Begin typing your search above and press return to search.

ఢిల్లీ లిక్కర్ కేస్.. ఆయనకు ఎంపీ టికెట్.. టీడీపీకి సంకటమే

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   5 April 2024 4:30 PM GMT
ఢిల్లీ లిక్కర్ కేస్.. ఆయనకు ఎంపీ టికెట్.. టీడీపీకి సంకటమే
X

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ నుంచి మొదలై గోవా వరకు సాగిన ఈ స్కామ్ లో తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు చిక్కుకోవడమే విచిత్రం. సాక్షాత్తు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ అయిన కల్వకుంట్ల కవిత అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ పద్ధతి ప్రకారం నడుచుకుంటూ వచ్చింది. నిందితులుగా పేర్కొన్న ఒక్కొక్కరు అప్రూవర్ గా మారడంతో టార్గెట్ కేజ్రీని పూర్తిచేసింది. ఈ క్రమంలో కవిత అప్రూవర్ కాకుండా నిందితురాలిగానే ఉండిపోయారు.

ఆ తండ్రీకొడుకులు..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలుగు రాష్ట్రాల నుంచి వినిపించిన ప్రధాన పేర్లు మాగుంట శ్రీనివాసుల రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి. ఒంగోలు నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచారు శ్రీనివాసులరెడ్డి. ఈయన కుమారుడే రాఘవరెడ్డి. వీరి కుటుంబం దశాబ్దాలుగా లిక్కర్ వ్యాపారంలో ఉంది. అయితే, ఈ విధంగా ఢిల్లీ స్కాంలో ఇరుక్కుపోతుందని ఊహించలేదు. మరోవైపు ఈ కేసులో రాఘవ రెడ్డి జైలుకు వెళ్లారు. అనంతరం బెయిల్ పొందారు. కేజ్రీవాల్ పేరు చెప్పినందునే రాఘవకు బెయిల్ దక్కిందని.. లేదంటే ఇంకా జైల్లోనే ఉండేవారని ఆప్ ఎంపీ, నిన్నటివరకు లిక్కర్ స్కాంలో జైల్లో ఉన్న సంజయ్ సింగ్ తాజాగా ఆరోపించారు.

వైసీపీ వదిలించుకుంది.. టీడీపీ ఇరుక్కుంది

గత ఎన్నికల్లో నెగ్గినప్పటికీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఈసారి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధినాయకత్వం సుముఖత చూపలేదు. ఆయన కుటుంబం ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కోవడంతో జాగ్రత్తగా వ్యవహరించింది. ఇదే సమయంలో మాగుంటను చేర్చుకుంది టీడీపీ. అంతేగాక ఏకంగా రాఘవరెడ్డికే ఎంపీ టికెట్ ఇవ్వజూపింది. కానీ, ఢిల్లీ స్కాంలో ఆయన పాత్రపై పెద్దఎత్తున ఆరోపణలు ఉండడంతో వెనక్కుతగ్గింది. చివరకు తండ్రి శ్రీనివాసులరెడ్డికి టికెట్ కేటాయించింది.

పొత్తులో ఏమని ప్రచారం చేస్తారో?

టీడీపీ-జన సేన-బీజేపీ వచ్చే ఎన్నికల్లో కూటమిగా బరిలో దిగుతున్నాయి. ఢిల్లీ స్కాంలో కేంద్రం ప్రభుత్వం తీరుపైనే భారీగా విమర్శలు వచ్చాయి. మరిప్పుడు మాగుంట తరఫున ప్రచారంలో బీజేపీ నేతలు ఏం చెబుతారో చూడాలి. ఢిల్లీ స్కాంను పెద్దఎత్తున ప్రచారం చేస్తున్న బీజేపీ పెద్దలు.. అదే స్కాంలో ఆరోపణలున్న ఎంపీ తమ కూటమి తరఫున పోటీ చేస్తుండడాన్ని ఎలా సమర్థించుకుంటారనేది ఆసక్తికరం.