Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల‌కు ముందు ఉచ్చులో వెంక‌ట్రామిరెడ్డి

తాజాగా మెద‌క్ నుంచి లోక్‌స‌భ స్థానానికి పోటీ చేయ‌బోతున్న బీఆర్ఎస్ అభ్య‌ర్థి వెంక‌ట్రామిరెడ్డికి ఉచ్చు బిగిసింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

By:  Tupaki Desk   |   13 April 2024 2:30 PM GMT
ఎన్నిక‌ల‌కు ముందు ఉచ్చులో వెంక‌ట్రామిరెడ్డి
X

కేసీఆర్‌కు త‌ల‌నొప్పి త‌ప్ప‌డం లేదు. ఈ బీఆర్ఎస్ అధినేత‌కు వ‌రుస‌గా షాక్‌లు త‌గులుతూనే ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం కేసీఆర్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంద‌నే చెప్పాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో త‌వ్వుతున్నా కొద్దీ సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఇవ‌న్నీ బీఆర్ఎస్ నేత‌ల చుట్టూనే తిరుగుతున్నాయి. తాజాగా మెద‌క్ నుంచి లోక్‌స‌భ స్థానానికి పోటీ చేయ‌బోతున్న బీఆర్ఎస్ అభ్య‌ర్థి వెంక‌ట్రామిరెడ్డికి ఉచ్చు బిగిసింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ‌లో భాగంగా వెంక‌ట్రామిరెడ్డిపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు రావ‌డ‌మే అందుకు కార‌ణం.

ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిష‌న్‌రావును పోలీసులు విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ విచార‌ణ‌లో భాగంగా తాజాగా వెంక‌ట్రామిరెడ్డి పేరు బ‌య‌ట‌కు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో బీఆర్ఎస్ నేత‌ల డ‌బ్బును ర‌వాణా చేయ‌డంలో రాధాకిష‌న్ రావు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో వెంక‌ట్రామిరెడ్డికి చెందిన డ‌బ్బునే ఎక్కువ‌గా త‌ర‌లించిన‌ట్లు తేలింది. ఈ డ‌బ్బు త‌ర‌లించేందుకు ఓ ఎస్సైకి రాధాకిష‌న్ త‌ప్పుడు స‌మాచార‌మిచ్చి బురిడీ కొట్టించిన‌ట్లు ద‌ర్యాప్తులో గుర్తించారు. ఎన్నిక‌ల సొమ్ము అని చెప్ప‌కుండా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల కోసమ‌ని ఎస్సైని వాడుకుని పోలీసు వాహ‌నాల్లో ఈ డ‌బ్బు త‌ర‌లించిన‌ట్లు తేలింది.

రాధాకిష‌న్ సూచ‌న‌తోనే ఆ ఎస్సై సికింద్రాబాద్‌లోని ఓ ప్ర‌ముఖ ఆసుప‌త్రిలో విశ్రాంత ఎస్పీ దివ్య‌చ‌ర‌ణ్ రావును క‌లిశార‌ని తేలింది. రాణిగంజ్‌, అఫ్ట‌ల్‌గంజ్ నుంచి రూ.కోటి చొప్పున తీసుకొచ్చి దివ్య‌చ‌ర‌ణ్‌కు అప్ప‌గించారు. ఇలా కొన్నిసార్లు చేశారు. వెంక‌ట్రామిరెడ్డి త‌న‌కు బాల్య స్నేహితుడు కావ‌డంతోనే ఆయ‌న డ‌బ్బును త‌ర‌లించిన‌ట్లు రాధాకిష‌న్ విచార‌ణ‌లో ఒప్పుకున్నారు.

అయితే ఈ డ‌బ్బు ఎక్క‌డిది? హ‌వాలా సొమ్ము ఉందా? అనే కోణంలో పోలీసులు విచారించ‌నున్నారు. ఈ మేర‌కు వెంక‌ట్రామిరెడ్డికి నోటీసులు పంపించే అవ‌కాశం ఉంది. మ‌రో ఏడాది స‌ర్వీస్ ఉండ‌గానే కలెక్ట‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరిన వెంక‌ట్రామిరెడ్డి... ఆ త‌ర్వాత ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గెలిచిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మెద‌క్ నుంచి బీఆర్ఎస్ క్యాండిడేట్‌గా పోటీ చేస్తున్నారు. ఇప్పుడీ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చుతో వెంక‌ట్రామిరెడ్డికి డ్యామేజీ జ‌రుగుతుంద‌నే చెప్పాలి. మెద‌క్ సిటింగ్ ఎంపీ స్థానం బీఆర్ఎస్ చేజారే ప్ర‌మాద‌మూ ఉంది.