Begin typing your search above and press return to search.

వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చిన కేంద్ర మాజీ మంత్రి...!

వైసీపీకి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి బిగ్ షాక్ ఇచ్చారు. ఆమె పార్టీ ప్రాధనిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

By:  Tupaki Desk   |   3 April 2024 9:37 AM GMT
వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చిన కేంద్ర మాజీ మంత్రి...!
X

వైసీపీకి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి బిగ్ షాక్ ఇచ్చారు. ఆమె పార్టీ ప్రాధనిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కిల్లి కీలక కామెంట్స్ చేశారు. వైసీపీలో తనకు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయని ఆమె పేర్కొన్నారు. వైసీపీలో తనకు గౌరవం లేదని అన్నారు.

పదవుల కంటే తాను గౌరవానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని ఆమె చెప్పారు. తన ఆత్మ గౌరవానికి భంగం కలిగిన చోట తాను ఉండనని ఆమె తెగేసి చెప్పారు. వైసీపీలో చేరిన తరువాత క్యాబినెట్ ర్యాంక్ పదవి ఇస్తామని అన్నారని అలాగే ఎంపీ పదవుల ఆశలు పెట్టరని ఆమె అన్నారు.

చివరికి తాను జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిని కోరుకోకపోయినా ఇచ్చి దానిని కూడా ఎందుకు తీసేశారో చెప్పలేదని ఆమె మండిపడ్డారు. ఇలా తీరని అవమానాలకు వైసీపీలో గురి అయ్యానని కిల్లి కృపారాణి అన్నారు. మొత్తానికి కిల్లి కృపారాణి వైసీపీని వీడడం మాత్రం ఆ పార్టీకి తీరని నష్టమే అంటున్నారు.

ఆమె శ్రీకాకుళం జిల్లాలో వైద్యురాలిగా పేరు తెచ్చుకున్నారు ఆమె సమాజ సేవ కూడా చేస్తూ ఉండేవారు. ఆమెలోని సేవా భావాన్ని గుర్తించి రాజకీయాల్లోకి ఆహ్వానించిన వారు డాక్టర్ వైస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన ఆమెకు 2004లో శ్రీకాకుళం ఎంపీ టికెట్ ఇచ్చారు.

ఆమె తొలి ఎన్నికల్లోనే అప్పటి టీడీపీ దిగ్గజ నేత ఎర్రన్నాయుడుతో పోటీ పడ్డారు. అయితే ఓటమి చూశారు. కానీ 2009లో మాత్రం ఆమె అదే ఎర్రన్నాయుడుని ఓడించి జెయింట్ కిల్లర్ అనిపించుకున్నారు. మేధావిగా బీసీ మహిళగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. దాంతో యూపీయే టూలో ఆమెకు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహా మంత్రి పదవి దక్కింది.

ఇక కాంగ్రెస్ తనకు ఇచ్చిన గౌరవానికి ఆమె తలవొగ్గి 2014లో ఎన్ని పార్టీలు పిలిచినా ఆ వైపు చూడకుండా ఓడిపోతామని తెలిసి కూడా ఎంపీగా పోటీ చేశారు. ఆ సమయంలోనే వైసీపీ ఆమెకు ఆహ్వానం పలికింది. అయితే ఆమె అపుడు ఆ పార్టీ ఆహ్వానాన్ని మన్నించలేదు. దాంతో 2019 నాటికి ఆమె పార్టీలో చేరినా చివరి నిముషంలో చేరారు అని కారణం చూపించి టికెట్ ఇవ్వలేదు.

ఇక ఆమెకు పార్టీలో రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం సాగినా అది దక్కలేదు. ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదు అని ఆమె వర్గం ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో ఆమెని శ్రీకాకుళం ఎంపీ సీటు నుంచి పోటీ చేయిస్తారని వార్తలు వచ్చినా ఆ సీటూ దక్కలేదు.

మొత్తానికి బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన కిల్లి కేవలం పార్టీ పదవిలో కొద్ది రోజులు మాత్రమే వైసీపీలో పని చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఆమె పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నపుడు సరిగ్గా పనిచేయలేదని పార్టీని పటిష్టం చేయలేదని వైసీపీ నేతలు అంటున్నారు. అందుకే ఆమెకు పార్టీలో తగిన పదవులు రాలేదని అంటున్నారు.

మరో వైపు చూస్తే జిల్లాలోని వైసీపీ సీనియర్ నేతలే ఆమెకు పదవులు దక్కకుండా అడ్డుపడ్డారని కూడా ప్రచారంలో ఉంది. ఆమెకు శ్రీకాకుళం ఎంపీ సీటు ఇచ్చి ఉంటే కచ్చితంగా వైసీపీ గెలిచేదని, అలా జరగడం ఇష్టం లేని వారు కొంతమంది కావాలనే అధినాయకత్వాన్ని తప్పుదోవ పట్టించి ఆమెకు లోక్ సభ టికెట్ లేకుండా చేసారని అంటారు. ఏది ఏమైనా మంచి నాయకురాలిగా విద్యావంతురాలిగా ఉన్న కిల్లి కృపారాణి పార్టీకి గుడ్ బై చెప్పడం ఈ కీలక సమయంలో వైసీపీకి నష్టమే అంటున్నారు.

ఇదిలా ఉంటే కిల్లి కృపారాణి కాంగ్రెస్ లో చేరుతారు అని అంటున్నారు. ఆమె ఇటీవల హైదరాబాద్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిశారు అని అంటున్నారు. కాంగ్రెస్ తరఫున ఆమె ఎంపీ సీటుకు పోటీ చేస్తారు అని అంటున్నారు. ఆమె పోటీ చేస్తే వైసీపీకే నష్టం అని అంటున్నారు. ఎందుకంటే వైసీపీ నుంచి పోటీ చేస్తున్న పేడాడ తిలక్ కూడా కాళింగ సామాజిక వర్గానికి చెందిన వారే. దాంతో ఆ ఓట్లు చీలితే వెలమ సామాజిక వర్గానికి చెందిన కింజరాపు రామ్మోహన్ కి అది ప్లస్ అవుతుందని అంటున్నారు.