Begin typing your search above and press return to search.

వారెవ్వా.. ఈ జనసేన అభ్యర్థి ఆస్తి రూ.894 కోట్లు!

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీకి, పార్లమెంటుకు మే 13న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   20 April 2024 9:19 AM GMT
వారెవ్వా.. ఈ జనసేన అభ్యర్థి ఆస్తి రూ.894 కోట్లు!
X

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీకి, పార్లమెంటుకు మే 13న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటంతో అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసే కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉన్నారు.

నామినేషన్ల దాఖలు సందర్భంగా అభ్యర్థులు పేర్కొంటున్న ఆస్తుల వివరాలు హాట్‌ టాపిక్‌ గా మారుతున్నాయి. సుజనా చౌదరి వంటి కొందరు కోటీశ్వరులు తమకు సొంత కారు కూడా లేదని ఎన్నికల అఫిడవిట్‌ లో పేర్కొంటుంటే మరికొందరు తమ ఆస్తుల వివరాలను నిర్భీతిగా వెల్లడిస్తున్నారు.

ఈ క్రమంలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న లోకం మాధవి ఆస్తులు హాట్‌ టాపిక్‌ గా మారాయి. తాజాగా నామినేషన్‌ దాఖలు చేసిన ఆమె తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. మాధవికి ఏకంగా 894.92 కోట్ల ఆస్తులు ఉన్నాయి.

మిరాకిల్‌ పేరుతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ, విద్యా సంస్థలు, భూములు, ఆభరణాలు, నగదు, బ్యాంకు డిపాజిట్స్‌ వంటివి అన్నీ కలిపి తన ఆస్తులు 894.92 కోట్లు అని లోకం మాధవి వెల్లడించారు.

అదేవిధంగా తన బ్యాంకు ఖాతాలో రూ.4.42 కోట్లు నగదు, నగదు రూపేణా చేతిలో రూ.1.15 లక్షలు ఉన్నాయని వివరించారు. అలాగే తన చరాస్తులు విలువ మార్కెట్‌ రేటు ప్రకారం రూ.856.57 కోట్లు కాగా పేర్కొన్నారు. ఇక స్థిరాస్తుల విలువ రూ.15.70 కోట్లుగా ఉందన్నారు. అలాగే మాధవికి అప్పులు రూ.2.69 కోట్లు ఉన్నట్టు అఫిడవిట్‌ లో పేర్కొన్నారు.

కాగా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన లోకం మాధవి తొలిసారి 2019లో నెల్లిమర్ల నుంచి జనసేన తరఫున పోటీ చేశారు. 7633 ఓట్లు మాత్రమే సాధించారు. ఆ ఎన్నికల్లో ఆమె మూడో స్థానంలో నిలిచారు. వైసీపీ తరఫున పోటీ చేసిన బడుకొండ అప్పలనాయుడు గెలుపొందగా టీడీపీ తరఫున పోటీ చేసిన పతివాడ నారాయణస్వామి నాయుడు రెండో స్థానంలో నిలిచారు.

ఇప్పుడు మరోసారి లోకం మాధవి నెల్లిమర్ల నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టీడీపీ, బీజేపీ శ్రేణులు కూడా సహకరిస్తుండటంతో ఈసారి తన గెలుఫు ఖాయమనే ధీమాలో ఆమె ఉన్నారు. మరోవైపు వైసీపీ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు రంగంలో ఉన్నారు.