Begin typing your search above and press return to search.

కడప నుంచే షర్మిల పోటీ...అన్న మీదేనా....!?

వైఎస్ షర్మిల ఎక్కడ నుంచి పోటీ ఈ ప్రశ్న మీడియా వేస్తోంది. అంతే కాదు సాటి రాజకీయ పార్టీల నుంచి వస్తోంది.

By:  Tupaki Desk   |   18 March 2024 9:43 AM GMT
కడప నుంచే షర్మిల పోటీ...అన్న మీదేనా....!?
X

వైఎస్ షర్మిల ఎక్కడ నుంచి పోటీ ఈ ప్రశ్న మీడియా వేస్తోంది. అంతే కాదు సాటి రాజకీయ పార్టీల నుంచి వస్తోంది. షర్మిల ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్నారు. అసలు ఆమె వైసీపీ ద్వారానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆమె 2014లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తారు అని మొదట ప్రచారం సాగింది. కానీ అది జరగలేదు.

ఇక 2019లో ఆమె కడప ఎంపీగా పోటీ చేస్తారు అని చివరాఖరు దాకా ప్రచారం సాగింది. ఆ విషయంలో ఆమెను ఒప్పించేందుకే ఆమె చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి ఆమె ఇంటికి వెళ్ళి మరీ గంటల తరబడి మాట్లాడారు అని ఆయన అయిదవ వర్ధంతి వేళ షర్మిల చెప్పారు. ఇక ఆ తరువాత వైఎస్ వివేకా మరణించారు.

మరో వైపు చూస్తే షర్మిలకు రాజకీయాల్లోకి రావాలని ఉందని గతంలో తెలియలేదు. కానీ ఆమె ఎపుడైతే 2021లో పార్టీ పెట్టి తెలంగాణాలో పర్యటించారో అప్పటి నుంచి ఆమెకు ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభలలో ఉండాలన్న కోరిక ఉందని అంతా అనుకున్నారు.

ఇక ఆమె తెలంగాణా ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తారు అని అంతా అనుకున్నారు. ఆమె కూడా పాలేరు గడ్డ మీద ఒట్టు అక్కడ నుంచి తాను పోటీ చేస్తాను అని చెప్పారు. కానీ చివరికి ఆమె పోటీ చేయలేదు,అంతే కాదు ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇదిలా ఉంటే వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు.

ఆనాటి నుంచి ఆమె ఎక్కడ పోటీ చేస్తారు అన్న ప్రశ్నలే వచ్చాయి. ఆమె ఏపీలో వైసీపీని గద్దె దించాలని చూస్తున్నారు. పైగా ఆమె సొంత జిల్లా కడప కాబట్టి అక్కడ నుంచి పోటీ చేస్తారు అని కూడా అనుకున్నారు. ఇక్కడ కూడా మరో ప్రశ్న వచ్చింది. ఆమె పోటీ చేసేది ఎమ్మెల్యేగానా లేక ఎంపీగానా అన్నది.

అయితే దాని మీద ఇపుడే కొంత క్లారిటీ వస్తోంది. వైఎస్ షర్మిల కడపనుంచి ఎంపీగా పోటీ చేస్తారు అని అంటున్నారు. కడప ఎంపీ టికెట్ ని వైసీపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇచ్చింది. ఆయన ఇప్పటికి రెండు సార్లు కడప నుంచి ఎంపీగా గెలిచారు.

ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొడతాను అన్న ధీమాలో ఉన్నారు. ఆయన మీద వైఎస్ సునీతతో పాటు షర్మిల ఆరోపణలు చేసినా కూడా జగన్ ఆయనకే ఎంపీ టికెట్ ఇచ్చారు అన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఇపుడు ఆయన మీద షర్మిల పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారు అని అంటున్నారు. వైఎస్ సునీతను కానీ ఆమె తల్లి సౌభాగ్యమ్మను కానీ పోటీ చేయమని కోరారు అని అంటున్నారు.

కానీ సౌభాగ్యమ్మ పోటీకి సిద్ధంగా లేరు అని అంటున్నారు. ఇక సునీత పోటీ చేస్తే పులివెందుల నుంచి అసెంబ్లీకి చేయవచ్చు అని అంటున్నారు. లేకపోతే లేదు అని అంటున్నారు. దాంతో కడప నుంచి వైఎస్ షర్మిలను పోటీ చేయాలని కాంగ్రెస్ హై కమాండ్ కోరిందని అంటున్నారు.

కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తే సీపీఐ సీపీఎం పొత్తులో భాగంగా ఆమెకు మద్దతు ఇస్తాయని అంటున్నారు. వైఎస్ వివేకా హత్య కేసు ప్రభావంతో అవినాష్ రెడ్డిని మరింత కార్నర్ చేయడం ద్వారా ఆయన గెలుపును అడ్డుకోవాలని షర్మిల చూస్తున్నారు అని అంటున్నారు. ఆమెకు సునీత ప్రచారం చేసి పెడతారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తే గెలుస్తారా అన్నది చర్చగా ఉంది.

అధికారంలో వైసీపీ ఉంది. బలం బలగాలు ఉన్నాయి. వైసీపీకి పటిష్టమైన వ్యవస్థ ఉంది. టీడీపీకే కడపలో ఇబ్బందులు ఉన్నాయి. అయితే షర్మిలకు జనం నుంచి వచ్చే స్పందనను బట్టి లోపాయికారిగా టీడీపీ సహా ఇతర పార్టీల సాయం అందుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

మొత్తానికి అన్న వైఎస్ జగన్ మీద నిప్పులు చెరుగుతున్న షర్మిల పులివెందులలో పోటీ చేయకుండా తమ్ముడు అవినాష్ రెడ్డి మీద పోటీకి సిద్ధపడుతున్నారు అని అంటున్నారు.