Begin typing your search above and press return to search.

డామిట్ కథ అడ్డం తిరిగింది !

అధికారంలో ఎవరుంటే వారి పంచన చేరిపోవడం రాజకీయ నాయకులకు రివాజుగా మారింది.

By:  Tupaki Desk   |   28 April 2024 11:46 AM GMT
డామిట్ కథ అడ్డం తిరిగింది !
X

అధికారంలో ఎవరుంటే వారి పంచన చేరిపోవడం రాజకీయ నాయకులకు రివాజుగా మారింది. ఇక తమ తమ పార్టీలను బలోపేతం చేసుకోవడం కోసం అనివార్యంగా పార్టీలోకి ఆహ్వానించడం అధికార పార్టీకి తప్పనిస్థితి అయింది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల తరపున ఎంపీలుగా పోటీ చేస్తున్న వారిలో అత్యధికులు బీఅర్ఎస్ నుండి వచ్చిన వారే. పెద్ద పెద్ద వాళ్లే పార్టీ మారుతుంటే చోటా లీడర్లు మనకెందుకు అన్న ధోరణి ప్రబలుతున్నది. అయితే రాష్ట్రవ్యాపితంగా చేరికల వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో అసంతప్తికి దారితీస్తుంది.

‘ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గోడలు దూకే నాయకుల్లారా.. ఖబడ్దార్‌’ అంటూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఏకంగా ఫ్లెక్సీలు వెల్వడం, వాటికి చెప్పుల దండలు వేసి పేడతో కొట్టిన ఆసక్తికర సంఘటన చోటు చేసుకున్నది. దీని వెనక ఉన్నది చేరికల పర్వమే కారణం.

మిర్యాలగూడ మున్సిపల్‌ చైర్మన్‌ తిరునగర్‌ భార్గవ్‌ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గత రెండు నెలలుగా ప్రయత్నిస్తుండగా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ వ్యతిరేకిస్తున్నారు. మాజీ మంత్రి జానారెడ్డి సర్దిచెప్పినా ఒప్పుకోలేదు.

అయితే భార్గవ్‌ తనతోపాటు మరో 12 మంది కౌన్సిలర్లను వెంటపెట్టుకుని శనివారం ఉదయం గాంధీభవన్‌లో పార్టీ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ విషయం స్థానిక వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ లు భగ్గుమన్నారు.

‘మా అనుమతి లేకుండా, మాకు సమాచారం ఇవ్వకుండా పార్టీలో ఎలా చేర్చుకుంటారు ? చేరికను నిలిపివేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పార్టీలో ఎవరిని చేర్చుకోవాలన్నా స్థానిక నేతలు, కార్యకర్తల అభిప్రాయం మేరకే జరుగాలని అన్నారు. జిల్లా మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి, సీనియర్‌ నేత జానారెడ్డికి తెల్వకుండా పార్టీ పెద్దలు చేరికలను ప్రోత్సహిస్తే సహించేది లేదని’ స్పష్టంచేశారు.

దీంతో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్ ‘ఈ చేరికలను నిలిపేస్తున్నామని, స్థానిక నాయకత్వంతో చర్చించాకే తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని ఒక ప్రకటన విడుదల చేయక తప్పలేదు. ఇటీవల దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన మాజీ కాంగ్రెస్ నేత కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ స్థానిక ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా జగ్గారెడ్డి సమక్షంలో పార్టీలో చేరాడు. పార్టీ టికెట్ రాలేదని పార్టీ కార్యాలయం తగులబెట్టిన వ్యక్తిని ఎలా చేర్చుకుంటాడని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు. వనపర్తిలో ఎమ్మెల్యే ప్రత్యర్ధులను బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై ఏకంగా ఆయన ఇంటి ఎదుట పెట్రోల్ పోసుకుని తనను కాల్చేయాలని ఎమ్మెల్యేకు అగ్గిపెట్టె ఇవ్వడం తీవ్ర దుమారం రేపింది. తాజాగా మిర్యాలగూడ చేరికలపై తిరునగరు బార్గవ్ వర్గం డామిట్ కథ అడ్డం తిరిగిందే అని నాలుక కరుచుకుంటున్నారట.