Begin typing your search above and press return to search.

వివేకా హత్యపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు... ఇక ఆపాల్సిందే!

ఈ క్రమంలోనే... అవినాష్ రెడ్డిని కాపాడుతూ, ఇప్పుడు ఎంపీ టిక్కెట్ కూడా ఇచ్చారంటూ జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 April 2024 2:11 PM GMT
వివేకా హత్యపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు... ఇక ఆపాల్సిందే!
X

2019 ఎన్నికలకు ముందు జరిగిన వివేకా మర్డర్ కేసు.. ఇప్పుడు 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందనే విషయం లైట్ తీసుకునో ఏమో కానీ.. సమాంతర విచారణ ఒక వర్గం మీడియాలో జరుగుతుందన్నట్లుగా పరిస్థితి మారిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఇదే కీలక అంశంగా కూడా మార్చేసిన పరిస్థితి అని అంటున్నారు!

ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకీ - ఎన్డీయే కూటమికీ మధ్య పోరు సాగుతుంటే... కడప లోక్ సభ పరిధిలో మాత్రం వైసీపీ - కాంగ్రెస్ పోరు నెలకొన్న పరిస్థితి. దీనికి ప్రధాన కారణం... మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యను అజెండాగా చేసుకుని కడప లోక్ సభ సీటులో ఏపీ పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేస్తుండటమే. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో అవినాష్ ను సీబీఐ నిందితుడిగా తేల్చిందని.. అలాంటి వ్యక్తిని ఓడించాలంటూ షర్మిళ ప్రచారం చేసుకుంటున్నారు!

ఈ క్రమంలోనే... అవినాష్ రెడ్డిని కాపాడుతూ, ఇప్పుడు ఎంపీ టిక్కెట్ కూడా ఇచ్చారంటూ జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్నారు కాబట్టి అవినాష్ ని ఓడించాలని.. తనను గెలిపించాలని షర్మిళ ప్రచారం చేస్తున్నారు! ఈ సమయంలో షర్మిళకు తోడుగా... వివేకా కుమార్తె కూడా ఇదే పంథాలో ముందుకు వెళ్తున్నారు. ఈ సమయంలో కడప కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

అవును... ప్రస్తుతం ప్రధానంగా కడప లోక్ సభ పరిధిలో వివేకా మర్డర్ కేసు వ్యవహారం చుట్టూనే రాజకీయ విమర్శలు రేగుతున్న నేపథ్యంలో... కడప కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా... ఎన్నికల ప్రచారం సందర్భంగా వివేకా హత్య కేసుపై మాట్లాడవద్దంటూ వైఎస్ షర్మిల, సునీతారెడ్డితో పాటు నారా చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, పురందేశ్వరికి కడప కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కడప లోక్ సభ స్ధానం నుంచి కాంగ్రెస్స్ తరుపున పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలతో పాటు వివేకా కుమార్తె సునీత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి, లోకేష్, బీటెక్ రవి.. వివేకా హత్యపై నిత్యం మాట్లాడుతున్నారని వైసీపీ నేత సురేష్ బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. ఇందులో భాగంగా... ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు దర్యాప్తులో ఉన్న కేసును వాడుకుంటున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో స్పందించిన కడప కోర్టు.. వివేకా హత్య కేసుపై పైన పేర్కొన్న నేతలు ఎవరూ మాట్లాడకుండా ఆదేశాలు జారీ చేసింది.