Begin typing your search above and press return to search.

జగన్ విషయంలో టీడీపీ ప్లాన్ బూమరాంగ్ ?

వైఎస్ జగన్ మీద జరిగిన రాళ్ళ దాడి విషయం జాతీయ స్థాయిలో ఇపుడు చర్చనీయాంశం అయింది.

By:  Tupaki Desk   |   14 April 2024 5:30 PM GMT
జగన్ విషయంలో టీడీపీ ప్లాన్ బూమరాంగ్ ?
X

వైఎస్ జగన్ మీద జరిగిన రాళ్ళ దాడి విషయం జాతీయ స్థాయిలో ఇపుడు చర్చనీయాంశం అయింది. అయితే ఈ విషయం కోడి కత్తి లాంటిదే అని టీడీపీ భావించడమే పొరపాటుగా మారింది అంటున్నారు. కోడి కత్తి దాడి సమయానికి జగన్ ప్రభావవంతమైన నాయకుడే కానీ ప్రతిపక్ష నేత. దాంతో అప్పట్లో అది ఏపీకే పరిమితం అయింది. అంతకంటే చర్చ సాగలేదు.

కానీ గత అయిదేళ్ళుగా ఏపీని పాలించిన సీఎం గా జాతీయ స్థాయిలో ఇపుడు జగన్ పేరు నానుతోంది. ఆయన దేశంలో ఒక ముఖ్య నేతగా ఉన్నారు. దాంతో పాటు ఎన్నికల వేళ ఏపీ మీద అందరి ఫోకస్ ఉంది. అటు చంద్రబాబు ఇటు జగన్ లలో ఎవరు అధికారంలోకి వస్తారు అన్నది పెద్ద చర్చగానే ఉంది.

ఏపీ మీద ఎన్డీయే ఇండియా కూటములు రెండూ ఫోకస్ పెడుతున్న నేపధ్యం ఉంది. జగన్ అయితే ఏ పక్షంలో లేరు. దాంతో ఆయనకు న్యూట్రల్ గా ఉన్న పార్టీలు నేతల నుంచి ఇపుడు మద్దతు దక్కింది. ఇక ఎన్డీయేలో లేకపోయినా ప్రధాని నరేంద్ర మోడీ జగన్ మీద దాడి జరిగిన వెంటనే రియాక్ట్ అయ్యారు.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి జరగడంతో జాతీయ స్థాయిలో ప్రధాని హోదాలో ఉన్న నేతగా మోడీ స్పందించిన తీరు అది. అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా జగన్ మీద జరిగిన దాడిని ఖండించారు. వారిద్దరూ ఇండియా కూటమి సభ్యులు.

ఇలా జగన్ మీద దాడి జరిగిన వెంటనే జాతీయ స్థాయిలో ప్రముఖులు ఖండించడంతో ఈ ఇష్యూ నేషనల్ వైడ్ గా చర్చ అయింది. అయితే ఏపీలో పాలిటిక్స్ గానే చూస్తూ జగన్ మీద రెగ్యులర్ రొటీన్ విమర్శలు చేసే టీడీపీ నేతలు కోడి కత్తి కమల్ హాసన్ అని కోడి కత్తి డ్రామా టూ స్టార్ట్ అయింది అని విమర్శలు చేస్తూ వచ్చారు.

జగన్ తన మీద తానే దాడి చేయించుకున్నారు అంటూ టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో వరసబెట్టి కామెంట్స్ పెడుతూ వచ్చారు. శనివారం రాత్రి ఎనిమిది ప్రాంతంలో జగన్ మీద దాడి జరిగితే రాత్రి పదకొండున్నర దాకా టీడీపీ రియాక్షన్ ఇలాగే ఉంది. ఎపుడైతే ప్రధాని నరేంద్ర మోడీ జగన్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఆయన కోలుకోవాలని ట్వీట్ చేశారో ఆ మీదటనే చంద్రబాబు సర్దుకుని జగన్ మీద జరిగిన దాడిని తానూ ఖండించారు.

అయితే మరో వైపు ఆదివారం కూడా టీడీపీ ముఖ్య నేతలు ఇతర నాయకులు అంతా ట్విట్టర్ తో పాటు బయట ప్రెస్ మీట్లలోనూ కూడా ఇదే విషయం మాట్లాడుతున్నారు. వీలైనంతవరకూ జగన్ మీద దాడి ఇష్యూలోని సీరియస్ నెస్ ని డైల్యూట్ చేయడానికే వారి ప్రయత్నం అని అర్ధం అవుతోంది.

అయితే రాజకీయాలు ఏ పార్టీ అయిన చేయవచ్చు. రాజకీయాలు చేసేందుకే పార్టీలు ఉంటాయి. కానీ కొన్ని కీలక సందర్భాలలో మానవత్వం కూడా ఉంటుంది, రాజకీయాలకు అతీతమైన సందర్భం ఉంటుంది. దాడి ఎలా జరిగింది ఏమిటి అన్నది పక్కన పెడితే గాయం తగిలింది అది వాస్తవం. దాని మీద సానుభూతి తో పాటు పరామర్శ వ్యక్తం చేయడం కనీస ధర్మం.

కానీ దాడి జరిగిన వెంటనే అది వైసీపీయే స్వయంగా చేయించుకుంది అని ఒక అభిప్రాయానికి రావడం ద్వారా టీడీపీ వేసిన ప్లాన్ బూమరాంగ్ అయింది అని అంటున్నారు. ఇక్కడ ఏ విషయం జరిగినా సాక్ష్యులు ప్రజలు వారు అన్నీ గమనిస్తూంటారు. వారి దృష్టిలో రాజకీయ కోణం ఉండదు.

వారు మౌనంగానే అన్నీ మననం చేసుకుని అవసరం అయినపుడు తీర్పు ఇస్తూంటారు. ఏది ఏమైనా కోడి కత్తి కేసు వేసు. అప్పటి జగన్ వేరు. ఆయన నాటి హోదా వేరు. నేడు ఆయన హోదా వేరు ఇవన్నీ మరచి అప్పటి మాదిరిగానే ఇపుడూ అంటూ టీడీపీ చేసిన పాత ప్లాన్ అయితే బెడిసింది అని అంటున్నారు.

అన్నింటికన్నా ఎక్కువగా రాగద్వేషాలు కంటే మానవత్వం గొప్పదని అంతా అంటారు. ఏపీలో చూస్తే అదే కరవు అవుతోంది. ప్రత్యర్ధులు కంటే శత్రువులుగా మారిపోతున్నారు అని అంటున్నారు. ఆఖరులు అధినేతల మీద భౌతిక దాడులు జరిగినా కనీస ఖండన లేని విధంగా మొద్దుబారిన హృదయంతో చేసే రాజకీయాలు రాణిస్తాయా అన్నది కూడా ఆలోచించాల్సిందే.