Begin typing your search above and press return to search.

వైసీపీ ఏం చేస్తుంది? తోటను మారుస్తుందా? పోటీకి అర్హులేనా?

శిరోముండనం కేసు మినహా తోట త్రిమూర్తులు రాజకీయ జీవితంలో పెద్దగా వివాదాలు లేవు.

By:  Tupaki Desk   |   16 April 2024 10:45 AM GMT
వైసీపీ ఏం చేస్తుంది? తోటను మారుస్తుందా? పోటీకి అర్హులేనా?
X

ఉమ్మడి ఏపీ రాజకీయాలను కుదిపేసి.. విభజిత ఏపీలోనూ వివాదాస్పదంగా నిలిచిన శిరోముండనం కేసులో కోర్టు తీర్పు తర్వాత ఏం జరగనుంది...? సాధారణ వ్యక్తులు అయితే ఏం చర్చ లేకుండేది.. ఆ కేసులో శిక్షపడినది దశాబ్దాల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడికి కావడంతోనే ఇప్పుడు ఏం జరగనుందన్న ప్రశ్న వస్తోంది.

1996-2024

1996 డిసెంబరు 29న ప్రస్తుత కోనసీమ జిల్లా, అప్పటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు. ఈ కేసులో అప్పటి టీడీపీ నాయకుడు, ఇప్పటి వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులుగా ఉన్నారు. వీరికి విశాఖపట్టణం కోర్టు మంగళవారం 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2.50లక్షల జరిమానా విధించింది. అలా 28 ఏళ్ల తర్వాత సంచలన కేసులో తీర్పు వెల్లడైంది.

ఇండిపెండెంట్-టీడీపీ-ప్రజారాజ్యం-కాంగ్రెస్-టీడీపీ-వైసీపీ

శిరోముండనం కేసు మినహా తోట త్రిమూర్తులు రాజకీయ జీవితంలో పెద్దగా వివాదాలు లేవు. అయితే, శిరోముండనం అత్యంత దారుణమైన ఘటన కావడంతో వివాదాస్పదంగ మారింది. త్రిమూర్తులు యువకుడిగా ఉండగానే రాజకీయాల్లోకి వచ్చారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాత ఆ పార్టీలో చేరి రామచంద్రపురం నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగారు. 1994లో ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రాపురం టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1995లో మళ్లీ టీడీపీలో చేరారు. 1999లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో పిల్లి సుభాష్ చంద్రబోస్ చేతిలో ఓడిపోయారు. అయితే ,2008లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో ఓటమి చెందారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో పాటు.. సుభాష్ చంద్రబోస్ రాజీనామాతో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.కాగా 2014 రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ చేతిలో ఓడిపోయారు. 2019 సెప్టెంబరులో టీడీపీకి రాజీనామా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2021 జూన్ లో గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితుడయ్యారు.

మండపేటకు మార్పు

సొంత నియోజకవర్గం రామచంద్రాపురం అయినా.. త్రిమూర్తులును ఈసారి వైసీపీ అధినేత, సీఎం జగన్ మండపేట నుంచి బరిలో దింపారు. కోనసీమ జిల్లాలో బలమైన నాయకుడైన త్రిమూర్తులును అలా సర్దుబాటు చేశారు. అయితే, ఇప్పుడు జైలు శిక్ష నేపథ్యంలో ఆయనను మారుస్తారా? అనేది చూడాలి. మరోవైపు ప్రజా ప్రాతినధ్య చట్టం ప్రకారం రెండేళ్లకు మించి శిక్షలు పడినవారే ఎన్నికల్లో పోటీకి అనర్హులు. ఈలెక్కన త్రిమూర్తులుకు పోటీకి అవకాశం ఉన్నట్లే. అయితే, పోటీ నైతికంగా సరైనదా? కాదా? అనేది ఇక్కడ పాయింట్. వైసీపీ ఏం చేస్తుందో చూడాలి.