Begin typing your search above and press return to search.

సినిమా వాళ్ల ఫోన్లు కూడా ట్యాపింగ్‌ చేశారు!

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్‌ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

By:  Tupaki Desk   |   29 March 2024 11:03 AM GMT
సినిమా వాళ్ల ఫోన్లు కూడా ట్యాపింగ్‌ చేశారు!
X

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్‌ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌ చాట్‌ లో ఆయన మాట్లాడారు. యాదగిరిగుట్ట పేరును మార్చడమే కేసీఆర్‌ చేసిన మొదటి తప్పన్నారు. అక్కడ అవినీతి జరిగిందని.. పార్లమెంటు ఎన్నికల తర్వాత విచారణ చేపడతామని తెలిపారు. యాదాద్రి పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తామని హాట్‌ కామెంట్స్‌ చేశారు.

కేసీఆర్‌ చేసిన పాపాల వల్లే కరవు వచ్చిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. వర్షం అంటే కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌ అంటే వర్షమన్నారు. దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కేసీఆర్‌ సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు.

గేట్లు తెరవకముందే కాంగ్రెస్‌ లోకి ఇతర పార్టీల నేతలు వస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కేసీఆరే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని గుర్తు చేశారు. నల్గొండ జిల్లాను ఆయన నాశనం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అక్కడికి వస్తారని నిలదీశారు.

అధికారులతోనూ కేసీఆర్‌ పాపపు పనులు చేయించారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిప్పులు చెరిగారు. దీంతో వారిప్పుడు భయంతో నిద్రపోవడం లేదన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అనేది ఏ రాష్ట్రంలోనూ చూడలేదన్నారు. కేసీఆర్‌ ప్రతిదీ రాజకీయం చేశారని విరుచుకుపడ్డారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని కేటీఆరే ఒప్పుకున్నారన్నారు. ఇద్దరి, ముగ్గురి ట్యాపింగ్‌ పై వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు బుక్‌ చేయాలన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ పై కేసు ప్రూవ్‌ అయితే కేటీఆర్‌కు పదేళ్ల జైలు శిక్ష పడుతుందని కోమటిరెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు.

సినిమా వాళ్ళ ఫోన్స్‌ కూడా ట్యాపింగ్‌ చేశారని తెలిసిందన్నారు. కేసీఆర్‌ వద్ద ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిన వాళ్లు కాశీం రజ్వీ కంటే గొప్పోల్లు అని కోమటిరెడ్డి అన్నారు. సినిమా వాళ్ళ ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంలో తనకు ఇప్పటి వరకూ ఎలాంటి ఫిర్యాదులూ చేయలేదన్నారు. తనకు ఫిర్యాదు చేస్తే అప్పుడు ఆలోచిస్తామన్నారు.

త్వరలో సినిమా థియేటర్ల పై రైడ్లు జరుగుతాయని కోమటిరెడ్డి వెల్లడించారు. ఇష్టం వచ్చినట్లు సినిమా హాల్లో రేట్లు పెంచి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. తన మంత్రిత్వ శాఖ విభాగాలు సినిమా హాళ్లపై నిఘా ఉంచాయన్నారు. తేడా వస్తే థియేటర్లను సీజ్‌ చేస్తామని హాట్‌ కామెంట్స్‌ చేశారు.

సినిమా ప్రమోషన్లకు, క్లాపింగ్‌ లకు తాను రానని ఇండ్రస్టీలో ఉన్న వారికీ చెప్పానని కోమటిరెడ్డి తెలిపారు. ఎక్కువ బడ్జెట్‌ పేరుతో సినిమాలు తీసి టికెట్‌ రేట్లు పెంచాలి అంటే కష్టమని చెప్పారు. దీని వల్ల చిన్న సినిమాను నమ్ముకున్న వాళ్లకు తీరని నష్టం జరుగుతోందని అభిప్రాయపడ్డారు.