Begin typing your search above and press return to search.

23న ప‌వ‌న్, గీత నామినేషన్‌లు.. టీడీపీ ఎప్పుడంటే!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఈ ద‌ఫా పిఠాపురం నియోజ‌క‌వర్గం నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 April 2024 4:01 PM GMT
23న ప‌వ‌న్, గీత నామినేషన్‌లు.. టీడీపీ ఎప్పుడంటే!
X

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఈ ద‌ఫా పిఠాపురం నియోజ‌క‌వర్గం నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. 90 వేల కాపుల ఓట్లు త‌న‌ను గెలిపిస్తాయ‌ని ఆయ‌న భారీ ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నుంచి కాకినాడ ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు. ఈమె కూడా కాపు సామాజిక వ‌ర్గం నాయ‌కురాలే. పైగా.. నియోజ‌క‌వ‌ర్గంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు తిరుగుతున్నారు. ఇదిలావుంటే.. ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఈ నెల 23న నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పి. హ‌రిప్ర‌సాద్ పేరుతో ఈ ప్ర‌క‌ట‌న తాజాగా విడుద‌ల చేశారు.

అయితే.. అదే రోజు అంటే.. ఈ నెల 23నే వైసీపీ అభ్య‌ర్థి వంగా గీత కూడా నామినేష‌న్ వేయ‌నున్నారు. దీనికి సంబంధంచి పార్టీ గ‌తంలోనే ప్ర‌క‌టించింది. ఈ నెల 23న ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గాల్లో నామినేష‌న్లు వేయ‌నున్నారు. దీంతో అటు ప‌వ‌న్‌.. ఇటు గీత ఇద్ద‌రూ ఒకే రోజు నామినేష‌న్లు వేస్తుండ‌డం ఆస‌క్తిగా మారింది. ఇదిలావుంటే.. టీడీపీ త‌ర‌ఫున 144 మందిలో తాజాగా ఇద్ద‌రు నామినేష‌న్లు వేశారు. వీరిలో ఉర‌వ‌కోండ ఎమ్మెల్యే ప‌య్యావుల కేశ‌వ్ గురువారం తొలి నామినేష‌న్ వేయ‌గా.. మ‌లినామినేష‌న్.. టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వేశారు. ఈయ‌న మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా అనంత‌పురం జిల్లాలోని పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ నాయ‌కురాలు ప‌ల్లె కోడ‌లు కూడా నామినేష‌న్ వేశారు.

మిగిలిన వారిలో చంద్ర‌బాబు త‌ర‌ఫున ఆయ‌న స‌తీమ‌ణి 19న(శ‌నివారం) కుప్పంలో నామినేష‌ణ్ వేయ‌నున్నారు. మిగిలిన 140 నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి బీ ఫారాల‌ను అందించాల్సి ఉంది. వీటిని ఈ నెల 21న టీడీపీ అధినేత పార్టీ కేంద్ర కార్యాల‌యం మంగ‌ళ‌గిరిలో అందించ‌నున్నారు. దీంతో అభ్య‌ర్థుల‌ను అక్క‌డ‌కు రావాల‌ని పార్టీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అదే రోజు నుంచి చంద్ర‌బాబు హెలికాప్ట‌ర్ ను వినియోగించి.. జిల్లాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేసి.. ప్ర‌చారం ప‌రుగులు పెట్టించ‌నున్నారు. అదేవిధంగా ప‌వ‌న్ కూడా హెలికాప్ట‌ర్ వినియోగించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ రెండు పార్టీలు జోరు పెంచ‌నున్నాయి.