Begin typing your search above and press return to search.

గెలుపు మీద డౌట్లు తీరాయంటున్న బాబు...!?

ఆయన చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన ప్రజా గళం సభలో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   27 March 2024 1:08 PM GMT
గెలుపు మీద డౌట్లు తీరాయంటున్న బాబు...!?
X

ఈ మాట అన్నది స్వయాన చంద్రబాబే. ఆయన చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన ప్రజా గళం సభలో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కొన్నాళ్ళ క్రితం వరకూ గెలుపు మీద డౌట్ ఉండేదని వ్యాఖ్యానించి చంద్రబాబు తమ్ముళ్లతో పాటు అందరికీ షాక్ ఇచ్చేశారు.

అయితే ఇపుడు తన సభలకు వస్తున్న జనాలు వారి నుంచి వస్తున్న స్పందనను చూసిన తరువాత గెలుపు ధీమా పెరిగింది అని అంటున్నారు. మొన్నటి వరకు కొన్ని సందేహాలు ఉండేవని, ఇప్పుడు ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు చూశాక గెలుపు మనదే అని ధీమా కలుగుతోందని బాబు అంటున్నారు.

ఈ మాటలు బాబు అంటున్నది మార్చి 27వ తేదీన. అదే బాబు రెండేళ్ళ నుంచి జనంలో తిరుగుతున్నారు. ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అన్న ట్యాగ్ తో ఎన్నో సభలలో పాలు పంచుకున్నారు. బాదుడే బాదుడు అంటూ మరి కొన్ని సభలు నిర్వహించారు. ఈ ఏడాది జనవరి నెల అంతా బాబు రా కదలిరా అంటూ అనేక సభలు ఏపీ అంతటా నిర్వహించారు.

మరి ఆయా సభలలో బాబు మాట్లాడుతూ వచ్చేది మన ప్రభుత్వమే అన్నారు. మరి అపుడు బాబుకు ధీమా ఉందా లేక అలా అనాలని అన్నారా అన్న చర్చ వస్తోంది. అంతే కాదు బాబు ఎక్కడికెళ్ళినా ఏ సభలో మాట్లాడినా వచ్చేది మనమే అని కూడా చెబుతూ ఉండేవారు. మరి నాడు ఆ మాటలు కూడా నమ్మకంతో అన్నారా లేక అనాలని అన్నారా అన్నది కూడా ఇపుడు అంతా ఆలోచిస్తున్నారు.

మరి ఇప్పటిదాకా లేని లేని నమ్మకం ఇపుడే కలగడం వెనక కారణం ఏంటి అన్న చర్చ కూడా సాగుతోంది. జనసేన టీడీపీ పొత్తు ఆరు నెలల నుంచి కుదిరింది. బీజేపీ పొత్తు కూడా కుదిరి నెల అవుతోంది. మరి ఈ పొత్తులలో ఏవీ గెలుపు మీద అంత గ్యారంటీ ఇవ్వలేకపోయాయా అన్న చర్చ సాగుతోంది.

అదే సమయంలో కేంద్రంలో బీజేపీ మూడవసారి అధికారంలోకి వస్తుందని చంద్రబాబు జోస్యం చెప్పడం విశేషం. మరి కేంద్రంలో అధికారంలో వస్తుందని డౌట్ లేదు కాబట్టే బాబు పొత్తు పెట్టుకున్నారు అని తెలుసు. ఏపీలో కూడా కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పడం వరకూ ఓకే కానీ ఆ మధ్య దాకా ఎందుకు సందేహాలు ఎందుకు ఉన్నాయన్నదే చూడాల్సి ఉంది.

ఇక ఏపీలో అభివృద్ధి కోసమే తాము జనసేనతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో ఎన్నికల మీద ఫలితాల మీద వరసబెట్టి వస్తున్న సర్వేలలో మెజారిటీ వైసీపీ గెలుపు అని చెబుతున్న నేపధ్యంలో టీడీపీలో కొన్ని అనుమానాలు ఉన్నాయా అన్న డౌట్లు ఇపుడు వస్తున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా బాబు చేసిన ఈ కామెంట్స్ మీద చర్చ సాగుతోంది.

మరో వైపు చూస్తే చంద్రబాబు బుధవారం జరిగిన పుత్తూరు నగరి సభలలో జగన్ మీద తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ముసుగు వీరుడు అవతారం చాలించి జనంలోకి వస్తున్నారు కాబట్టి ఆయనకు ఖాళీ రోడ్లే స్వాగతం పలకాలని కోరారు. జగన్ ఇడుపులపాయ వద్ద ఉన్న వైఎస్సార్ సమాధి వద్దకు వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని తీసుకుని రావడం దారుణం అన్నారు.

ఎవరి మీద అయినా ఆరోపణలు వస్తే వారికి టికెట్లు ఇవ్వరని కానీ జగన్ మాత్రం కడప ఎంపీ టికెట్ మరోసారి అవినాష్ కి ఇవ్వడం అంటే ఆయన దిగజారుడు రాజకీయాలని నిదర్శనం అన్నారు. ప్రజలంతా ఈ సీఎం చర్యలను గమనిస్తున్నారని తగిన సమయంలో జవాబు చెబుతారు అని చంద్రబాబు అన్నారు.

మరి కొద్ది రోజులలో జగన్ పెత్తందారీ పోకడలకు అహంకారానికి జనాలు గుణపాఠం చెబుతూ తీర్పు ఇస్తారని అన్నారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి మరో రెండు నెలలలో వస్తుందని అన్నారు. నగరిలో జబర్దస్త్ ఎమ్మెల్యే ఉన్నారంటూ రోజా మీద కూడా చంద్రబాబు కామెంట్స్ చేశారు. మొత్తం మీద చూస్తే చంద్రబాబు ప్రజాగళం సభలలో వైసీపీని తూర్పారా పట్టారనే చెప్పాలి. దీనికి వైసీపీ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో.