Begin typing your search above and press return to search.

అవనిగడ్డ వైసీపీ అభ్యర్ధిగా పోతిన మహేష్ ?

అటువంటి నాయకుడి వైపుగా అడుగులు వేయమని తనను తన అనుచరులు కోరుతున్నారని ఆయన అంటున్నారు.

By:  Tupaki Desk   |   10 April 2024 3:32 AM GMT
అవనిగడ్డ వైసీపీ అభ్యర్ధిగా పోతిన మహేష్ ?
X

పోతిన మహేష్ అధికార వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం అయింది. ఆయన తాను చేరబోయే పార్టీ గురించి చెబుతూ హింట్ ఇస్తున్నారు సింహంలా సింగిల్ గా వచ్చే నాయకుడి నాయకత్వంలోని పార్టీలో చేరుతాను అంటున్నారు. అంతే కాదు మాట తప్పని మడమ తిప్పని అధినేతతో జట్టు కడతాను అని అంటున్నారు. అంతే కాదు నాయకుడు అంటే మాటకు విలువ ఇచ్చేవాడు అని నమ్మకం భరోసా ఇచ్చేవారు అని ఆయన అంటున్నారు.

ఇన్ని రకాలుగా సంకేతాలు ఇచ్చేశాక ఆయన చేరే పార్టీ ఏది అని రాజకీయాల మీద అవగాహన ఉన్న ఎవరూ అడగరేమో. ఎందుకంటే ఆయన వైసీపీలో చేరుతారు అని ఇట్టే చెప్పేస్తారు. పార్టీలో ఉన్న వారికి భరోసా ఇవ్వాలని ప్రస్తుతం ఏపీలో అలాంటి నాయకత్వం ఎక్కడ ఉందో అందరికీ తెలుసు అని పోతిన మహేష్ సస్పెన్స్ లో పెట్టి చెప్పాల్సింది చెబుతున్నారు.

అటువంటి నాయకుడి వైపుగా అడుగులు వేయమని తనను తన అనుచరులు కోరుతున్నారని ఆయన అంటున్నారు. తన మనసు కూడా ఆ దిశగానే ఆలోచిస్తోందని ఆయన చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆయన జనసేన అధినేత పవన్ మీద మరోసారి ఘాటు విమర్శలు చేశారు. జనసేన అధినేతకు తన పార్టీ మీద సొంత జెండా మీద ప్రేమ లేదని సెటైర్లు వేశారు.

ఆయన మనసు ఇతర పార్టీ జెండాల మీద ఉంటుందని అన్నారు. ఆ పార్టీలో ఇతర నాయకుల ఆలోచనలు అలాగే ఉన్నాయని దెప్పిపొడిచారు. తాను నిజాలు చెబుతూంటే జీర్ణించుకోలేక కొంతమంది నాయకులు వచ్చి తన మీద విమర్శల దాడి చేస్తున్నారు అని ఆయన వాపోయారు. ఒక్కడి మీద పది మంది నేతలు దాడి చేయడం మంచి పద్ధతేనా అని ఆయన ప్రశ్నించారు.

జనసేనలో తనను చంపేశారు అని అందుకే రాజకీయంగా పునర్జన్మ వెతుక్కుంటూ ముందుకు సాగుతున్నాను అని ఆయన అంటున్నారు. ఆయన వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనకు పోటీ చేసేందుకు సీటు ఇస్తారని అంటున్నారు. అది అవనిగడ్డ సీటు అని చెబుతున్నారు.

అవనిగడ్డలో టీడీపీ నుంచి వచ్చిన మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ కి టికెట్ ఇచ్చింది జనసేన. దాంతో అక్కడ జనసేన నేతలు మండిపోతున్నారు. పోతిన మహేష్ ని అక్కడ నిలబెడితే వైసీపీ బలంతో పాటు జనసేన బలం కూడా తీసుకుని మండలి మీద మంచి విజయం సాధిస్తారు అని అంటున్నారు.

దాంతో వైసీపీలో చేరిన వెంటనే ఎమ్మెల్యేగా పోటీ చేసే చాన్స్ కూడా పోతిన మహేష్ కి దక్కుతుందని అంటున్నారు. ఒకవేళ అది కాకపోతే ఆయన ఉన్న పశ్చిమ నుంచే పోటీకి చాన్స్ ఇవ్వవచ్చు అన్నది మరో మాటగా ఉంది. అయితే అక్కడ కార్పోరేటర్ గా ఉన్న మైనారిటీ నేతకు ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. సుజనా చౌదరిని ఆయన ఏ మేరకు తట్టుకుంటారు అన్న ఆలోచన ఉంది. దాంతో విజయవాడ ఎంపీ అభ్యర్ధి కేశినేని నాని సలహాతో ఆ సీటులో పోతిన మహేష్ ని నిలబెట్టేందుకు కూడా ఆలోచిస్తున్నారు అంటున్నారు.