Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఇంటర్వూపై రేవంత్ నిప్పులు... ప్రాజెక్టులపై ప్రాసలతో సెటైర్లు!

రానున్న ఎన్నికల్లో గెలిచి తిరిగి సీఎం అవుతానని తెలిపారు! తప్పుడు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నట్లుగా విమర్శించారు!

By:  Tupaki Desk   |   24 April 2024 5:31 PM GMT
కేసీఆర్ ఇంటర్వూపై రేవంత్ నిప్పులు... ప్రాజెక్టులపై ప్రాసలతో సెటైర్లు!
X

లోక్ సభ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్స్ అధినేత కేసీఆర్.. ఒక న్యూస్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు! సుధీర్ఘంగా సాగిన ఆ ఇంటర్వ్యూలో కేసీఆర్ పలు కీలక విషయాలు వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో గెలిచి తిరిగి సీఎం అవుతానని తెలిపారు! తప్పుడు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నట్లుగా విమర్శించారు!

ఇలా చాలా కాలం తర్వాత కేసీఆర్ ఒక టీవీ డిబెట్ లో కనిపించడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవ్వగా.. ఆ ఇంటర్వూలో ఆయన చేసిన వ్యాఖ్యలు, ప్రత్యర్థులపై విరుచుకుపడిన విధానం మరింత వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా... అసెంబ్లీకి రాకుండా టీవీ డిబేట్లకు హారజవుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.

అవును... మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ఒక న్యూస్ ఛానల్ లో సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో వైరల్ అవుతున్న వేళ.. సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బుధవారం వరంగల్ జిల్లా మడికొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మైకందుకున్న ఆయన... అసెంబ్లీకి రాని దద్దమ్మలు బడికి రాని బడి దొంగళ్లాంటోళ్లంటూ మొదలుపెట్టారు.

అనంతరం... "అట్లాంటి బడి దొంగలు నిన్న టీవీ9 స్టూడియోకి వెళ్లి నాలుగు గంటలు కూర్చున్నారు" అంటూ ఫైరయ్యారు. ఇదే క్రమంలో... "పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రతిపక్ష నాయకుడు.. అసెంబ్లీకి రాకుండా, సమస్యలపై మాట్లాడకుండా, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా, గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీని ప్రశ్నిస్తామని, అసెంబ్లీలో మా కళ్లల్లోకి చూసే ధైర్యం లేక పారిపోయి టీవీలో కూర్చున్నారు" అంటూ ధ్వజమెత్తారు.

ఇదే సమయంలో... బీఆరెస్స్ కు ఎక్కడైనా డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉందా అని ప్రశ్నించిన రేవంత్... బీఆరెస్స్, బీజేపీలు నాణానికి రెండు ముఖాలు అని ఎద్దేవా చేశారు. ఇదే క్రమంలో... రూ.లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని.. మేడిగడ్డ మేడిపండులా మారిపోయిందని.. అన్నారం బ్యారేజీ ఆకాశంలో కలిసిపోయిందని సెటైర్లు వేశారు. ఇదే సమయంలో.. కాంగ్రెస్ కట్టిన నాగార్జున సాగర్ మాత్రం చెక్కు చెదరలేదని స్పష్టం చేశారు.