Begin typing your search above and press return to search.

టీడీపీ, జనసేనకు తలపోటు.. రెబల్స్‌ గా కీలక నేతలు!

ముఖ్యంగా టీడీపీ, జనసేనలకు రెబల్స్‌ పోటు ఎక్కువైంది. పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ సీటును జనసేన పార్టీ తీసుకుంది.

By:  Tupaki Desk   |   23 March 2024 4:40 AM GMT
టీడీపీ, జనసేనకు తలపోటు.. రెబల్స్‌ గా కీలక నేతలు!
X

ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా మూడు పార్టీలు సీట్లను త్యాగం చేయాల్సిన పరిస్థితి. దీంతో సీట్లు ఆశించిన కీలక నేతలకు భంగపాటు తప్పడం లేదు.

ముఖ్యంగా టీడీపీ, జనసేనలకు రెబల్స్‌ పోటు ఎక్కువైంది. పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ సీటును జనసేన పార్టీ తీసుకుంది. ఈ సీటును టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, నాగుల్‌ మీరా, ఎంకే బేగ్‌ తదితరులు ఆశించినా జనసేనకు విడిచిపెట్టారు. దీంతో ఇక్కడ మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న జనసేన నేత పోతిన వెంకట మహేశ్‌ కు సీటు ఖాయమని అనుకున్నారు.

అయితే ఇప్పుడు కూటమిలో బీజేపీ కూడా చేరడం, గతంలో విజయవాడ పశ్చిమ నుంచి బీజేపీ గెలిచి ఉండటంతో ఈ సీటు కావాలని కోరుతోంది. దీంతో పోతిన మహేశ్‌ కు సీటు లేకుండా పోయింది. ఈ విషయాన్ని స్వయంగా జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఆయనకు తెలిపారు. ఈ పొత్తుల వల్ల పవన్‌ సోదరుడు నాగబాబుకే సీటు లేకుండా పోయిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు పోతిన మహేశ్‌ కు కూడా సీటు లేకపోవడంతో ఆయన అనుచరులు, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అధినేత మనసు మార్చుకోవాలని.. విజయవాడ పశ్చిమ నుంచి జనసేన పోటీ చేయాలని కోరుతున్నారు. అయితే పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి ఇవ్వాల్సి ఉండటంతో పవన్‌ ఏమి చేయలేకపోతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక మహేశ్‌ కు న్యాయం చేస్తామని చెబుతున్నారు.

మొదట్లో మొత్తబడ్డట్టే కనిపించినా కార్యకర్తలు, అనుచరుల ఒత్తిడితో పోతిన మహేశ్‌ ఇప్పుడు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాను రెబల్‌ గా బరిలో ఉంటానని ఆయన చెబుతున్నారు. మరి ఈ సమస్యను పవన్‌ ఎలా పరిష్కరిస్తారో చూడాల్సిందే.

ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండిలో టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఉన్నారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన వేటుకూరి శివరామరాజును 2019 ఎన్నికల్లో టీడీపీ నరసాపురం నుంచి ఎంపీగా బరిలో దింపింది. ఈ ఎన్నికల్లో ఎంపీగా శివరామరాజు ఓడిపోయారు.

కాగా 2019 ఎన్నికల్లో ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన మంతెన రామరాజుకుకే ఈసారి కూడా చంద్రబాబు టికెట్‌ ఇచ్చారు. దీంతో శివరామరాజు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. రామరాజుకు సీటు ప్రకటించిన రోజే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిరాహార దీక్షకు కూర్చున్నారు. గత ఎన్నికల సమయంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న తాను చంద్రబాబు చెప్పడం వల్లే నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేశానని.. ఇప్పుడు తన ఉండి సీటు తనకే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

తనను కలవడానికి వచ్చిన ఎమ్మెల్యే రామరాజుకు ముఖం చాటేశారు. తాజాగా తాను ఉండిలో రెబల్‌ గా పోటీ చేస్తానని శివరామరాజు చెబుతున్నారు. దీంతో చంద్రబాబుకు తలపోటు తప్పడం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని చెబుతున్నా ఆయన వినడం లేదు.