Begin typing your search above and press return to search.

`శ‌క్తి` ఆశీర్వాదం ఎవ‌రికి ఉందో జూన్ 4 న తేలిపోతుంది: ప్ర‌ధాని

తెలంగాణలో బీజేపీకి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోందని మోడీ తెలిపారు.

By:  Tupaki Desk   |   18 March 2024 8:19 AM GMT
`శ‌క్తి` ఆశీర్వాదం ఎవ‌రికి ఉందో జూన్ 4 న తేలిపోతుంది:  ప్ర‌ధాని
X

కాంగ్రెస్ పార్టీపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విమర్శ‌లు గుప్పించారు. రాహుల్ గాంధీ శ‌క్తిని గురించి మాట్లాడుతున్నార‌ని.. ఆ శ‌క్తి ఆశీర్వాదం ఎవ‌రికి ఉందో జూన్ 4న తేలిపోతుంద‌ని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల‌ను ఓడించి తెలంగాణ వికాసం కోసం బీజేపీకి ఓటు వేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. తాజాగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాలలో బీజేపీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన‌ విజయసంకల్ప సభలో ప్ర‌ధాని ప్ర‌సంగించారు.

తెలంగాణలో బీజేపీకి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోందని మోడీ తెలిపారు. మే13న తెలంగాణ ప్రజలు చరిత్ర సృష్టిస్తారని.. వికాసం కోసం బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. జూన్ 4న వచ్చే ఫలితాల్లో ఎన్డీఏ 400 సీట్లు గెలవాలని ఆకాంక్షించారు. విపక్షాల ఇండియా కూటమిలో ఐక్యత లేదని దుయ్య‌బ‌ట్టారు. కూటమిలో పార్టీలన్నీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయ‌న్నారు. ముంబైలో జరిగిన రాహుల్ గాంధీ న్యాయ జోడో యాత్రను ప్రస్తావిస్తూ.. విపక్షాల అనైక్యత ఆసభలో కనిపించిందన్నారు.

``రాహుల్‌గాంధీ శక్తిపైనే తమ పోరాటం అన్నారు. ఆ శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ 4న తేలిపోతుంది. శక్తిని నాశనం చేయాలని విపక్ష కూటమి భావిస్తోంది. తెలంగాణ కలలను కాంగ్రెస్ నాశనం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. గ‌త ప‌దేళ్ల‌పాటు బీఆర్ ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దోచుకుంది`` అని ప్ర‌ధాని మోడీ వ్యాఖ్యానించారు.

క‌విత‌పై కామెంట్లు

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో అరెస్ట‌యిన కేసీఆర్ త‌న‌య క‌విత‌పై ప్ర‌ధాని ప‌రోక్షంగా కామెంట్లు చేశారు. ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో ఇక్క‌డివారు క‌మీష‌న్లు తీసుకున్నార‌ని.. అందుకే అరెస్ట‌య్యార‌ని వ్యాఖ్యానించారు. క‌విత పేరు ఎత్త‌కుండానే మోడీ కామెంట్లు చేయ‌డం గ‌మ‌నార్హం. కాగా, తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ఏటీఎంలా వాడుకుందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పని చేస్తోందని దుయ్య‌బ‌ట్టారు.