ఈ అర్హత కలిగిన సెలబ్రిటీలు ఎంచక్కా ఖర్చు చేసుకొంటున్నారు. తమ అవసరాల కోసం. దర్పం కోసం వారు కోట్ల రూపాయలు పెడుతున్నారు. ప్రత్యేకించి ఇళ్ల విషయంలో ఖర్చు గురించి అయితే వారు ఏ మాత్రం వెనుకాడటం లేదు. స్థిరాస్తి. శాశ్వతం.. ఏ రోజుకు అయినా అందుకు తగ్గ విలువజేసే ఆస్తి కాబట్టి వీళ్లు ఇళ్ల విషయంలో రెండో ఆలోచనలేకుండా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు.

మరి ఇటీవల ముంబైలో ఇళ్లను కొన్న సెలబ్రిటీల విషయంలో గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ మధ్యనే ముంబైలోని ఖరీదైన జూహూ ప్రాంతంలో ఇళ్లను కొన్న వారు పెట్టిన ఖర్చు జాబితా ఇది...

రామ్‌చరణ్ తేజ్ - ఆరు కోట్ల రూపాయలు

కత్రినాకైఫ్- పదిహేను కోట్ల రూపాయలు

విద్యాబాలన్- 14 కోట్ల రూపాయలు

వీళ్లు ముగ్గురూ ఈ మధ్యనే ముంబైలోని జూహూలో ఫ్లాట్స్‌ను కొన్నారు. ముంబైలో ఇళ్లు ఉండాలన్నట్టుగా చరణ్ ఆరు కోట్ల రూపాయల్లో ఫ్లాట్ కొనగా.. కత్రినా విద్యాలు మాత్రం భారీ స్థాయిలో డబ్బు పెట్టి ఇళ్లను కొన్నారు! కత్రినా హీరోయిన్‌గా పీక్‌స్టేజిలో ఉంది. కోట్ల రూపాయల పారితోషకం అందుకొంటోంది. దీంతో ఆమెకు పదిహేను కోట్ల రూపాయలు ఫ్లాట్ కోసం వెచ్చించడం పెద్ద కష్టం కాలేదు.

ఇక విద్యాబాలన్‌కు మాత్రం భర్త గిఫ్ట్‌గా ఇచ్చాడు. పద్నాలుగు కోట్ల రూపాయలు పెట్టి ఫ్లాట్‌ను కొనుగోలు చేసి సిద్ధార్థ్‌రాయ్ ఆమెకు ఆ నివాసాన్ని బహుకరించారు. ఎంతైనా ఆయన యూటీవీ పిక్చర్స్ సీఈవో కదా.. ఆ స్థాయి బహుమానం సహజమేనేమో!