Begin typing your search above and press return to search.

ఈ 10 దేశాలనూ ప్రకృతి బాగా ప్రేమించేసింది... సహజ వనరుల్లో టాప్ ఇవే!

ఇలా అత్యంత సమృద్ధిగా సహజవనరులు కలిగి ఉన్న టాప్ 10 దేశాల జాబితాను ఇప్పుడు పరిశీలిద్దాం.

By:  Tupaki Desk   |   31 Oct 2023 12:30 AM GMT
ఈ 10 దేశాలనూ ప్రకృతి బాగా ప్రేమించేసింది... సహజ వనరుల్లో టాప్  ఇవే!
X

ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితుల్లో సహజ వనరులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ధాతువు, పెట్రోలియం, అరుదైన భూమి ఖనిజాల నిల్వలు పెద్ద మొత్తంలో కలిగిన అనేక దేశాలు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలుగా మారడానికి ఆ సమృద్ధి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విషయంలో తక్కువ సమృద్ధిగా వనరులు ఉన్న దేశాలు ఈ కీలక వస్తువుల కోసం ప్రపంచ మార్కెట్‌ పై ఆధారపడాల్సి ఉంటుంది!

ఇలా అత్యంత సమృద్ధిగా సహజవనరులు కలిగి ఉన్న టాప్ 10 దేశాల జాబితాను ఇప్పుడు పరిశీలిద్దాం. ఇవన్నీ ప్రకృతి విపరీతంగా వరాలు ప్రసాధించిన దేశాలన్నమాట.

10) వెనిజులా:

ఈ దక్షిణ అమెరికా దేశంలో సహజ వనరుల విలువ 14.3 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేయబడ్డాయి. వాటిలో ప్రధానంగా ఇనుము, సహజ వాయువు, చమురు నిక్షేపాలు ఉన్నాయి. వాస్తవానికి వెనిజులా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉన్నప్పటికీ అమెరికా ఆంక్షల ఫలితంగా వాస్తవ ఉత్పత్తి పడిపోయింది. ఇలా ప్రపంచంలోని పదవ అతిపెద్ద సహజ వాయువు నిల్వలను కలిగి ఉన్న దేశంగా వెనిజులా ఉంది. ఈ సహజవనరుల్లో ఇనుప ఖనిజం, బంగారం, బాక్సైట్, జలశక్తి, వజ్రాలు ఉన్నాయి.


9) ఇరాక్:

వెనిజులా తర్వాత అత్యంత సహజవనరులు కలిగిన దేశంగా ఇరాక్ ఉంది. ఇందులో భాగంగా... ఇరాక్ 15.9 ట్రిలియన్ డాలర్ల విలువైన సహజ వనరులను కలిగి ఉంది. దీని ఎడారి భూభాగంలో పెట్రోలియం, సహజ వాయువు, ఫాస్ఫేట్లు, సల్ఫర్ విపరీతంగా ఉన్నాయి. దీంతో... పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ(ఓ.పి.ఈ.సీ) లో ఇరాక్ రెండవ అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తిదారుగా ఉంది.


ఇదే సమయంలో ప్రపంచంలో ముడిచమురు నిల్వలను అత్యధికంగా కలిగి ఉన్న ఐదవ అతిపెద్ద దేశంగా ఇరాక్ ఉంది. ఈ దేశం ఆదాయంలో ఎక్కువ మొత్తం ముడిచమురు ఎగుమతిపైనే ఆధారపడి ఉంటుంది. ఫలితంగా... అత్యధిక ఎక్కువ సహజ నిక్షేపాలున్న దేశాల్లో ఇరాక్ 9వ స్థానంలో నిలిచింది. ఈ దేశంలో సుమారు 145 బిలియన్ బేరల్స్ చమురు నివలను కలిగి ఉంది!

8) ఆస్ట్రేలియా:

బొగ్గు, కలప, రాగి, ఇనుప ఖనిజం, బంగారం, యురేనియం వంటి సహజ వనరులతో ఆస్ట్రేలియా భూభాగం నిందిఉంది. దీంతో ఈదేశంలోని సహజవనరుల విలువ 19.9 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ కంటే 80% పరిమాణంలో ఉన్న ఆస్ట్రేలియా చమురు, ద్రవీకృత సహజవాయువు యొక్క పెద్ద ఉత్పత్తిదారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా వద్ద ఉన్న చమురు నిల్వలు 2021 చివరి నాటికి 2.4 బిలియన్ బ్యారెల్స్‌ కు చేరుకున్నాయి.


ఇక గ్లోబల్ బొగ్గు ఎగుమతుల్లో 29%తో బొగ్గును అత్యధికంగా ఎగుమతి చేసే దేశం కూడా ఆస్ట్రేలియా కావడం గమనార్హం. ఇక ఈ దేశం కలిగి ఉన్న ఇతర సహజ వనరులలో అల్యూమినియం, ఇనుము, రాగి, తగరం, బంగారం, వెండి, యురేనియం, నికెల్, టంగ్‌ స్టన్, వజ్రాలు ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయం, పాడి పరిశ్రమ కూడా ఎక్కువగానే ఉంది!


7) బ్రెజిల్:

బంగారం, ఇనుము, చమురు, యురేనియంతో బ్రెజిల్ 21.8 ట్రిలియన్ డాలర్ల విలువైన సహజ వనరులను కలిగి ఉంది. ఇదే సమయంలో 2019లో బ్రెజిల్ ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉంది. 2018 అంచనా ప్రకారం ఈ భూభాగంలో 61.9% అటవీ ప్రాంతం, 23.5% శాశ్వత పచ్చిక బయల్లు ఉన్నాయి.


ఇదే క్రమంలో బ్రెజిల్ లో మైనింగ్ పరిశ్రమ.. బాక్సైట్, ప్లాటినం, రాగి, బంగారం, ఇనుములపై దృష్టి పెడుతుంది. ఇక్కడ కలప కూడా విలువైన సహజ వనరుగా ఉంది. ఇదే సమయంలో... బ్రెజిల్ అపారమైన జలవిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.

6) చైనా:

చైనాలో 23 ట్రిలియన్ డాలర్ల విలువైన సహజ వనరులు ఉన్నాయి. వీటిలో తొంభై శాతం బొగ్గు, అరుదైన భూమి లోహాలు. ఇదే సమయంలో వ్యవసాయ యోగ్యమైన భూమితో పాటు కలప కూడా చైనాలో కనిపించే మరొక ప్రధాన సహజ వనరు అని చెప్పాలి. అదే విధంగా... సహజ నీటి వనరుల కారణంగా ఇది ప్రపంచంలోనే గొప్ప జలవిద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.


ఇదే సమయంలో చైనా కలిగి ఉన్న ఇతర వనరులలో బియ్యం, చమురు, సహజ వాయువు, బంగారం, అల్యూమినియం వంటి అపారమైన లోహాలు ఉన్నాయి.

5) ఇరాన్:

ఇరాన్ సహజ వనరుల విలువ 27.3 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2020లో ఈ దేశం పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఓ.పి.ఈ.సీ.) లో ఐదవ అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తిదారుగా ఉంది. ఇదే సమయంలో 2020లో ప్రపంచంలో మూడవ అతిపెద్ద సహజ వాయువు ఉత్పత్తిదారుగా కూడా ఇరాన్ నిలిచింది.


ఇక ఇరాన్ కలిగిఉన్న ఇతర సహజ వనరులలో బొగ్గు, క్రోమియం, రాగి, ఇనుప ఖనిజం, సీసం, మాంగనీస్, జింక్, సల్ఫర్ ఉన్నాయి. అదేవిధంగా... వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగి ఉండటంతో ఇక్కడ పిస్తా, కుంకుమపువ్వు, పండ్లు కూడా అత్యధికంగా పండుతాయి!


4) కెనడా:

ఈ జాబితాలో 33.2 ట్రిలియన్ డాలర్ల విలువైన సహజ వనరులను కలిగిన కెనడా నాల్గవ స్థానంలో ఉంది. ఈ విస్తారమైన దేశం వెనిజులా, సౌదీ అరేబియా తర్వాత ఇది మూడవ అతిపెద్ద చమురు నిక్షేపాలను కలిగి ఉంది. ఈ దేశం కలిగి ఉన్న వస్తువులలో జిప్సం, సున్నపురాయి, రాతి ఉప్పు, పొటాష్ వంటి పారిశ్రామిక ఖనిజాలతోపాటు.. బొగ్గు, యురేనియం వంటి శక్తి ఖనిజాలు కూడా ఉన్నాయి.


ఇక కెనడాలోని లోహాలలో రాగి, సీసం, నికెల్, జింక్, బంగారం, ప్లాటినం, వెండి వంటి విలువైన లోహాలు ఉన్నాయి. ఇదే సమయలో సహజ వాయువు ఉత్పత్తిలో కెనడా అగ్రగామిగా ఉంది.


3) సౌదీ అరేబియా:

సౌదీ అరేబియాలో 34.4 ట్రిలియన్ డాలర్ల విలువైన సహజ వనరులు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది చమురు! ఈ దేశంలో 1938లో చమురు నిఒల్వలు కనుగొనబడ్డాయి. దీంతో ఇప్పుడు ప్రపంచంలోనే చమురు ఎగుమతిదారుల్లో ఇది ప్రధాన ప్రముఖ దేశంగా ఉంది.


దీంతో... 2020 నాటికి ప్రపంచంలోని 15% నిల్వలతో ఈ దేశ ఆర్థికవ్యవస్థ దాని చమురు ఎగుమతులపై ఆధారపడి ఉంది. ఇక సౌదీ అరేబియా యొక్క ఇతర సహజ వనరులలో రాగి , ఫెల్డ్‌ స్పార్, ఫాస్ఫేట్, వెండి, సల్ఫర్, టంగ్‌ స్టన్, జింక్ ఉన్నాయి.


2) యునైటెడ్ స్టేట్స్:

అగ్రరాజ్యం అమెరికాలో సహజ వనరుల అంచనా విలువ 45 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. వీటిలో దాదాపు 90% కలప, బొగ్గు ఉన్నాయి. దీంతో బొగ్గు ఉత్పత్తిలో అమెరికా అగ్రగామిగా ఉంది. 2020 నాటికి, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు నిల్వలను కలిగిఉన్న దేశంగా పేర్కొనబడింది. ఇక ఇతర వనరులలో ఎక్కువగా రాగి, బంగారం, చమురు, సహజ వాయువు నిక్షేపాలు ఉన్నాయి.


వీటితోపాటు సీసం, ఫాస్ఫేట్లు, యురేనియం, బాక్సైట్, ఇనుము, పాదరసం, నికెల్, పొటాష్, వెండి, టంగ్‌ స్టన్, జింక్, పెట్రోలియం, సహజ వాయువు, కలప, వ్యవసాయ యోగ్యమైన భూమి కూడా ఇందులో కీలక భూమిక పోషిస్తున్నాయి.

1) రష్యా:

తాజా అంచనాల ప్రకారం రష్యా సహజ వనరుల నిల్వల విలువ 75 ట్రిలియన్ డాలర్లు గా ఉంది. ఈ మొత్తంలో బొగ్గు, చమురు, సహజ వాయువు, బంగారం, కలప, అరుదైన ఎర్త్ లోహాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇదే సమయంలో 1.32 క్వాడ్రిలియన్ క్యూబిక్ అడుగులతో ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు నిల్వలను రష్య కలిగి ఉంది.


ఇదే క్రమంలో... ఈ దేశం సుమారు 6,800 టన్నులతో రెండవ అతిపెద్ద బంగారు నిల్వలను కలిగి ఉంది. అదేవిధంగా... 2020లో గ్లోబల్ సరఫరాలో 12%తో రష్యా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తిదారుగా ఉంది. ఇక 107.8 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలతో రష్యా ప్రపంచంలో ఆరవ అతిపెద్ద దేశంగా ఉంది.