Begin typing your search above and press return to search.

ఇద్దరూ ఇద్దరే: పవన్ .. లోకేశ్ సారూప్యతలెన్నో!

ఉత్తర దక్షిణ ధ్రువాల మాదిరి ఉంటారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్.

By:  Tupaki Desk   |   27 April 2024 12:30 PM GMT
ఇద్దరూ ఇద్దరే: పవన్ .. లోకేశ్ సారూప్యతలెన్నో!
X

ఉత్తర దక్షిణ ధ్రువాల మాదిరి ఉంటారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్. సిత్రమైన అంశం ఏమంటే.. వీరిద్దరి మధ్య బోలెడన్ని సారూపత్యలు కనిపిస్తాయి. అవసరానికి మించిన ఆవేశాన్ని తమ ప్రసంగాల సందర్భంగా ప్రదర్శిస్తుంటారు. ఈ ఇద్దరు నేతలు తమ తొలి ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ఎదుర్కొన్నారు. తీవ్రమైన విమర్శల్ని ఎదుర్కొంటూ.. తొలి గెలుపు కోసం కిందా మీదా పడుతుంటారు. మరో ఆసక్తికరమైన పోలిక ఏమంటే.. పవన్ కల్యాణ్ దశాబ్దానికి పైగా రాజకీయాల్లో ఉంటూ.. విశేష సంఖ్యలో అభిమానులు ఉన్నప్పటికీ రాజకీయాల్లో మాత్రం తనదైన ముద్రను వేయలేకపోయారు.

అదే సమయంలో నారా లోకేశ్ విషయానికి వస్తే.. తన తండ్రి పార్టీ అధినేతగా.. పద్నాలుగున్నరేళ్ల ముఖ్యమంత్రిగా ఉండి.. దాదాపు ఐదేళ్ల పాటు మంత్రిని చేసినప్పటికీ తనదైన ముద్రను వేయటంలో లోకేశ్ ఫెయిల్ అయ్యారని చెప్పాలి. అంతేనా.. సుదీర్ఘ పాదయాత్ర సైతం అనుకున్నంత ఇంపాక్ట్ చూపించలేదన్న విమర్శను ఎదుర్కొంటున్నారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వేళ.. మళ్లీ వీరిద్దరి మధ్య పోలిక మొదలైంది.

పవన్.. లోకేశ్ ఇద్దరు ఈసారైనా చట్టసభల్లో అడుగు పెట్టే వీలుందా? అన్నది మొదటి ప్రశ్నగా మారింది. ఏపీ ఎన్నికల్లో వీరిద్దరి ఎన్నికల ఫలితం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగువారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పక తప్పదు. ఈ ఇద్దరు ముఖ్యనేతలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. తాజా ఎన్నికలు వీరికి చావో రేవో అన్నట్లుగా మారింది.

ఈ ఇద్దరు నేతల మీదా అధికార వైసీపీ మహిళా అభ్యర్థుల్ని బరిలోకి దించటం తెలిసిందే. దీంతో.. దూకుడుగా వ్యవహరిద్దామనుకున్న వీరికి.. వైసీపీ వ్యూహాత్మకంగా బ్రేకులు వేసిందని చెప్పాలి. ఈ ఎన్నికల్లో వీరిద్దరి గెలుపుపై ఆసక్తికర చర్చ జరుగుతుంటే.. మరోవైపు ఈ ఇద్దరికి వచ్చే మెజార్టీ మీదా వాదనలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ మెజార్టీ సొంతం చేసుకుంటారన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది. అదే సమయంలో.. మెజార్టీ సంగతి తర్వాత.. ముందు గెలవమనండి చూద్దామన్న వ్యాఖ్యలు వినిపిస్తున్న పరిస్థితి. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ ఇద్దరూ కిందా మీదా పడుతున్నారని చెప్పాలి. ఎన్నికల్లో తొలి గెలుపు కోసం ప్రయత్నిస్తున్న వీరి ప్రయత్నాలు ఏం కానున్నాయన్నది తేలాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.