Begin typing your search above and press return to search.

మోడీ అమిత్ షా పాత చింతకాయ మాటలు !

ఎన్నికలు వస్తున్నాయి. పోతున్నాయి. ఎన్ని ఎన్నికలు వచ్చినా కూడా కేంద్ర బీజేపీ అగ్ర నేతలు ఇద్దరూ మాత్రం అవే మాటలను వల్లె వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 April 2024 12:30 PM GMT
మోడీ అమిత్ షా పాత చింతకాయ మాటలు !
X

ఎన్నికలు వస్తున్నాయి. పోతున్నాయి. ఎన్ని ఎన్నికలు వచ్చినా కూడా కేంద్ర బీజేపీ అగ్ర నేతలు ఇద్దరూ మాత్రం అవే మాటలను వల్లె వేస్తున్నారు. గత దశాబ్ద కాలంలో దేశంలో లోక్ సభకు ఎన్నికలు జరిగినా లేక రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు ఉన్నా సరే నరేంద్ర మోడీ అమిత్ షా తమదైన పాత డైలాగులనే మళ్లీ మళ్లీ జనం మీదకు వదులుతున్నారు. వాటితోనే ఓట్ల చింతకాయలు రాల్చుకోవాలని చూస్తున్నారు.

వీటిని చూస్తున్న విశ్లేషకులు మాత్రం మోడీ షా ఇద్దరు మాటలు బొత్తిగా పాత చింతకాయ పచ్చడి మాటలుగానే ఉన్నాయని ఎద్దేవా చస్తున్నారు. ఎపుడూ కూడా ఈ ఇద్దరు నాయకులూ ఇందిరాగాంధీ నెహ్రూ అంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి మరీ కాంగ్రెస్ ని విమర్శిస్తున్నారు. దేశం ఏడున్నర దశాబ్దాల ముందుకు వచ్చేసినా ఎన్నిక ఎన్నికకూ రాజకీయం అంతా మారుతున్నా కూడా మోడీ షా మాటల గారడీ మాత్రం అక్కడే ఆగిపోయింది అన్న విమర్శలు దండీగా ఉన్నాయి.

నిజం చెప్పాలంటే ఇందిరాగాంధీ మరణించి నాలుగు దశాబ్దాల కాలం దాటింది. ఆమె ఏలిన కాలంలో నాటి పాలనను చూసిన వారు ఇపుడు దేశంలో ఒక్క శాతంగా కూడా లేరు అని అంటున్నారు. ఇక దేశానికి తొలి ప్రధానిగా సేవలు అందించిన నెహ్రూ జమానాను చూసిన వారు ఈ రోజుకీ జీవించి ఉండడం అంటే అసంభవమే అంటున్నారు.

ఈ రోజున దేశమంతా యువ ఓటర్లు ఉన్నారు. నూటికి అరవై శాతం యూత్ ఉన్న దేశం మనది. భారతీయ యువత తీరు ఎలా ఉంది అంటే ఈ రోజున జరిగిన దానిని రేపటికి మరచిపోయే నైజం. వారు అన్నీ లైట్ తీసుకునే తత్వం. అలాంటి వారి ముందు దశాబ్దాల వెనకన ఏదో అన్యాయం జరిగింది అంటూ పాత చింతకాయ కబుర్లు చెబితే చెల్లేనా అన్న చర్చ సాగుతోంది.

యూత్ ఆలోచనలు వేగంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా కెరీర్ ఓరియెంటెడ్ గా ఉంటాయి. వారి ఫక్త్ వాస్తవిక దృక్పధంలో ఉంటున్నారు. భౌతికవాదులు అని కూడా అనవచ్చు. ఏ భావోద్వేగాలకు పెద్దగా లొంగని కృంగని తత్వం ఈనాటి యూత్ ది. అలాంటి వారు చెవులలో నెహ్రూ ఇందిరా గాంధీ నాటి పాలన ఆనాడు జరిగిన అన్యాయం అంటూ ఏకరువు పెడితే ప్రయోజనం ఉంటుందా అన్నది ప్రశ్నగా ఉంది.

మరీ ముఖ్యంగా ఈనాటి తరం ఉపాధి కోసం చూస్తోంది. ఉద్యోగాల మీద ప్రశ్నిస్తోంది. మాకు ఏమి చేసింది ఈ దేశం అని అడుగుతోంది. ఈ దేశంలో ఉన్న వర్తమాన సమస్యల మీదనే దృష్టి పెడుతోంది. దేశంలో పెరిగిన నిత్యావసర ధరలు అలాగే దేశంలో ఉన్న వర్తమాన ఇబ్బందులు ఇవే వారికి పట్టింపు ఉంటాయి. ఇవే వారి మధ్యన చర్చకు వస్తూంటాయి. అలాంటిది వారిని ముందు పెట్టుకుని ఎప్పటివో జరిగిపోయిన విషయాలు చెప్పి పబ్బం గడుపుకుందామని చూస్తే అయ్యే పనేనా అని అంటున్నారు.

ఒక విధంగా చెప్పాలంటే 144 కోట్ల దాకా ఉన్న భారత దేశంలో తొంబై కోట్ల దాకా యువతరం ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఉన్న యువతరాన్ని ముందుకు నడిపించే ఆలోచనలు చేయాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు ఉంది. తాము రేపటి రోజున అధికారం చేపడితే వారికి ఏమి చేస్తాం, దేశాన్ని ఏ విధంగా నడిపిస్తామని వివరించాల్సి ఉంది.

అంతే తప్ప వెనకటి రోజులలో గొప్పగా చేశామని చెప్పినా వారికి అవసరం లేదు. అలా కాకుండా తాత ముత్తాతలు తప్పులు చేశారని వల్లె వేసినా వారికి అసలు అక్కరలేదు.ఎందుకంటే వారు చూసేది రేపటి భారతాన్ని వారు ఆలోచించేది రేపటి దేశం గురించి. మరి యూత్ ఆలోచనలు కానీ ఈ దేశంలో సగటు పౌరుల సమస్యలు కానీ పట్టుకోవడంలో బీజేపీ అగ్ర నాయకత్వం విఫలం అవుతోందా అంటే జవాబు అవును అనే వస్తోంది.

బీజేపీకి ఒక ఐడియాలజీ ఉంది. కానీ దాన్ని తీసుకుని వచ్చి దేశం మీద రుద్దాలనుకోవడమే పొరపాటు అంటున్నారు. దేశ భక్తి అవసరమే. అలాగే బలమైన భావజాలం కూడా ఉండాల్సిందే. కానీ ముందు యూత్ కి ఏది కావాలో అది చూసి వారిని తమ దారిలోకి తెచ్చుకోవాలి తప్ప తమ ఫిలాసఫీని వారి మీద పెట్టి ఇంకా గత పాలకుల దోషాలను వెతుకుతూ అంతా వారే చేశారు అంటే యూత్ ఎలా అట్రాక్ట్ అవుతుంది. ఎలా ఆమోదముద్ర వేస్తుంది అన్నది ప్రధానంగా ఆలోచించాలని అంటున్నారు. ఒక విధంగా బీజేపీ ట్రాక్ తప్పుతోందా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయని అంటున్నారు.