Begin typing your search above and press return to search.

తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండలు పెరగాల్సిన సమయంలో వర్షాలు పడుతున్నాయి.

By:  Tupaki Desk   |   18 March 2024 5:59 AM GMT
తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు
X

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండలు పెరగాల్సిన సమయంలో వర్షాలు పడుతున్నాయి. నేటి నుంచి తెలంగాణలో నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. గంటకు 40 కిలోమీటర్ల వేగతో గాలులు వీచే వీలుంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


అకాల వర్షాల కారణంగా నిజామాబాద్ జిల్లాలో పంటలకు నష్టం జరిగింది. శనివారం రాత్రి నుంచి కురిసిన వడగళ్ల వానకు వరి, గోధుమ, ఉల్లి, జొన్న, పొగాకు, నువ్వులు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడి, బొప్పాయి తోటలు ధ్వంసమయ్యాయి. జిల్లాలో మొత్తం 26,129 ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయని అధికారులు గుర్తించారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నల్గొండ, వికారాబాద్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతుందన్నారు.

ఆదివారం కామారెడ్డిలో అత్యధిక వర్షపాతం పడింది. కరీంనగర్ లో 4 సెం.మీ. వర్షం నమోదైంది. కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వానలు కురిశాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావారణ శాఖ అధికారులు సూచించారు.

ఇంకా మూడు రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని సూచించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు పడతాయని తెలిపింది. ఈనేపథ్యంలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడతాయని అంచనా వేస్తున్నారు. భానుడి భగభగలు తప్పవని వెల్లడించింది. ఈశాన్య భారతం, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని చెప్పింది.