Begin typing your search above and press return to search.

మరో వివాదంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు!

అల్లూరి సీతారామరాజుజిల్లా కూనవరం మండలంలోని కూటూరులో జరిగిన ఘటన ఇప్పుడు వివాదంగా మారింది.

By:  Tupaki Desk   |   8 April 2024 6:20 AM GMT
మరో వివాదంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు!
X

తరచూ వివాదాల్లో సహవాసం చేసే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి వివాదంలోకి చిక్కుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి వెళ్లిన ఆయన్ను కొందరు గిరిజన యువకులు ప్రశ్నించారన్న కోపంతో ఆయన గన్ మెన్లు.. అనుచరులు వారిని తీవ్రంగా గాయపరిచినట్లుగా ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అల్లూరి సీతారామరాజుజిల్లా కూనవరం మండలంలోని కూటూరులో జరిగిన ఘటన ఇప్పుడు వివాదంగా మారింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ అనంతబాబు కూటూరుకు రాత్రి వేళలో వెళ్లారు. ఆయన వస్తున్న విషయాన్నీ తెలుసుకున్న గ్రామానికి చెందిన యువకులు కొందరు ఊరి పొలిమేరలో అడ్డుకున్నారు. హంతకులకు తమ ఊరిలో ప్రవేశం లేదంటూ నిలువరించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రశ్నించారు.

పోలవరం పరిహారం పొందిన భూములకు అదనంగా ఎకరాకు రూ.5 లక్షలు.. వ్యక్తిగత పరిహారం కింద రూ.10 లక్షలు ఇస్తామన్న హామీలు.. ఇతర అంశాలపై తమకు సమాధానాలు చెప్పాలంటూ యువకులు పట్టుబట్టినట్లుగా చెబుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళలో ఆందోళనలు చేయొద్దంటూ పోలీసులు వారిని హెచ్చరించారని.. ఈ సందర్భంగా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు నాయకులు వచ్చేందుకు లేని నియమావళి.. ప్రశ్నించటానికి ఎందుకు ఉంటుందని యువకులు ప్రశ్నించారు.

ఈ క్రమంలో యువకులకు.. వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీతో చర్చించేందుకు నలుగురు విడిగా రావాలని పోలీసులు వారిని తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో వెళ్లిన వారు మాట్లాడుతుంటే ఇద్దరిపై దాడి జరిగిందని.. గన్ మెన్లు గన్లతో కొట్టారని ఆరోపిస్తున్నారు. తమకు తగిలిన దెబ్బల్ని వారు చూపిస్తున్నారు. తమపై దాడికి పాల్పడి. .వేరే మార్గంలో గ్రామానికి వెళ్లి ప్రచారం చేశారంటున్నారు.

గాయాల నేపథ్యంలో ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్న వారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. తమకు ఇచ్చిన హామీలపై ప్రశ్నించిన అదివాసీ యువకులపై ఎమ్మెల్సీ అనంతబాబు గన్ మెన్లు దాడి చేయటాన్ని పలువురు ఖండిస్తున్నారు. వారిపై ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కీలకమైన ఎన్నికల వేళ ఎమ్మల్సీ అనంతబాబు తన దూకుడును తగ్గించుకుంటే మంచిదన్న మాట పలువురి నోటి నుంచి రావటం గమనార్హం.